తెలుగు తమ్ముళ్ల దోపిడీకి పగ్గాలు

జన్మభూమి కమిటీల పేరుతో పెత్తనం
కీలకమైన లబ్దిదారుల ఎంపిక మీద కన్ను
సమాంతర వ్యవస్థ నడిపించేందుకు సన్నాహాలు

హైదరాబాద్: అవినీతి లో ఆరితేరిపోయిన చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్లకు అదే పాఠాలు బోధిస్తున్నారు. అందినంత వరకు దోచుకొనేందుకు మార్గాల్ని సూచిస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సమాంతర పాలనకు తెర దీస్తున్నారు.

అంతా జన్మభూమి మయం
మొన్నటి ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపు సాధించిన చంద్రబాబు.. పాలన మీద పట్టుకోసం అదే అక్రమ మార్గాల్ని ఎంచుకొంటున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో సామాజిక కార్యకర్తలు, మహిళా కార్యకర్తలతో నింపేస్తున్నారు. అధికారులను నామమాత్రంగా చేస్తున్నారు. కార్యకర్తలు అంటే పూర్తిగా తెలుగుదేశం నాయకులు అని వేరే చెప్పనక్కర లేదు. వీరిలో ఒకరిని కమిటీ ఛైర్మన్ గా నియమిస్తున్నారు. దీంతో జన్మభూమి కమిటీ అంటే పచ్చ చొక్కాల కమిటీగా మారిపోయింది.

లబ్దిదారుల ఎంపిక మీద కన్ను
ఎస్సీ ఫైనాన్స్ కమిషన్, బీసీ ఫైనాన్స్ కమిషన్, ఎస్టీ ఫైనాన్స్ కమిషన్, మైనార్టీ కమిషన్ ల ద్వారా లబ్దిదారుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇప్పటి దాకా అధికారులు, బ్యాంకర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని సంప్రదించి లబ్దిదారుల్ని ఎంపిక చేసే వారు. అప్పుడు ఆయా వర్గాల లబ్దిదారుల ప్రగతిని పర్యవేక్షించటం సాధ్యం అయ్యేది. కానీ, జన్మభూమి కమిటీలకే ఈ ఎంపికను అప్పగిస్తుండటంతో అంతా అవినీతి మయంగా మారుతోంది. తెలుగుదేశం కార్యకర్తలకు లంచాలు సమర్పిస్తేనే లబ్దిదారులుగా ఎంపిక అయ్యేందుకు అవకాశం ఏర్పడుతోంది.

సమాంతర పాలనకు శ్రీకారం
ప్రజలకు సంబంధం లేని వ్యక్తుల్ని కమిటీల్లో నింపి, ఆయా కమిటీల చేతుల మీదుగా పాలనను నడిపించటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా సమాంతర వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న సంగతి అర్థం అవుతోంది. పూర్తిగా పార్టీ క్యాడర్ కు పగ్గాలు ఇచ్చి అరాచక వ్యవస్థను రూపు దిద్దుతున్నారనే మాట ఉంది.
Back to Top