డాక్టర్ వైయస్ఆర్ నడయాడిన నేల

సత్తుపల్లి, 11 మే 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరుకొని శనివారానికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయ్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారమే సత్తుపల్లికి చేరడం కాకతాళీయమే అయినప్పటికీ విశేషం. నాడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాదయాత్ర చేస్తూ సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్ వద్ద బహిరంగసభలో ప్రసంగించారు. తాళ్లమడ గ్రామ శివారులో బస చేశారు. మరుసటి రోజున యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. షర్మిల కూడా శనివారం సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తాళ్లమడ శివారులోనే బస చేయనున్నారు. ఆదివారం  శ్రీమతి షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. శుక్రవారం నాడు యాత్ర ముగిసే నాటికి పాదయాత్ర 144 రోజులు పూర్తయ్యింది. 1929.6 కిలోమీటర్లు శ్రీమతి షర్మిల నడిచారు.

తొలుత శుక్రవారం ఉదయం శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వీఎం బంజర శివారు నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రరావు బంజర, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి మీదుగా నడిచారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,929.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ ఉన్నారు.

Back to Top