పరవళ్లు తొక్కుతున్న అవినీతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి వరదలై పొంగుతోంది. సాగునీటి పారుదల
రంగంలో అయితే పరవళ్లు తొక్కుతోంది. కేవలం నాలుగు ప్రాజెక్టుల విషయంలో లెక్కలు
తీసినా గుండె గుభేల్ మంటుంది. అక్షారాల  రూ. 748 కోట్లు లూటీ చేసిన నాలుగు ప్రాజెక్టుల
వివరాలు చూద్దాం. 

గోరకల్లులో రూ.350
కోట్లు 

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్‌ఆర్‌బీసీ)
56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని
గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది.
శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్‌ఆర్‌బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి
గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది.
ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు.
సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్
వెంచర్‌లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం
గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది.

గోరకల్లు
ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ. 350 కోట్లు కొట్టేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. పెదబాబు
డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన
కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్ ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి
ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా
చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు
స్ప‌ష్టం చేస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం
సిద్ధం చేశారు. 

హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు

హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ
పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ
రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె
నుంచి వైయ‌స్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఎకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత ద‌క్కించుకుంది.
ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది.
ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు.

బాబు స‌ర్కార్ అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి నిధులు
దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి
సొరంగం పనులను రద్దు చేసి,
ఏకేఆర్ కోస్టల్
సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.
శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా నామినేషన్‌పై అప్ప‌గించారు.
రూ. పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. కాబ‌ట్టి సొంత
పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారు. ఆర్కే కన్‌స్ట్రక్షన్స్
సంస్థ 300 మీటర్ల పనులను చేసింది. ఇందుకు ఆ సంస్థకు
రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ. 16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి అంచనాలు
పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్ప‌గించి దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు.
ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే
రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం
చేసుకున్నారు.  

పులిచింతలలో రూ. 300 కోట్లు

 కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో
నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు
అక్టోబర్ 15,
2004న దివంగత ముఖ్య‌మంత్రి
వైయ‌స్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్
పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ద‌క్కించుకుంది.
టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం
తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర
జాప్యం చేసింది. ఒక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత
కదలిక వచ్చింది.

పెదబాబు  వ్యూహం మేర‌కు 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్
జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ
రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. పులిచింతల
ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై
మంత్రి ఒత్తిడి తెస్తున్నారు.

 

అవుకులో రూ.44
కోట్ల లూటీ

        గాలేరు
- నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు.
జీఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు
టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్‌సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్)
సంస్థ చేజిక్కించుకుంది.

        టన్నెల్
తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్‌మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు
చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి
వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్‌సీసీ - మేటాస్ సంస్థ
జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి
రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్
ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి
ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు సైతం తగ్గాయి. సిమెంట్ ధరలు
స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే
ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు
చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించారు. అది తనకు తెలియకుండానే
జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి
మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ తొల‌గిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది.

Back to Top