దేశంలో సంక్షోభం.. నారా వారింట వైభోగం

– నోట్ల రద్దుతో  భారీగా పెరిగిన ఆస్థులు
– ఆర్థిక నిపుణులకే అందని నారా ఆస్థుల వ్యవహారం
– పచ్చి అబద్ధాలతో జనాల చెవిలే పువ్వు పెట్టే ప్రయత్నం 

చంద్రబాబు కుటుంబం ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా సంచలనమే. ఆయన చెప్పే లెక్కలు అమర్త్యసేన్‌ లాంటి నోబెల్‌ బహుమతి అందుకున్న ఆర్థిక మేధావులకు కూడా అంతుపట్టడం లేదు. ఆర్థిక నిపుణుల నుంచీ గ్రామాల్లో ఉండే చదువుకోని వ్యక్తి వరకు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆయన చెప్పే ఆస్తుల లెక్కలు వింటే ఎవరైనా మూర్ఛతో పడిపోవాల్సిందే. మొత్తం ఆస్తుల విలువ రూ. 330 కోట్లు అంటున్నాడు కానీ, వాటి విలువ కనీసం 3 లక్షల కోట్లపైనే ఉంటుంది. 
  • ఆస్తులకు లెక్కలు కట్టాలంటే బాబే  
జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల భవనం విలువ రూ.23 లక్షలేనట. పక్కనే 1,285 గజాల లోకేశ్‌ భవనం విలువ రూ.2.36 కోట్లే. హవ్వ.. 160 గజాల తేడాలోనే ఎంత వ్యత్యాసం. భవనాన్ని ఎంత అద్భుతంగా నిర్మించినా ఇంత తేడానా. పంజగుట్టలోని భవనం ధర కూడా కేవలం రూ.73 లక్షలు. మాదాపూర్‌లో 924 గజాల స్థలానికైతే రూ.3.37 లక్షలే. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో!

అన్నీ వంద శాతం దొంగలెక్కలు 
తన కుటుంబ ఆస్తులు రూ.41 కోట్లేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించుకున్నారు. జనం నవ్వుతున్నారని తెలిసినా ఆస్తులు ప్రకటించిన ప్రతిసారీ అవే ‘విలువలు’.. 

1988లో కోర్టుకిచ్చిన అఫిడవిట్లో కుటుంబ ఆస్తి 77 ఎకరాలుగా చెప్పిన బాబు... దాన్లో తన వాటాను సాగు చేస్తున్నానని, ఏటా రూ.36 వేలు వస్తోందని వెల్లడించారు.
1999లో స్పీకర్‌కు ఆస్తుల వెల్లడి
నాటి అఫిడవిట్లో తన ఆస్తులు రూ.7.7 కోట్లుగా తెలిపిన బాబు
2004 నాటికి రూ.20 కోట్లకు; 2009 నాటికి రూ. 60 కోట్లకు చేరిందని విలువ కట్టాడు. ఇవన్నీ ఆఫిడవిట్ల ద్వారా బాబు చెప్పిన అధికారిక లెక్కలు మాత్రమే. ఆయన చెప్పిన దాని ప్రకారమే 20 ఏళ్లలో రూ.60 కోట్ల సంపాదన వచ్చి చేరింది. వాటి మార్కెట్‌ విలువలు చూసినా బాబు చెప్పినదానికి ఎన్నో రెట్లు అధికం.

హెరిటేజ్‌ విలువ తక్కువ చేసి..
తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న విలువైన భూములు, భవనాలు, కంపెనీల్లో వాటాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో ఉన్న నగదు, వాహనాలు... ఇలా అన్నిటి విలువా కలిపి ఆయన చెప్పిన మొత్తం లెక్క మాత్రం రూ.41 కోట్లు. ఇదెంత పచ్చి అబద్ధమో చెప్పటానికి ఒకే ఒక్క లెక్క చాలు. అదేంటంటే... ఆయన చెప్పిన దాని ప్రకారం అధికారికంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌లో బాబు కుటుంబానికి 50 శాతం వాటా ఉంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన సంస్థ కనక ఇప్పుడు దాని విలువ రూ.500 కోట్లు. అంటే బాబు కుటుంబ ఆస్తి ఒక్క హెరిటేజ్‌ ఫుడ్స్‌లోనే... అది కూడా ఆయన చెప్పిన ప్రకారమే రూ.250 కోట్లు. కానీ ఆయన ఎన్నో రెట్లు తక్కువగా చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఆయన చెప్పినవన్నీ ‘100%’ దొంగ లెక్కలని తేల్చడానికి!!

