<br/><br/> హైదరాబాద్: విభజన అనంతరం తీవ్రంగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పించాలని వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ క్రియాశీల పోరాటం చేస్తోంది. 2014 సాధారణ ఎన్నికలు జరిగిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తొలుత గళం విప్పింది వైఎస్సార్‌సీపీయే. ఈ విషయమై అధికారపక్షమైన టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. వైఎస్ జగన్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేకహోదా కావాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి కంటే ముందే నరేంద్రమోదీని ఈ విషయమై వైఎస్ జగన్ కలుసుకున్నారు. 2014, మే 19 వ తేదీన ఆయన తమ పార్టీ ఎంపీలతో పాటు వెళ్లి మోదీని కలిసి ప్రత్యేక హోదా కావాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల భారీగా నష్టపోయిన రాష్ట్రం కనుక చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని వినతిపత్రాన్ని సమర్పించారు. అప్పట్లో ప్రధానిని వైఎస్ జగన్ కలవడాన్ని కూడా అధికార పక్షం టీడీపీ రాజకీయం చేసింది. ఆ విషయాన్ని జగన్ పట్టించుకోలేదు.<br/>ఈ ఏడాది ఫిబ్రవరి 15, మార్చి 30, జూన్9, 10 తేదీల్లో వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రంలోని ఇతర పెండింగ్ అంశాలను కేంద్ర పెద్దల దృష్టికి తెచ్చారు. శాఖల వారీగా సమస్యలను ఆయా మంత్రుల దృష్టికి తెచ్చారు. ఆయా సందర్భాల్లో పెండింగ్ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉద్వేగాలు చోటు చేసుకున్నప్పుడు కూడా జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పన్ను రాయితీలు ప్రకటించినప్పుడు ఇవి ఎంతమాత్రం సరిపోవని......హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రకటించిన తరహాలో ఆంధ్రప్రదేశ్ కు పన్ను రాయితీలు వర్తింపజేయాలని కోరుతూ వస్తున్నారు.<br/> 2015 మార్చిలో మరోసారి ఎంపీలతో ఢిల్లీ వెళ్లిన జగన్..... ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి వివరించారు. అలాగే ఈ ఏడాది జూన్ 9వ తేదీన కూడా వైఎస్ జగన్ రాష్ట్రపతిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్్టను మూడేళ్లలో పూర్తి చేయాలని కూడా వివరించారు. ఇదే అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్ మాసాల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులను కలిశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంమత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలు అమలుచేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక హోదా అభిస్తే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతారని, తద్వారా ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయని జగన్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్రత్యేక హోదా సాధించేందుకు అందరమూ కలిసి కృషి చేద్దామని పిలుపు నిచ్చారు.