కాంగ్రెస్‌కు మందు దొరికింది

కాంగ్రెస్‌కు మందు దొరికింది  
(వాసం మేకు అనే ఓ పరికరం)

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో శివరాత్రికి తీర్థం నిర్వహిస్తారు. అందులో బెల్లం జీళ్ళు అక్కడికక్కడే తయారుచేస్తుంటారు. పాకం దశకు చేరిన బెల్లాన్ని గోడకు కొట్టిన వాసం మేకుకు తగిలించి గట్టి పడేదాకా లాగి ముక్కలు చేసి, నువ్వుపప్పు అద్ది అమ్ముకుంటుంటారు. వాసం మేకు, బెల్లం పాకం ఇదంతా ఎందుకంటారా? ఒక్కసారి గాంధీ భవన్­లోకి వెళ్ళి పరిశీలిస్తే విషయం తెలిసిపోతుంది.

రకరకాల కారణాల వల్ల నిన్నమొన్నటిదాకా నిర్మానుష్యంగా ఉన్న గాంధీ భవన్ ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది. వచ్చే వాళ్ళు తప్ప, బయటకు వెళ్ళేవాళ్ళు కనిపించడం లేదు. ఒకటే సందడి. ఎవరికి వారు తమతమ వివరాలను ఓ పుస్తకంలో చకచకా రాసేస్తున్నారు. సమయం లేదు... తొందరగా రాయండి... ఇక మన సమస్యలన్నీ పరిష్కారమైనట్టేనని కొందరు భరోసా ఇస్తున్నారు. ఆ రాసే విషయాల్లో మీ బలాలు, బలహీనతలు ఏమిటో కూడా దాచుకోకుండా రాయండి. ఎందుకంటే అవి తెలిస్తే తీర్చేయడం చాలా వీజీ. అని ఓ నేత సెలవిస్తే.. అంతా అయిపోనాది కదా.. ఇప్పుడిదంతా సెప్పి.. ఏటి పెయోజనం అంటూ మరో నాయకుడు నిట్టూర్చాడు. య్యో! అట్టా ముక్కులమ్మట వచ్చేలా పొగొదలకుండా నువ్వు కూడా రాయొచ్చు గందా!! అని మరొక పెద్ద నేత సెలవు.

ఇలా ఎకసెక్కాలాడుకుంటూ నవ్వుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈలోగా ఇదంతా ఎందుకనుకున్నారో ఏమో ఓ మహిళామణి పెసిడెంటుగారి గదిలోకి పరుగుతీసింది. ఫోను తీసుకుని ఓ నెంబరు డయల్ చేసింది. సారూ! పొద్దస్తమానూ నాకు ఒకటే నాలుక దురదగా ఉంటుంది. ఎవరో ఒకర్ని తిట్టకపోతే రోజు గడిచినట్లుండదు.. ఇదంతా కాయితమ్మీద పెట్టే కంటే నేరుగా చెప్పేస్తే బాగుంటుందని ఫోను చేశానండీ అంటూ గడగడా చెప్పేసింది. ఫోనందుకున్న అధికారికి దిమ్మ తిరిగిపోయింది. నీ ఇబ్బందులు నాకెందుకమ్మ! ఏ స్వామిజీనో అడిగితే ఏ పవన నాలుకాసనమో చెబుతాడు. (పవనముక్తాసనం అనేది కడుపులో జేరిన అపానవాయువులను బయటకు నెట్టేస్తుంది) అక్కడికెళ్ళమ్మా.. అని కసురుకుని ఫోను పెట్టేశాడు.