మదీనాగూడలో ఉంది పదెకరాలేనా..?
మదీనాగూడలోని భూమి లోకేశ్, భువనేశ్వరిలది. బాబు చెబుతున్నది ఇది పదెకరాలని. కానీ ఈ కాంపౌండ్‌ వాల్‌లో ఉన్న భూమి కనీసం 40 ఎకరాలు ఉంటుందనేది స్థానికుల మాట. పదెకరాలకు బాబు కట్టిన విలువ 73.8 లక్షలు. మార్కెట్‌ విలువైతే రూ.15 కోట్ల పైనే. ఈ లెక్కనే దీని విలువ రూ.150 కోట్లు. మరి మొత్తం భూమిని లెక్కేస్తే? బాబు ఎన్ని రెట్లు దొంగలెక్కలు చెప్పినట్లు?

1978 నాటికి బాబు ఆస్థి రెండున్నర ఎకరాలు
చంద్రబాబు ఎప్పుడు ఆస్తుల లెక్క చెప్పినా... 1988లో తమ కుటుంబానికి 77 ఎకరాలుండేదని, దాన్ని కుటుంబీకులంతా పంచుకున్నామని చెబుతుంటారు. కానీ బాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది 1978లో. మంత్రి అయిందీ అప్పుడే! మరి అప్పటికి ఆయన ఆస్తులేంటి? ఎప్పుడూ చెప్పరెందుకు? దీనికి సమాధానం ఒక్కటే. అప్పటికి ఆయన తండ్రి ఖర్జూరనాయుడికి నారా వారి పల్లెలలో ఉన్న ఆస్తి అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మ పసుపు కుంకుమగా తెచ్చుకున్న భూమి రెండెకరాలు. మొత్తం రెండున్నర ఎకరాలు.

రూ. 36 వేల ఆదాయంతో హెరిటేజ్‌ ఎలా పెట్టారు
1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. దానికి జవాబుగా బాబు అఫిడవిట్‌ వేస్తూ... ‘‘నేను సంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను స్వయంగా కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏటా రూ. 36,000 ఆర్జించా’’ అని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం... ఎన్టీఆర్‌ కుమార్తెను వివాహమాడటం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992–93 నాటికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. ఏడాదికి రూ. 36,000 ఆర్జించిన బాబు ఆరేళ్లలో అంత డబ్బెలా సంపాదించారు? భువనేశ్వరి కార్బయిడ్స్‌ కంపెనీ పెట్టి దివాలా తీసి, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు తప్ప ఏ వ్యాపారం మీదా రూపాయి కూడా సంపాదించిన దాఖలాలు లేవు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది?

1999 నాటికి రూ.7.7 కోట్లకు చేరిన ఆస్తి!
1994లో ముఖ్యమంత్రి అయిన బాబు... 1999లో తన ఆస్తుల్ని స్పీకర్‌ ఎదుట ప్రకటించారు. తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు దాన్లో వెల్లడించారు. అన్ని కోట్లు ఎలా సంపాదించారు? అప్పట్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ కూడా నష్టాల్నే నమోదు చేసింది. మరి బాబు ఆస్తులెలా పెరిగాయి?
జూబ్లీహిల్స్‌లోని ఈ కోట విలువ బాబు చెప్పిన ప్రకారం రూ. 23 లక్షలు. ఇది నిజంగా పాతిక కోట్లుండదా? అంటే వంద రెట్లు తక్కువ చూపించినట్లు కాదా? 

2009 నాటికి రూ.60 కోట్లకు
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రెట్టింపు కావాలంటే ఆరేళ్లు తప్పనిసరి. కానీ బాబు ఆస్తులు ఎంత వేగంగా పెరిగాయంటే... 2004 నాటికి 20 కోట్లకు చేరాయి. 2009 నాటికి ఏకంగా 60 కోట్లయ్యాయి. ఇవన్నీ బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పినవే సుమా!! అది కూడా బాబు తాను కొనుగోలు చేసిననాటి విలువలను మాత్రమే చెప్పారు. మరి మార్కెట్‌ విలువ 30 రెట్లు ఎక్కువేనన్నది అబద్ధమా? అన్ని కోట్లు ఎలా పోగేశారు. 

