‘దావోస్‌’ డ్రామా షురూ

– పెట్టుబడుల పేరుతో చంద్రబాబు నాటకం
– గతేడాది డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు 4.5 కోట్లతో ఎంట్రీ పాసు కొన్న బాబు 
– రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి పబ్లిసిటీ స్టంట్లు 
– పెట్టుబడులు, ఒప్పందాల లెక్కలన్నీ అబద్ధాలే

దావోస్‌... ఏటా జనవరిలో ఈ పేరు ఏపీ వ్యాప్తంగా మార్మోగుతుంటుంది. ఎందుకంటే ఏటా క్రమం తప్పకుండా జనవరిలో చంద్రబాబు దావోస్‌ వెళ్తుంటారు. ఆయన అలా ఫ్లయిట్‌ ఎక్కగానే ఇక్కడి ఆయన అనుకూల మీడియా ప్రతి అరగంటకు ఒక కథనాన్ని వండి జనం మీదకు వదులుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్‌లో మూటకట్టుకుని వస్తున్నారని చెవిలో చేరి జోరీగలాగా స్టోరీలు వినిపిస్తుంది. దావోస్‌ సమ్మిట్‌లో చంద్రబాబుపైనే అందరి దృష్టి అని, చంద్రబాబును చూడగానే బిల్‌గేట్స్, సత్యనాదెళ్ల భావోధ్వేగానికి లోనయ్యారని చెవులు వాచిపోయేలా మోతపుట్టిస్తుంది. గడ్డ కట్టే చలిలోనూ బాబు మాత్రం కనీసం చలి కోటు కూడా వేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారంటూ ఊదరగొడుతూ ఉంటుంది. అందరూ నాలుగైదు అంచెల దుస్తులు ధరిస్తుంటే చంద్రబాబు మాత్రం కనీసం చలి కోటు కూడా వేసుకోలేదని సైడ్‌ లైట్స్‌ కామన్‌. పార్టీ నాయకులకు పౌడర్‌ కొట్టి సూటేసి లక్ష కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెల్లారి పొద్దున్నే ఫస్టు పేజీ బ్యానర్‌ వార్తలు. చివరికి ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయి.. అని ఆరా తీస్తే మొత్తం పచ్చి అబద్ధమని తేలిపోతుంది. నాలుగేళ్లుగా పెట్టుబడుల పేరుతో చేస్తున్న హడావుడి జనం చూస్తున్నదే. దావోస్‌కి టిక్కెట్లు పెట్టి వెళ్లిరావడం, విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ పేరు చెప్పి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచి వేయడం, నెలకోసారి విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి రాష్ట్రం కోసం మండుటెండల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నాడని సిగ్గులేని రాతలు రాయించుకుంటాడు. అమెరికా దాకా ప్రత్యేక విమానాల్లో వెళ్లేవాడికి చెప్పులు కొనే స్థోమత లేదన్నట్టుగా పచ్చ పత్రికలు చంద్రబాబు ఆకాశానికెత్తడానికి తెగ ఉబలాటపడిపోతుంటాయి.  ఈ ఏడాదీ జరుగుతున్నది అదే. అయితే ఈసారి చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌కు కూడా పబ్లిసిటీలో అక్షరాభ్యాసం చేయిస్తున్నాడు. లోకేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఈసారి దావోస్‌కి వెళ్లాడు. సాటి తెలుగు రాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ కూడా దావోస్‌ సదస్సులో పాల్గొంటుండటంతో చంద్రబాబు కూడా లోకేష్‌ను తీసుకెళ్లి ఉంటాడని ప్రచారం సాగుతోంది. అయితే ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయో బాబుగారే సెలవివ్వాలి. 

రూ. 4.5 కోట్లు పెట్టి పాస్‌ కొన్నాడు
సోషల్‌ మీడియా కారణంగా బాబు బండారం మొత్తం బయటకు వచ్చేస్తోంది. చంద్రబాబు లేకుంటే దావోస్‌ సమ్మిట్‌కు సరైన కళ ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులే ప్రత్యేకంగా ఆహ్వానించారని గతంలో ఆయన మీడియా జనానికి చెప్పేది. కానీ నిజం అది కాదు. దావోస్‌ సమ్మిట్‌లో అడుగు పెట్టేందు కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పెట్టి చంద్రబాబు ఎంట్రీ పాస్‌ కొనుక్కొన్నారు. ఏకంగా రూ. 4.5 కోట్లు ఖర్చు పెట్టి దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో అడుగుపెట్టే అవకాశాన్ని కొనుక్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, డబ్బులు రిలీజ్‌ చేసిన జీవోలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ ఎంట్రీ పాస్‌ సాధించేందుకు అక్టోబర్‌ నెలలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆర్ధిక శాఖ నిధులను విడుదల చేసింది. చంద్రబాబు దావోస్‌ పర్యటన కోసం అక్టోబర్‌లో రూ. 6. 39 కోట్లను విడుదల చేశారు. కొన్ని నెలల ముందే నిధులు విడుదల ఎందుకు చేయాల్సి వచ్చిదంటే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్‌కు టికెట్‌ బుకింగ్‌ అక్టోబర్‌లోనే జరిగింది. రూ. 6.39 కోట్ల నిధుల్లో రూ. 4.5 కోట్లను ఎంట్రీ పాస్‌కు కట్టబెట్టేశారు చంద్రబాబు. చంద్రబాబును వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వారే ప్రత్యేకంగా ఆహ్వానించారని ఇక్కడి అనుకూల మీడియా డబ్బా కొడుతోంది. అయితే అక్కడ చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పేందుకు ఒక పాయింట్‌ చాలు. చంద్రబాబు ఇక్కడ ఇంత గొప్పలు చెబుతున్నా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మెయిన్‌ ఈవెంట్‌లో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం లేదు.
డబ్బులు చెల్లించి ఒబామాతో లోకేష్‌ ఫొటో
చంద్రబాబు 1997 నుంచి ఫాలో అవుతున్న ఈ ఎత్తును కుమారుడు లోకేష్‌కు కూడా నేర్పించారు. అందుకే ఇటీవల లోకేష్‌ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ఒబామాను పార్టీ ఫండ్‌ సేకరించే కార్యక్రమంలో డబ్బులు కట్టి పాల్గొని ఫొటో దిగారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆహ్వానం మేరకే లోకేష్‌ అక్కడికి వెళ్లారని తొలుత సొంత మీడియా డప్పు వాయించింది.  పైగా లోకేష్‌ను చూడగానే నాన్నగారు (చంద్రబాబు) ఎలా ఉన్నారంటూ ఒబామా పలకరించారంటూ ప్రచారం చేశారు. వాస్తవానికి చంద్రబాబు ఎవరో ఒబామాకు తెలిసి ఉండదు. ఒబామాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు లోకేష్‌ 10వేల డాలర్లు చెల్లించిన విషయం బయటకు రావడంతో నారా వారు నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు బాబు దావోస్‌ సీక్రెట్‌ కూడా బయటపడిపోయింది. ఏటా నాలుగున్నర కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ఎంట్రీ పాస్‌ తెచ్చుకుంటున్నారు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు దావోస్‌ పర్యటన మొత్తం ఖర్చు 24 కోట్లు అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో దావోస్‌ వెళ్లారు. 

తాజా వీడియోలు

Back to Top