సెక్యూరిటీ ఉద్యోగాల్లో వసూళ్లు

సర్వజనాస్పత్రిలో టీడీపీ నేతల నయాదందా
మంత్రి, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రత్యేక కోటా
ఒక్కో పోస్టుకు రూ.30 వేల వరకు ‘దండు’కున్న వైనం
 
అనంతపురం మెడికల్ : సర్వజనాస్పత్రిలో తెలుగు తమ్ముళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతోంది. పారిశుద్ధ్య పనుల్లో, సెక్యూరిటీ గార్డుల భర్తీలో నయాదందా కొనసాగిస్తున్నారు. ఉద్యోగం గ్యారంటీగా ఇప్పిస్తామంటూ రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందుకు  టీడీపీ ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నారు.  అనంతపురం మెడికల్ కళాశాల, అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ సర్వీసెస్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎజైల్ సంస్థ నిర్వహించేది. ఇటీవల తిరుపతికి చెందిన ‘జై బాలాజీ’ సెక్యూరిటీ సర్వీసెస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నెల మొదటి వారంలో మెడికల్ కళాశాలతో పాటు సర్వజనాస్పత్రిలోని ఎజైల్ సెక్యూరిటీ గార్డులను స్వాధీనం చేసుకున్నారు.

కళాశాలలో 12 మంది ఉండగా ఎలాంటి మార్పు జరగలేదు. సర్వజనాస్పత్రిలో మాత్రం కొత్త నిబంధనలు వచ్చాయి. 500 పడకల ఆస్పత్రి కావడంతో ప్రతి 30 పడకలకు ఉదయం షిఫ్ట్‌లో ఇద్దరు, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టుల్లో ఒక్కో సెక్యూరిటీ గార్డు ఉండేలా నియామకాలు చేపట్టాల్సి ఉంది. మొత్తం 74 మంది అవసరం. పాత ఏజెన్సీ కింద 26 మంది ఉండగా కొత్త ఏజెన్సీ అదనంగా నియమించుకోవాల్సి రావడంతో అసలు కథ మొదలైంది. అధికార పార్టీ  ప్రజాప్రతినిధులు తాము సూచించిన వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని సదరు ఏజెన్సీ ప్రతినిధికి అల్టిమేటం జారీ చేశారు. ఓ మంత్రి సోదరుడు 20 వరకు దరఖాస్తులను పంపి వాళ్లందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. టీడీపీలో ప్రధాన పోస్టులో ఉన్న ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మె ల్యే కూడా తమ వాళ్లను తీసుకోవాల్సిం దిగా ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న ఓ ఎంపీ అనుచరులు కూడా రంగంలోకి దిగి ఏకంగా గొడవపడ్డారు. ఆస్పత్రిలోని ఓ డాక్టర్ వద్ద వారం క్రితం పంచాయితీ జరగడం,  సదరు నేత అనుచరులు బెదిరింపులకు పాల్పడడం అన్నీ జరిగిపోయాయి.  ‘అంతా వాళ్లకేనా.. మా ఎంపీ చేతకానోడా.. చూస్తాం.. మీరెలా డ్యూటీలు చేస్తారో.. ఇన్నాళ్లూ ఆస్పత్రి గురించి సరిగా పట్టించుకోలేదు. ఇక నుంచి మా సారు కూడా ఆస్పత్రికి వస్తారు. మీ కథ చెబుతాం’ అని చెప్పడంతో కంగుతిన్న ఏజెన్సీ ప్రతినిధి ఇప్పటికే ఉద్యోగాల కోసం నేతలు చేసిన సిఫార్సుల గురించి వాళ్లకు వివరించినట్లు సమాచారం. దీంతో ‘అదంతా మాకు తెలీదు. మా వాళ్లకు ఉద్యోగాలు కావాల్సిందే’ అని తేల్చిచెప్పడంతో సదరు ఎంపీ అనుచరులకు నాలుగు పోస్టులు ‘రిజర్వ్’ చేసినట్లు తెలిసింది.

కాగా నేతల పేరుతో రంగంలోకి దిగిన అనుచరులు ఎక్కడికక్కడ దందా ప్రారంభించారు. కొంత మందితో ఒక్కో పోస్టుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. సాధారణంగా సెక్యూరిటీ పోస్టుకు పదో తరగతి విద్యార్హతతో పాటు శారీరక దృఢత్వం, ఎత్తు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా కొందరి విషయంలో అవేమీ పట్టించుకోకుండానే నియామకాలు చేపట్టారు. పైగా నేతలు సిఫార్సు చేసిన వారి దరఖాస్తులు నేరుగా వాళ్ల అనుచరుల నుంచే ఏజెన్సీ ప్రతినిధికి రావడం శోచనీయం. 

To read this article in English: http://bit.ly/1TKySOg 

తాజా వీడియోలు

Back to Top