నిర్బంధ విద్య నిర్వీర్యం దిశగా బాబు అడుగులు

ప్రభుత్వ బడులకు తాళం
కార్పొరేట్‌ స్కూళ్లకు రెక్కలు
వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత
చదువుకు దూరమవుతున్న పేదలు

‘‘ప్రాథమిక హక్కుగా విద్య’ను నిర్బంధంగా అమలు చేస్తాం. ప్రతి బాలుడు/బాలిక తప్పనిసరిగా పదోతరగతి వరకు చదివేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు  చేయడం తెలుగుదేశం పార్టీ విధానం. నివాస ప్రాంతాల్లో ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్‌ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్‌ను  ఏర్పాటు చేయాలన్నదే టీడీపీ విధానం’’ అని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో పాటు తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నేటికీ ఆ హామీలు అమలు చేయకపోగా నిర్బంధ విద్యను నిర్వీర్యం చేసే విధంగా బాబు అడుగులు వేస్తున్నాడు. 

5 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందిచడం విద్యా హక్కు చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఈ వయసు బాలబాలికలను బడిబాట పట్టించాల్సి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వాధినేత చంద్రబాబు తన పార్టీ నాయకుల స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లని అధికార పార్టీకి చెందిన నేతలవే. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, కేశవరెడ్డి వంటి కార్పొరేట్‌ స్కూళ్లకు విపరీతమైన డిమాండ్‌ పెంచారు. ఈ స్కూళ్లలో చదివిన వారికే బెస్ట్‌ ర్యాంకులు ఇస్తుండటంతో సర్కార్‌ స్కూళ్లలో చదివించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేయడం ఒక కారణమైతే.. హేతుబద్దీకరణ పేరిట రాష్ట్రంలోని నిర్ణీత సంఖ్యలో విద్యార్థులు లేరన్న సాకుతో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూతవేసేందుకు సర్కార్‌ నిర్ణయించింది. స్కూళ్లు అందుబాటులో లేని 6 నుంచి 14 ఏళ్ల అర్హులైన పిల్లలకు ప్రయాణ చార్జీలను చెల్లించేలా ఆంధ్రప్రదేశ్‌ రైట్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ టు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ రూల్స్‌–2010 నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ఇటీవల ఈ ఉత్తర్వులు వెలువరించింది. గతేడాది 1500 ప్రాథమిక పాఠశాలలను మూసేసిన ప్రభుత్వం ఈ సారి ఆరువేల స్కూళ్లను క్లోజ్‌ చేసేందుకు ఉత్తర్వులు వెలువరించింది. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక(1–5) తరగతుల వారికి కిలోమీటర్‌ పరిధిలోపు, ప్రాథమికోన్నత(6–8) తరగతుల వారికి మూడు కిలోమీటర్లలోపు పాఠశాలలుండాలి. హేతుబద్దీకరణ చేస్తూ ఈ పాఠశాలలను మూసివేయనుండటంతో లక్షలాది మంది పిల్లలకు స్కూళ్లు అందుబాటులో లేకుండాపోనున్నాయి.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీ‘జులం’
ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతుండటంతో పిల్లలను కూలీనాలి చేసుకొని చదివిద్దామనుకున్న తల్లిదండ్రులకు ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులను చూసి బెంబేలెత్తున్నారు. ఒకటో తరగతిలో చేర్పించేందుకు అడ్మిషన్‌ ఫీజు రూపేనా రూ.3 నుంచి రూ.5 వేలు, వార్షిక ఫీజు రూ.15 వేలు, పుస్తకాలకు రూ. 5 వేలు, యూనిఫాం, షూష్‌ వంటి కొనుగోలుకు రూ. 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం మానేసి, వెంట కూలీ పనులకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని విద్యా రంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు టీడీపీ సర్కార్‌ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే స్కూళ్లు అందుబాటులో లేకపోతే అర్హులైన పిల్లలకు ప్రయాణ చార్జీలు చెల్లిస్తామంంటూ యాక్ట్‌లో సవరణలు చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమలులోకి వస్తే 5,475 యూపీ స్కూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరో వైపు ప్రాథమిక పాఠశాలల్లో రెండో దశ హేతుబద్దీకరణలో భాగంగా 6 వేల ఏకోపాధ్యాయ స్కూళ్లను మూసేయించే దుర్మార్గపు ఆలోచన చేస్తోంది. ఈ స్కూళ్లు మూత పడితే లక్షలాది మంది పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. 

కార్పొరేట్‌ స్కూళ్లన్నీ టీడీపీ నేతలవే
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలను నిర్వీర్యం చేసి తమ పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని పేరుగాంచిన కార్పొరేట్‌ స్కూళ్లలో అధిక శాతం అధికార తెలుగు దేశం పార్టీకి చెందినవే కావడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లను మూత వేస్తే..అందులో చదువుతున్న చాలా మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లలో చేరుతారని ప్రభుత్వ ఆలోచన. ఇదే జరిగితే డబ్బులేని పేదలు చదువుకు దూరమయ్యే ప్రమాదం నెలకొంటుంది.

భర్తీకానీ ఉపాధ్యాయ పోస్టులు
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాన్ని సర్కార్‌ మరిచిపోయింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం 2014 అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసి డీఎస్సీ ద్వారా 10,313 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. నెలకోసారి డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం, వాయిదా వేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. నిరుద్యోగులకు సర్కార్‌ చెలగాటం ఆడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 20 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా రాష్ట్రంలో 2015–2016 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరని ప్రైమరీ, యూపీ స్కూళ్లు 483 ఉన్నాయి. 

కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు
 రాష్ట్రంలోని 13 జిల్లాలో నడుస్తున్న 352 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు సహా ఉపాధ్యాయులు, సిబ్బందిని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం తొలగించింది. ఒక్కో కేజీబీవీలో ఒక ఎస్‌వో, సబ్జెక్ట్‌ టీచర్లు ఏడుగురు, పీఈటీ, ఏఎన్‌ఎం, అకౌంటెంట్, అటెండర్, స్కావెంజర్, స్వీపర్, కంప్యూటర్‌ ఆపరేపటర్, స్కిల్‌ ఇన్‌స్ట్రక్టర్, కుక్, ఇద్దరు వాచ్‌మెన్లు ఉండాలి. ఇలా రాష్ట్రంలో 352 పాఠశాలల్లో 7,744 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కో కేంద్రంలో అకౌంటెంట్, వాచ్‌మెన్లు మిహా మిగిలిన 19 మందిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకన్నారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 6,688 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు.

వైయస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యకు పెద్ద పీట
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత విద్యకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు టీచర్ల కొరత తీర్చడంతో పాటు మౌలిక వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు పెంచడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిణామాలు కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రధాన ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే చట్ట సభల్లోనూ. బయట ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల మూతవేసే విధానాన్ని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సర్కార్‌ తీరును తూర్పారబట్టారు. ప్రభుత్వం పునరాలోచించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధమవుతోంది.. చట్టాల్లో మార్పు రావాలి..పేదలందరికి ఉచిత విద్య అందుబాటులో ఉంటేనే వంద శాతం అక్షరాస్యత సాధ్యమవుతోంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Back to Top