దాంతో గతుక్కుమన్న ఆ నాయకీమణి తనకు సమాచారాన్ని చెప్పిన పెద్దమనిషివైపు పరుగెత్తుకెళ్ళింది. ఏందన్నా ఇది.. ఇసయం చెప్పబోతే.. ఫోనెట్టేశారంటూ నొచ్చుకుంటూ మాట్టాడింది. ఓసి నీ అసాధ్యంగూల నే చెప్పిందేంటి.. నువ్వు చేసిదేంటి.. అంటూ బుగ్గలు నొక్కుకుని ఎందుకైనా మంచిదని అందరూ ఉన్నచోటకి పరుగు తీశాడు. 'అందరినండి.. మీ ఇబ్బందులేంటి.. ఏ సమయంలో అవొస్తాయి.. ఎంత సేపుంటాయి.. అప్పడు మీ ప్రవర్తనెలా ఉంటుంది.. మనవాళ్ళనే గట్టిగా తిట్టేయాలని ఎందుకనుకుంటారు... నీ పక్కాయన్ని సీటు దింజేసి ఎక్కేయాలనిపిస్తుందా... అందుకోసం ఏ పనైనా చేయాలనిపిస్తుందా.. మాటిమాటికీ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కాలనిపిస్తుందా.. వెడితే అక్కడ నువ్వెవర్ని తిట్టాలనుకుంటావో వారికి తెలుసున్న ఇంట్లోనే జేరి ప్రెస్మీటెట్టాయాలనిపిస్తుందా.. పెద్దావిడని పదేపదే కలవాలనిపిస్తుందా... ఫలానావాడి పదవి పీకేస్తున్నారని గాలి కబుర్లు వదలానిపిస్తుందా.. ఏటీ ఇలాంటివన్నీ గుర్తుతెచ్చుకుని మరీ రాసేయండి. ఇవన్నీ పట్టుకుపోయి.. ఇదిగో ఈ అమ్మ ఫోన్జేసిందే ఆ ఆఫీసులో ఇచ్చేసొద్దాం. ఆళ్ళు ఇయన్నీ సదివేసి, మనకూ ఓ మెషిన్ జేసిచ్చేత్తారు. దాంతో మనమంతా సెట్ అయిపోయి మాంచిగా తయారయిపోవచ్చు.' సెప్టికేమియా అని ఓ వ్యాధి.. అది సోకిందని తెలిసేలోగానే మనిషి టపా కట్టేస్తాడు. దానితో పాటు మరో 26 వ్యాధుల్ని చిటికెలో కనిపెట్టేసేలా పరికరాన్ని ఆవిష్కరించారు వాళ్ళు. నాకు తెలుసుండీ మనదగ్గర అంతకంటే ఎక్కువ అవలక్షణాలేవీ ఉండి ఉండవనిపిస్తోంది. ఓ రాయేస్తే పోలా అని వాళ్ళకో ఫోను గొట్టాను. పంపిస్తే ప్రయత్నిస్తామన్నారు అని చల్లగా సెలవిచ్చాడాయన. ఆయన మాటలు విన్న వారందరిలోనూ హుషారు పెరిగిపోయింది. అదే జరిగితే మనకి ఎదురే లేదనుకున్నారు. మొత్తం రాసినవన్నీ కట్టగట్టి అక్కడికి పంపి చేతులు దులిపేసుకున్నారంతా.

కొంత కాలం గడిచింది. ఓ రోజు ఓ కొరియర్ రానే వచ్చింది. అంతా ఆతృతగా దాన్ని తెరిచారు. అందులో ఉన్న వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఓ లేఖుంది. 'అయ్యా.. మీ అందరి సమస్యల్నీ క్షుణ్ణంగా చదివాం. వాటికి పరిష్కారం కోసం అంతగా కష్టపడనక్కరలేదనిపించింది. కోటిపల్లి జాతరకెళ్ళి ఎవరూ చూడకుండా జీళ్ళ తయారీకి ఉపయోగిస్తున్న ఓ వాసం మేకును మీకోసం తెచ్చేశాం. బెల్లం పాకంలా మారిపోయిన మీ నాలుకల్ని అదుపులో పెట్టుకోవడానికి దీన్నెలా ఉపయోగించుకోవాలో మేం వేరే చెప్పనక్కరలేదని భావిస్తున్నాం.'!!!!!

Updated on Aug 24, 2012

Back to Top