దీక్షకు వెల్లువలా ప్రజామద్దతు...!

ఆందోళనకరంగా వైఎస్ జగన్ ఆరోగ్యం...!
ఐదవ రోజు కొనసాగుతున్న దీక్ష..!
ఆరోగ్యం సహకరించకున్నా ఆగని హోరు..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదవరోజు కొనసాగుతోంది. రోజురోజుకు వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఐదో రోజు ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారింది. వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. శరీరంలో చక్కెర నిల్వలు భారీగా పడిపోయాయి. గంటగంటకు పల్స్ రేట్ పడిపోతుంది. కీటోన్ లెవల్స్ పెరుగుతున్నాయి. దీంతో, కుటుంబసభ్యులు సహా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆందోళన చెందుతున్నారు. 

ఉద్యమం తీవ్రతరం..!
మాటతప్పని మడమ తిప్పని వ్యక్తిగా వైఎస్ జగన్ మొక్కవోని దీక్షతో తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రోజురోజుకు ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఐతే, వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఐదురోజులుగా వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కు ఏమాత్రం నష్టం వాటిల్లినా చంద్రబాబు ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు. ముక్తకంఠంతో  ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ వైఎస్ జగన్ చేపట్టిన సమరదీక్షకోసం గొంతెత్తి నినదిస్తున్నారు. 

మొములో చెరగని చిరునవ్వు..!
ఐదు రోజులుగా అశేష జనవాహిని వైఎస్ జగన్ దీక్షాస్థలికి వచ్చి హోదాపై గర్జిస్తున్నారు.  వైఎస్ జగన్ కు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున గుంటూరు నల్లపాడు రోడ్డుకు పోటెత్తుతున్నారు. తండోపతండాలుగా దీక్షాస్థలికి తరలివస్తూ వైఎస్ జగన్ సంఘీభావం తెలుపుతున్నారు. ఆరోగ్యం సహకరించకున్నా వైఎస్ జగన్ తనకు బాసటగా నిలిచేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరిస్తూనే ఉన్నారు. చేయి చేయి కలిపి అందరికీ అభివాదం చేస్తున్నారు. చిన్నా, పెద్దా అంతా కదిలివచ్చి జగన్ కు అండగా హోదా కోసం గళమెత్తుతున్నారు. 

వాడవాడలా రిలేదీక్షలు,ధర్నాలు..!
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరువాడ అంతా ఏకమై వైఎస్ జగన్ కు మద్దతుగా కదం తొక్కుతున్నారు.వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు, కర్షకులు, శ్రామికులు, కార్మికులు , పలు యూనియన్లు సహా  వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు....దీక్షకు సంఘీభావంగా  రాష్ట్రంలో రిలేదీక్షలు, ధర్నాలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు. మానవహారం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోదా సాధించేదాకా వైఎస్ జగన్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి హోదా ప్రకటించాలని ప్రజలు, ప్రతిపక్షాల నేతలు  డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top