దాస్తే..నిజం దాగేనా?




  - రుణ‌మాఫీలో చంద్ర‌బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు
-  అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలిన నిజం
- నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి అభాసుపాల‌వుతున్న ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశం సాక్షిగా...మంత్రి పరిటాల సునీత డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, అలాంటి ప్రతిపాదన ఇప్పుడేమీ లేదని, ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుణమాఫీ ఎంత మాయో, డ్వాక్రారుణాల మాఫీ హామీ ఎంత బూటకమో...ప్రతిపక్షం నెత్తీనోరూ కొట్టుకుని చెబుతూనే వుంది. ఇంతకాలం బుకాయింపులతో నెట్టుకొచ్చిన అధికారపక్షానికి ఇప్పుడిక నిజం చెప్పక తప్పలేదు. ఇప్పటికి ఇదొకటే. నెరవేర్చని కొండవీటి చాంతాడంత హామీల చిట్టా వుంది. 
అటు చంద్రబాబుగారు, ఇటు చినబాబుగారు, టీడీపీ నాయకులు అన్నీ చేసేశామని, చెప్పిందీ కాక, చెప్పంది చేసేశామని, ఇక అంతా ఆనంద ఆంధ్రప్రదేశ్‌ అనీ, ప్రజలంతా సుఖసంతోషాలతో తేలిపోతున్నారని, బాబుగారు ప్రచారార్భాటాలతో ప్రకటించేస్తున్నారు. బాబుగారి రాజకీయమంతా ’పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగే చందమే’. తాను చెప్పిందే జనం నమ్మేస్తారన్న గుడ్డి నమ్మకం. నమ్మకున్నా, ఏదో విధంగా జనానికి గంతలు కట్టి నమ్మించగలనన్న గట్టి నమ్మకమే ఆయన్ను... ’ఆ విధంగా...ముందుకు ’ నడిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బాబుగారి గతాన్ని మరిచి, సీనియారిటీతో సిన్సియర్‌గా మారేవుంటాడనుకున్నారు ఎపి ఓటర్లు. హామీలతో అరచేతిలో వైకుంఠం కూడా చూపించేసరికి...అందరూ నమ్మేశారని కాదుకానీ,  ఎక్కువమంది నమ్మారు. అంతేకాదు, నరేంధ్రమోడీగారిని ఒక పక్క, పవన్‌కళ్యాణ్‌గారిని మరోపక్క పెట్టుకుని బాబుగారు బలప్రదర్శన చేసేసరికి...గాలివాటు కాస్త దారి మళ్లింది. బాబుగారు గద్దెనెక్కి కూర్చుకున్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో....బాబుగారు గుండెమీద చెయ్యివేసుకుని, చెప్పుకోదగ్గ పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక ఎన్నికల ముందు కంగారు మొదలైంది. కానీ అపారరాజకీయానుభవం ఆ కంగారును, భయాన్ని ఎలాగూ బయటపడనీయదు. ఈలోపుగానే తాను మంచోడే...తాను జతకట్టినవారే చెడ్డవారే అన్న తనకు సహజంగా అబ్బిన రాజకీయం ప్రదర్శించడం మొదలుపెట్టారు.

అడుగడుగునా అవినీతి తాండవిస్తున్నా, భూకబ్జాలకు, భూదందాలకు హద్దూ అదుపులేకున్నా బాబుగారు కిమన్నాస్తిగా వుండటానికి కారణమేంటో ఆయనకే తెలియాలి. కాకుంటే, ప్రతిపక్షాలు చెబుతుండే...అన్నిటి వెనుకా అయనే...ఆయన కూడా వాటాదారుడే అన్నది నిజమే అయిఉండాలి. ఇప్పుడు బాబుగారి రాజకీయమంతా ఒక్కటే. తాను నిజాయితీ పరుడని చాటుకోవడం. తాను చేసిన, చేయబోయే పనుల్లో ఎలాగూ అది వుండదుకాక వుండదు. మరేం చెయ్యాలి? ఇన్నాళ్లు జతకట్టి, జై బీజేపీ, జైజై నరేంద్రమోదీ అని తిరిగిన బాబుగారు...ఇప్పుడు అదే నోటితో ఆ పార్టీనీ, మోదీనీ తప్పుపడుతున్నారు. తప్పు వారిపై వేస్తే...తన తప్పులన్నీ ఒప్పులై పోతాయని ఆయన రాజకీయం. 
తనపై వచ్చిన ఏఆరోపణకు సమాధానం చెప్పడు. అవినీతి చిట్టాను విడదీసి చూపినా పట్టించుకోడు. కేసులేస్తే స్టేలు తెచ్చుకున్నాడు. అన్నింటా విఫలమై, ఈ నాలుగున్నరేళ్లకాలంలో అంత్యంత అసమర్ధపాలన సాగించిన చంద్రబాబుగారు...రేపటి ఎన్నికలకోసం ఇక నుంచి వెయ్యని పిల్లిమొగ్గలు వుండవు. ప్రజల చెవుల్లో పూలుపెట్టేందుకు చేసే ప్రయత్నాలకు కొదవే వుంటుంది.