బాబు చెప్పని కుటుంబ ఆస్తుల కథ...
భువనేశ్వరి: ఆస్తి రూ. 33 కోట్లట! మూడేళ్ల ఆదాయం రూ. 34 కోట్లు... చంద్రబాబు చెప్పినదాని ప్రకారం తన భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.33 కోట్లు. కానీ వాస్తవమేంటో తెలుసా...? 2008–2011 మధ్య మూడేళ్లలో భువనేశ్వరి ఆదాయం రూ. 34 కోట్లు. ఇదెక్కడైనా సాధ్యమా? ఆస్తుల్ని బట్టే కదా ఆదాయం వచ్చేది? ఎంత ఆస్తి లేకుంటే ఇంత ఆదాయం వస్తుంది? జనం ఈ మాత్రం ఆలోచించగలరనే విషయం బాబుకెందుకు తట్టదు?

భువనేశ్వరి ఆదాయం...
2010–11లో రూ. 13.50 కోట్లు. 2009–10లో రూ. 6.58 కోట్లు. 2008–09లో రూ. 13.00 కోట్లు. ఇది ఆదాయపుపన్ను శాఖకు స్వయంగా భువనేశ్వరి సమర్పించిన లెక్క. ఈ మూడేళ్లలో ఈ ఆదాయంపై ఆమె చెల్లించిన ఆదాయపు పన్నే అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు లెక్కలు ఎవరిని మోసం చేయడానికన్నట్టు?

2008–09 వరకు లోకేశ్‌ నిరుద్యోగి
2008–09వ సంవత్సరం దాకా లోకేశ్‌ ఎక్కడా ఉద్యోగం చేసిన దాఖలాలు లేవు. అప్పటిదాకా చదువుతూనే వస్తున్నారు. అందుకే 2008–09 ఐటీ రిటర్నులో తన వ్యక్తిగత ఆదాయాన్ని రూ.86,350గా చూపించారు. దానిపై రూ. 4,280 పన్ను చెల్లించారు. తరవాత హెరిటేజ్‌ ఫుడ్స్‌లో చేరటంతో ఆయనకు జీతం ద్వారా ఆదాయం వచ్చి... 2009–10లో రూ.29.27 లక్షల ఆదాయాన్ని, 2010–11లో రూ.37.18 లక్షల ఆదాయాన్ని చూపించారు. గమనించాల్సిందేంటంటే 2008–09 వరకు పెద్దగా ఆదాయమేదీ లేని నారా లోకేశ్‌... మైనర్‌గా ఉన్నప్పటి నుంచీ భారీగా ఆస్తులు కూడబెడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిందాలిలో మొదలెట్టి... హైటెక్‌ సిటీ పక్కన మదీనాగూడ, కొండాపూర్‌లలో ఎకరాలకు ఎకరాలు కూడబెట్టేశారు. నాయినమ్మ ఇచ్చిన గిఫ్ట్‌లతో మదీనాగూడలో భూమితో పాటు బంజారాహిల్స్‌లో భవనమూ సొంతమైంది. తరవాత హెరిటేజ్‌ ఫుడ్స్‌ సహా వివిధ కంపెనీల్లో షేర్లను సమీకరించుకున్నారు. ఇవన్నీ చంద్రబాబునాయుడి ఆస్తులో... లోకేశ్‌ ఆస్తులో తెలియటం లేదూ!!? ఆదాయం లేని లోకేశ్‌ కర్ణాటక, ముంబయిలలో విలువైన భూములెలా కొన్నారు? చెప్పు బాబూ!! 

2008–09 వరకు కూడా నిరుద్యోగిగా ఉన్న నారా లోకేష్‌ ఇప్పుడు ఉన్నట్టుండి రూ. 330 కోట్లకు వారసుడయ్యాడు. ఐదు నెలల కిందట వరకు రూ. 14.5 కోట్లుగా ఉన్న ఆయన ఆదాయం ఈ ఐదు నెలలు తిరిగే నాటికి 22 రెట్లు పెరిగి 330.14 కోట్లకు చేరింది. నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని పెద్ద పెద్ద బిలియనీర్లే టాప్‌ టెన్‌లో వారి స్థానాలు గల్లంతయ్యారు. బిలియనీర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించబడ్డాయి. అయితే నారా వారి ఆస్థులు మాత్రం నోట్ల రద్దు తర్వాతే అనూహ్యంగా పెరగడం నిజంగా ఆశ్చర్యం, సందేహాస్పదం. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం అంటే ఇదేనా బాబూ..! 
Back to Top