ఏపీలో పెరుగుతున్న శిశుమరణాలుప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కరువుచదువును దూరం చేస్తోన్న సర్కార్పిల్లల భవితపై బాధ్యత లేని ప్రభుత్వం నవంబర్ 14. జాతీయ బాలల దినోత్సవం. అయితే ఏపీలో ఆ హడావుడే లేదు. సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిని చూసినా నిత్యం బిడ్డలను పోగొట్టుకుంటున్న కన్నతల్లుల అరణ్యరోదన.. సరైన సమయంలో వైద్యం అందక పొత్తిళ్లలోనే కన్నుమూస్తున్న పసికందులు. ఆక్సిజన్ లేక.. వైద్యుల కొరతతో.. అవసరాలు తీర్చే నర్సులు కనబడక..గర్భిణులు, బాలింతలకు పడుకునేందుకు బెడ్‌లు లేక.. అన్నీ ఉన్నా విద్యుత్ సదుపాయం లేకనో.. ఫ్యాన్లు తిరగలేదనో.. పారిశుద్ధ్యలోపం కారనంగానో.. అన్నీ బాగుందంటే పుట్టిన పిల్లలను పొత్తిళ్ల నుంచే కబలించుకు పోతున్నా పట్టించుకోలేని రక్షణ వ్యవస్థ.. జరిగిన తర్వాత గుండెలు పగిలేలా రోదించడం తప్ప ఏమీ చేయలని తల్లిదండ్రుల అసహాయత.. వెరసి రాష్ట్రంలో బాల్యం దిక్కులేనిదైంది. బాల్యం అంగడి సరకులా మారింది. పిల్లలు పిండంగా ఉన్న దశ నుంచి పెరిగి పెద్దయ్యే వరకు వారికి రక్షణ కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో అడుగడుగునా సమస్యలే. బాలింతలకు, గర్భిణులకు సరైన పోషకాలు అందించేందుకు అంగన్‌వాడీలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నాడు. అందులో పనిచేసే ఆయాలకు జీతాలుండవు.. వారిని సరిగా పని చేసుకోనివ్వడు.. ఆ సర్వే.. ఈ సర్వే అంటూ తిప్పుతాడు.. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తే మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జ్‌లు చేయిస్తాడు. ఇలాంటి స్థితిలో బాల్యం అనాథ గాక ఏమవుతుంది.
చెత్త కుప్పల్లో మగ్గిపోతున్న బాల్యంరాళ్లు కొట్టే చేతులు. .బండి లాగే గుండెలు... చెత్త కుప్పల్లో, చిత్తు కాగితాల నడుమ.. ఇటుక బట్టీల్లో మట్టి ముద్దల మధ్య మగ్గిపొతున్న భావిభారత గురుతులు... ఛాయ్ కొట్టుల్లో... చీకటి కొట్టాల్లో ఛిద్రమవుతున్న చిన్నారుల చరితలు. యంత్రం తిప్పే...రిక్షా తొక్కే... పలుగు పట్టే... బరువులు ఎత్తే... బాలకార్మికుల బతుకులు.. బడ్జెట్లో బడాయిలు...పేరు గొప్ప పథకాలు... కాగితాల్లో కేటాయింపులు... పుస్తకాల్లో చట్టాలు... మెతుకు వేటలో మ్రుగ్యమవుతున్న రేపటి రారాజులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఫలితం ఊరు ఊరునా, వాడవాడనా బాల కార్మిక వ్యవస్థ వేళ్లూనుకుపోతోంది. ఆకలితో అలమటించే...వీరి అవసరం.... అరకొర కూలీతో వారిని నిలువునా దోచుకునే కొందరికి అవకాశమవుతోంది. అందుకే దేశంలో ఏటా 5 లక్షల మంది చిన్నారులు కార్మికులుగా మారిపోతున్నారు. చివరికి భాగ్యభారతం బాలకార్మిక భారతంగా మారిపోతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రతి వెయ్యిమందిలో 38 మంది అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు బాలలే. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల చిట్టి చేతులు చెమట చిందిస్తున్నాయి. వీరిలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. 85 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు.
భయపెడుతున్న శిశు మరణాలు రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రుల్లో శిశు హననం కొనసాగుతూనే ఉంది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీరనే లేదు. వెంటిలేటర్లు ఏర్పాటు జరగనే లేదు. వైద్యులు, నర్సుల కొరత ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. ఏటికేటికీ శిశు మరణాల సంఖ్య తగ్గాల్సింది పోయి పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువగా పుట్టిన శిశువుల్లో 90 శాతం మరణిస్తున్నారు. చిన్నారులకు కామెర్లు సోకి ఆస్పత్రికి వెళితే.. ప్రాణాలతో తిరిగివస్తారన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 63 శాతం రేడియంట్ వార్మర్స్ పనిచేయటంలేదని.. దీనివల్ల వేలాది మంది శిశువులు మృతి చెందుతున్నారని స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 14 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి మృతి చెందుతున్న వారి సంఖ్య 22 వేలకు పైనే ఉన్నట్టు యూనిసెఫ్ నివేదికలే చెప్తున్నాయి. రాష్ట్రంలో శిశు మరణాలపై అంతర్జాతీయ శిశు నిధి సంస్థ యూనిసెఫ్ చెప్పిన అక్షర సత్యాలు ఇవి. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంతా డొల్ల అనీ, ఎక్కడా ప్రమాణాలు లేవని, రోగి బతికి బయటపడితే అదృష్టమేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో అత్యంత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయన్నది యూనిసెఫ్ నివేదిక సారాంశం. ఇదంతా 2012లో యూనిసెఫ్ ఇచ్చిన నివేదిక. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ విషయం పక్కన బెడితే ఏపీలో పరిస్ధితిలు అంతగా మెరుగుపడిన దాఖలాలు లేవు. శిశువుల అపహరణాలు కొనసాగుతున్నాయి.
