నారా వారి లెక్కలు..మోసపూరిత ప్రకటనలు

హైదరాబాద్ లో ఐదెకరాల భూమికి రూ.71 లక్షలా..!
ఆస్తులపై విచారణకు సిద్ధమేనా..?
హైదరాబాద్ః నారా లోకేశ్ ప్రకటించిన ప్రకటించిన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తూర్పారబట్టారు. దొంగ లెక్కలు చూపించి ఇవే తన ఆస్తులని చెప్పడంపై మండిపడ్డారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తులను ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, కార్యకార్యలు కూడా విశ్వసించే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ఉన్న రూ. 45 లక్షల ఆస్తులు నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆయన అమ్మడానికి సిద్ధమేనా అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఏపీలో జరిగినంత అవినీతి మరెక్కడా జరగలేదని, సింగపూర్ తో చేతులు కలిపి కొన్ని వేల కోట్లు కూడగట్టుకున్నారని దుయ్యబట్టారు. 

ఐదెకరాలు రూ.71 లక్షలా..?
హైదరాబాద్ లో ఐదెకరాల భూమి ఎక్కడైనా రూ. 71 లక్షలకు వస్తుందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కొనడానికి సిద్ధంగా ఉన్నవాళ్లను తీసుకొస్తే అమ్ముతారా అని నిలదీశారు. చంద్రబాబు ఆస్తులపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించేందుకు సిద్ధమేనా అని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు, లోకేశ్ స్థలాలు పక్కపక్కనే ఉన్నా విలువల్లో మాత్రం తేడాలు చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారని  అంబటి విమర్శించారు. 

ఎవరైనా నమ్ముతారా నారా లెక్కలు..!
కూరగాయలు, పాలు అమ్మి ఎవరైనా కోట్లు కూడగడుతారా అని అంబటి నారా కుటుంబాన్ని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలో హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసి కమీషన్లు కొట్టేశారు. ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా వాళ్లంతట వాళ్లు తప్పుడు లెక్కలు చూపిస్తే ఇక్కడ నమ్మడానికి ఎవరూ సిద్దంగా లేరని అంబటి అన్నారు. చంద్రబాబు కుమారుడికి, ఆయన సతీమణికి ఐటెక్ సిటీ దగ్గర పదిఎకరాలు ఉందని, అదంతా  రూ.కోటిన్నర మాత్రమే ఉంటుందని చూపించడంపై అంబటి ఎద్దేవా చేశారు. ఆస్తుల విలువ చెప్పేటప్పుడు మార్కెట్ విలువ చెప్పాలిగానీ, రిజిస్ట్రేషన్ ధర కాదని హితవు పలికారు.

Back to Top