చంద్రబాబు పాలనలో రాజ్యాంగ హననం

జనవరి 26 రిపబ్లిక్ డే. మనని మనం పాలించుకోడానికి ఓ నిర్దుష్టమైన పద్ధతిని తయారు చేసుకుని అమలు చేసుకున్నరోజు. రాజ్యాంగాన్ని నిర్మించుకుని సుపరిపాలనను సాధించుకునేందుకు సిద్ధపడ్డ రోజు. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలు రద్దయి, భారతదేశ ప్రజల కోసం ఉపయోగపడే కొత్త చట్టాలను పొందుపరుచుకున్న రాజ్యాంగం వచ్చిన రోజు. దేశం యావత్తూ గర్వంగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజ్యాంగ హననం గురించి మాట్లాడుకోవాలి. అందుకు కారణమైన పాలకుడి దాష్టీకాల గురించి మాట్లాడుకోవాలి. 

అబేంద్కర్ అప్పుడే చెప్పాడు  రాజ్యాంగం మంచిదే కాని మంచివాళ్ల చేతిలో ఉంటే మంచిది, చెడ్డవాళ్ల చేతిలో ఉంటే చెడ్డదే అవుతుంది అని. ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి చేతిలో రాజ్యాంగ హక్కుల హననం జరుగుతోంది. అడుగడుగునా చట్టాల అతిక్రమణే జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సాంఘీక, ఆర్థీక, రాజకీయ న్యాయం దక్కాలి. ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలి. హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వం లభించాలి. కానీ తెలుగుదేశం పాలనలో విభజన తర్వాతి ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగ హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. అడుగడుగునా చంద్రబాబు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, అతిక్రమిస్తూ, ప్రజల హక్కులను నాశనం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుతుస్తున్నాడు.  

ప్రజా తీర్పుపై గౌరవం లేదు

పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల్లో ఒకటి ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కొనడం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, మంత్రులను పదవులు, డబ్బు, కాంట్రాక్టుల ఆశచూపి పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించాడు చంద్రబాబు. అలా అధికార పార్టీలోకి చేరిన ప్రతిపక్ష నేతలతో రాజీనామాలు చేయించకుండా, ప్రతిపక్ష పార్టీ పేరుతోనే చట్టసభల్లో కొనసాగిస్తూ పదవులు ఇచ్చి ప్రజాతీర్పును, రాజ్యాంగాన్నీ నవ్వుల పాలు చేస్తున్నాడు. చివరికిపక్క రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనబోయి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు. కనీసం అప్పుడైనా నైతిక విలువలకు కట్టుబడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోగా వీలున్న చోటల్లా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటారు.  

సాంఘీక, ఆర్థీక, రాజకీయ న్యాయం శూన్యం

ఆంధ్రప్రదేశ్ లో చట్టం పెద్దలకొకలా, పేదలకొకలా మారిపోయింది. అగ్రకులాల దాష్టీకానికి బలౌతున్న దళితులు, మైనారిటీలకు సాంఘీక సమానత్వం అనే న్యాయం తెలుగుదేశం పాలనలో దక్కే అవకాశమే లేదు. గరగపర్రులాంటి ఉదంతాలు రోజుకోటి వెలుగుచూస్తున్నాయి. దళితులపై దాడులు, బహిష్కరణలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. రాజధాని భూసేకరణలో, ప్రాజెక్టులు, పరిశ్రమలకోసం జరిగే భూసేకరణల్లో పేదల భూములు, అసైన్డ్ భూములను కారుచౌకగా అటు ప్రభుత్వం, ఇటు టిడిపి నేతలు సొంతం చేసుకుంటున్నారు. కోట్లు విలువైన భూమిని భయపెట్టి, బెదిరించి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో జరుగుతున్న భూదందాలు ఆర్థిక అసమానతలకు కారణం అవుతున్నాయి. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, సదావర్తి వంటి వ్యవహారాల్లో ప్రజలకు రాజకీయ న్యాయం అందకుండా పోతోంది. పచ్చనేతల గుప్పెట్లోనే న్యాయం విలవిల్లాడుతోంది.

వర్గాధిపత్య దోపిడీ ప్రభుత్వం 

రాజకీయ అధికారం అంటే ఆధిపత్యానికి, అవినీతికి, అధర్మప్రవర్తనకి, సంపద పోగేసుకోడానికి అని నిర్వచనం చెప్పాడు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమార్జనకి తెలుగు తమ్ముళ్లకు పచ్చజెండా ఊపాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడ్డగోలుగా చట్టాల అతిక్రమణకు పాల్పడ్డాడు. మాఫియాలు సృష్టించి సహజ సంపదను దోచుకున్నాడు.  ప్రాజెక్టుల్లో అవినీతిని తప్ప చుక్కనీరు పారించిన పాపాన పోలేదు. సొంతవాళ్లకు కాంట్రాక్టులు, బినామీలతో లాలూచీలు గత నాలుగేళ్లుగా ఇదే చంద్రబాబు పాలన. కుల, మతాలకు అతీతంగా ప్రజాపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి కుల వివక్షను అడుగడుగునా ప్రదర్శించాడు. బిసిల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే అంటుంటే కులాధిపత్యానికి కొమ్ములురాకుండా ఉంటాయి. రాజ్యాంగం చెప్పిన కులమతాలకు అతీతమైన సమానత్వం, సామరస్య భావన ప్రజలకు కలుగుతుందా.? కోడలు మగబిడ్డను కంటానంటే వద్దంటానా అంటూ లింగ వివక్షకు కూడా చంద్రబాబు పూనుకున్నాడు. ఆయన పాలనలో మంత్రులు దళితులను అవమానించడం, మహిళలపై చేయి చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు కాల్ మనీ రాకెట్ అన్నీ చంద్రబాబు అండ చూసుకుని రెచ్చిపోతున్న టిడిపి నేతల దౌర్జన్యాలకు సాక్ష్యాలే. 

అడుగడుగునా ప్రజలను వారి హక్కులను నాశనం చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు పాలనలో ఈ రాష్ట్రం జరుపుకునే గణతంత్ర దినోత్సవం నామమాత్రమే కానీ, నిజమైనది, నిఖార్సైనదీ మాత్రం కాదు. 

Back to Top