కలవరపెడుతున్న కిడ్నాప్ లుభారత్లో ప్రతి 8 నిమిషాలకి ఓ చిన్నారి అదృశ్యమవుతుంది. ప్రతీ ఏడాది లక్ష మంది చిన్నారులు తప్పిపోతున్నారు. వారిలో 45 శాతం మంది చిన్నారులు తిరిగి తమ ఇంటికి చేరుకోలేపోతున్నారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ మిస్సింగ్ డే సందర్భంగా ఓ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం అపహరణ, అదృశ్యానికి గురవుతోన్న చిన్నారుల్లో తిరిగి ఇంటికి చేరుకోలేకపోతున్న వారి శాతం 2013తో పోల్చితే 2015లో 84శాతం పెరిగింది.సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2011, 2014 మధ్య అదృశ్యమైపోయిన చిన్నారుల సంఖ్య 3.25 లక్షలుగా ఉంది. వారిలో బాలికల సంఖ్య రెండు లక్షలుగా ఉంది. అపహరణకు గురైన ∙చిన్నారులను నేర సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనేట్లు చేస్తున్నారు, కొందరు చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో అదృశ్యమవుతోన్న వారిలో మైనర్ బాలికలే అధికంగా ఉన్నారు. జాతీయ నేర నమోదు సంస్థ 2014 సంవత్సర గణాంకాల ప్రకారం దీంట్లో పశ్చిమబెంగాల్‌లో అపహరణకు గురవుతోన్న చిన్నారుల్లో మైనర్ బాలికల శాతం 42గా ఉంది.
బాబు పాలనంతా అదృశ్యాల మయంబాబు పాలనలో కన్నతల్లులకు కడుపుకోత తప్పడం లేదు. బిడ్డల జాడ తెలియక ఆ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న చిన్నారులు అపహరణకు గురికావడం వారికి గుండెకోత మిగిల్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన చిన్నారులను అపహరించి అమ్ముకుంటున్న కేసులు నిత్యం ప్రభుత్వాసుపత్రుల్లో నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు లేక చిన్నారులు మరణిస్తున్నారు. మరీ దారుణం ఏంటంటే చీమలు కుట్టి కొందరు.. ఎలుకలు కరిచి చిన్నారులు మరణించిన సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్ర మత్తు వీడటం లేదు. పైగా దివంగత నేత వైయస్‌ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య వంటి పథకాలకు తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా పథకాలను నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధి కిందకు వచ్చే ఎన్నో రకాల రోగాలను ఒక్కొక్కటిగా తొలగించి సంజీవని పథకాన్ని మృతదేహంలా మార్చారు.
కుటుంబాల్లో వెలుగులు నింపిన వైయస్‌ఆర్ ముద్దులొలికే చిన్నారులు ఆరోగ్య సమస్యల్లో ఇరుక్కొంటే మొత్తం కుటుంబం దు:ఖంతో కుమిలిపోతుంది. అటువంటి చిన్నారుల్ని ఆదుకొని స్వాంతన చేకూరిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. ఆరోగ్య శ్రీ పథకంలో ప్రత్యేకంగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేవారు. అందుకే ఆయా కుటుంబాలు వైయస్సార్ ను దేవుడితో సమానంగా కొలుస్తారు. గుండెలో రంధ్రం ఉందన్న సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేటర్ ఆస్పత్రుల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆరోగ్యశ్రీ అనే భృహత్తర పథకానికి శ్రీకారం చుట్టి ఒడిగట్టిన దీపంలా ఉన్న ఎంతోమంది చిన్నారులకు ఊపిరిపోశారు. చిట్టి చేతులు బడుల్లో చదువుకోవాలని.. పనులు చేసే వయసు కాదని నిర్భంధ ఉచిత విద్యను అమల్లోకి తెచ్చిన మహనీయుడు వైయస్. కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రవేశపెట్టి ఆర్థిక స్థోమత లేక చిన్నారులను పనులకు పంపే ఎందరో తల్లిదండ్రుల కలను నెరవేర్చారు.
బంగారు భారతం కోరుకుందాం..కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొందరు, బతికే మార్గంలేక మరికొందరు... బడి మెట్లు ఎక్కే స్థోమత లేక ఇంకొందరు. కారణం ఏదైతేనేం మట్టిలోని మాణిక్యాలను మురికి వాడల్లోనే సమాధి చేసేస్తున్నాయి నేటి ప్రభుత్వాలు. వారి మెదళ్లలో దాగిన ప్రతిభను బయటపడనీయకుండా తొక్కిపెట్టేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం ఎక్కడో అడవిలో ఉన్నా సంపంగి పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది.. బురదలోనూ పద్మం వికసిస్తూనే ఉంటుంది. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనా మురికివాడల బాల్యం..సత్తా చాటుతుంది. మురికి పట్టిన వ్యవస్థను మట్టుబెడుతుంది...ఆ రోజులు రావాలి....ఈ బతుకులు మారాలి....బంగరు బాల్యం మువ్వెన్నల జెండాలా మురిపెంగా ఎగరాలి.. ప్రతి చిన్నారి బాల్యం తన జీవితంలో ఓ మధుర స్మృతిగా మిగిలి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...