దేనిదారి దానిదే


అవును చంద్రబాబు అన్నట్టు దేనిదారి దానిదే. బిజెపితో వైరం, మోదీతో యుద్ధం, కేంద్రంపై మరోసారి అవిశ్వాసం ఇవన్నీ రాజకీయ అవసరాలు. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ ను వందశాతం మనం ఒప్పుకుని తీర వలసిందే. పోలవరం సందర్శనకు వచ్చిన గడ్కరీతో బాబుగారి ముసిముసి నవ్వుల మంతనాలు చూసిన ఎవ్వరికైనా విషయం బోధపడుతుంది. కేంద్రంతో బాబుగారి కయ్యం పెదవులకే  పరిమితం అని. కేంద్ర మంత్రితో పోలవరం సందర్శనకు వెళ్లాలా వద్దా అన్న మీమాంశలో ముఖ్యమంత్రి కొట్టు మిట్టాడారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం గడ్కరీతో కలిసి సిఎమ్ పోలవరం సమావేశాలకు హాజరౌతున్నారని ప్రభుత్వం చెబుతోంది. హోటల్ నుంచే శంకుస్థాపనలు, జాతికి అంకితాలు చేసిన ఈ ప్రభుత్వ పెద్దలు ఖుషీగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం, అదే కేంద్ర మంత్రులతో దోస్తీ దేనిదారి దానిదే అంటున్న చంద్రబాబు తీరు అసలు సిసలు రాజకీయ వాదికి పెట్టింది పేరు. 
మోదీ అంతు చూస్తా, కడిగేస్తా, ఆరేస్తా అంటూ ప్రగల్బాలు పలికి నీతిఆయోగ్ సమావేశంలో వంగి వంగి దండాలు పెట్టిన ముఖ్యమంత్రిని మరిచిపోలేం. నేడు కేంద్ర మంత్రితో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నానని చెప్పే కాకమ్మ కబుర్లనీ నమ్మలేం. తమలపాకుతో మేం ఒకటిస్తాం, కాకి ఈకతో మీరోటివ్వండి అన్నట్టుంది బిజెపి, టిడిపి వ్యవహారం. పేరుకు ప్రచండ యుద్ధం, చూడబోతే అట్టు ముక్కల ఫైటింగ్ ఇదీ ఈ రెండు పార్టీల తీరు. 

కేంద్రం మోసం చేసేసింది, అన్యాయం చేసేసింది అని దీక్షలు చేసిన చంద్రబాబు నేడు రాజకీయం వేరు అని అంటున్నాడు. కేంద్ర మంత్రితో ఒక్క సమావేశం అయ్యిందో లేదో వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని కితాబులిస్తున్నాడు. ఓ పక్క కాంగ్రెస్ ను పొగుడుతూ, మరోపక్క బిజెపీకి సాగిల పడుతూ ఏ ఎండకాగొడగు పడుతున్న బాబు, ప్రతిపక్షం బిజెపితో కలిసి పోయిందని విమర్శించడం ఎంత విడ్డూరం! ప్రత్యేక హోదా రాకపోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్సే కారణమని నిస్సిగ్గుగా మాట్లాడే ముఖ్యమంత్రి, కేంద్రంపై పోరాటం అంటూ, కేంద్ర మంత్రులను పొగడటంలో అర్థం ఏమిటి? యూటర్న్ బాబు నాలుక ఎన్నిసార్లు మడత పడుతుంది? పోలవరం ముంపు ప్రాంతం మునుపటి కంటే రెండింతలు ఎలా అయ్యిందని గడ్కారి అడిగిన మర్నాడే చంద్రబాబు కాళ్ల బేరానికి వచ్చేశాడు అనుకోవాలా? లేక ముందు నుంచీ సాగుతున్న ఒప్పందం ప్రకారం ఈ ఇరు పార్టీలు ఆడుతున్న డ్రామాలనుకోవాలా? ఏదేమైనా బిజెపితో రాష్ట్ర ప్రభుత్వ సంబంధ బాంధవ్యాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో గడ్కరీ పర్యటన మరోసారి రుజువు చేసింది. ఈ బంధం ధృఢమైనదని, ప్రతిపక్షంపై చంద్రబాబు వేసేవి నిందలనే నిజం నిగ్గుతేలింది. 









 
Back to Top