బాబుగారికి తెలిసింది ఒక్కటే....అహం బ్రహ్మాస్మీ. గతంలో వారికి చరిత్రలే లేనట్టు, తెలివే లేనట్టు అటు పీసీ అలెగ్జాండర్‌ ప్రసక్తీ అయనే తెస్తారు. అబ్దుల్‌కలాంగారి పేరునూ ఆయనే చెబుతారు. పాపం కలాం...బాబుగారు లేకుండే ఆవుల్‌ ఫకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌కలాంగానే అనామకంగా మిగిలిపోయేవారన్నది బాబుగారి మేధస్సు తాలూకు దురంహకారం. అప్పటికే అబ్దుల్‌కలాం పేరు దేశంలో మారుమ్రోగిపోతోందని, యువజనం, విద్యాలోకం, శాస్త్రసాంకేతిక ప్రపంచంలో ఆయనెప్పుడో భారతరత్న అని బాబుగారికి  తెలుసో లేదో మరి? 
అప్పటి ఎన్డీయే కాలంలో వాజ్‌పేయిగారు, అద్వానీ గారు భారత రాష్ట్రపతిగా పీసి అలెగ్జాండర్‌ గారి పేరును ముందుకు తెచ్చింది నిజమే. ఆ ప్రెసిడెంట్‌ ఎంపిక ఏకగ్రీవంగా వుండాలన్నది వారి అభిలాష. అప్పటికీ సివిల్ సర్వీసెస్‌ అధికారిగారిగా, మూడునాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా, ప్రధానులకు సలహాదారు పనిచేసిన అపారఅనుభవం, నిజాయితీ, ధీటులేని ప్రతిభ వున్న వ్యక్తి. నెహ్రూ కుటుంబానికి ఎంతో దగ్గరివాడిగా పేరున్నవారు అలెగ్జాండర్‌. మరి ఏమయిందోగానీ విపక్షనేత సోనియమ్మ దగ్గరకు ఆయన పేరు వెళ్లగానే, ఆయమ్మ ’నో..’ అని చెప్పిందట. అప్పుడు రక్షణమంత్రి జార్జిఫెర్నాండెజ్‌గారి దగ్గర సలహాదారుగా వున్న అబ్దుల్‌కలాంగారి పేరును ..మంత్రిగారే ప్రతిపాదించారు. ప్రధాని వాజ్‌పేయి ఓకే చేశారు. సోనియమ్మ సరే అంది. అబ్దుల్‌కలాంగారు భారతరాష్ట్రపతి అయ్యారు. మరి మధ్యలో బాబుగారు ఏం చేశారు? మహా అయితే, తాను సైతం అని తన వాటా తాను తీసుకోవడానికి కలాంగారికి ఫోన్‌ చేసివుంటారు. పాపం...అహంలేని అబ్దుల్‌కలాంగారు ఈవిషయం చెవినపడ్డా ఖండించేవారు కాదు. అప్పడు ఖండించలేదు. ఇప్పుడు ఖండించలేదు. వాజ్‌పేయిగారిక వచ్చి చెప్పలేరు. నేను కాదంటే అయ్యేదా? అని సోనియమ్మ నోరిప్పదు. మరి ఇలాంటి అవకాశాన్ని బాబుగారు ఎందుకు వదులుకుంటారు. ఇప్పటికే లక్షన్నొకటోసారి వారిని ప్రధానిని, వీరిని రాష్ట్రపతిని నేనే చేశానని చెప్పారు. అంతటితో ఆగక ఇప్పటికీ చెబుతూనే వున్నారు. ఆయన మాటలకు అబ్బురపడి, ఇంతకన్నా పెద్దమనిషి ఎవరుంటారని నమ్మజనం వుండకపోరన్నది బాబుగారి ధీమా. అదే ధీమాతో మళ్లీ ఎన్నికలకు బాబుగారు తన టక్కుటమారాది విద్యల ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. ఈసారి ఎపీ ప్రజలు మళ్లీ మోసపోతారా? కోరి కొరివితో తలగోక్కుంటారా? పిచ్చిపట్టి కష్టాలు కొనితెచ్చుకుంటారా?

పి.ఎస్ః ఇంతకు ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా...పాదయాత్రలో వున్న ప్రతిపక్షనాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి, స్పీకర్‌గారికి ఒక ప్రశ్న సంధించారు. మీరు ప్రలోభపర్చుకుని పదవులిచ్చిన ఆ నలుగురు మంత్రులు ఏ పార్టీకి చెందినవారు? టీడీపీనా?  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనా? అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం, నిజాయితీ  మీకున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనకు వ్యతిరేకంగా...అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన మమ్మల్ని ప్రశ్నించడం...దొంగే..దొంగా..దొంగా అన్నట్లుగా లేదా? ప్రతిపక్షనేత వై.యస్‌.జగన్‌ ప్రశ్నకు సూటిగా, డొంకతిరుగుడు లేకుండా సమాధానం వస్తుందనుకుంటున్నారా? 


 
Back to Top