బాబు.. డాబు

చెప్పేవన్నీ శ్రీరంగనీతులు
చేసేవన్నీ దుబారా ఖర్చులు

రెండేళ్లలోనే లక్షల కోట్ల అవినీతి
విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం

చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు.. చేసే పనులకు అసలు పొంతన ఉండడం లేదు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని  నెరవేర్చక పోగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాడు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందంటూనే.. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. ఖర్చులు  తగ్గించుకోవాలని మంత్రులకు.. అధికారులకు జీవోలు పాస్‌ చేసి మరీ చెప్పిన బాబు తాను మాత్రం పాటించడం లేదు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన చేతికి వాచ్‌కానీ.. వేలికి ఉంగరం కానీ సంపాదించుకోలేదని నీతులు చెప్పే చంద్రబాబు తన సొంతానికి చేసే ఖర్చులు చూస్తే మాత్రం ఎవరికైనా కళ్లు తిరగక మానదు. 

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. కానీ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం (తాను రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చింది మరిచిపోయి) అడ్డగోలుగా విభజించిందని, రాజధాని కూడా లేని రాష్ట్రంగా చేసి నడిరోడ్డుపై వదిలేసిందని తెల్లారితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బాబు తన వరకు వచ్చే సరికి మాత్రం అవేమీ కనిపించవు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, వృద్ధి రేటును పెంచుకోవాలని ఒక పక్క చెబుతూనే ఆయన మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. 

బాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో..
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో లక్షల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకోవడంతో పాటు వందల కోట్లు తన సొంత ఖర్చులకు వాడుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాబు ప్రమాణ స్వీకారం దగ్గరి నుంచి మొదలు పెడితే నేటి డబ్బును  దుబారా చేస్తూనే ఉన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రత్యేక విమానాల్లో వెళ్లిన దాఖలు లేనప్పటికీ చంద్రబాబు ఎక్కడి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తూ డబ్బును దుబారా చేస్తున్నారు. అంతేకాదు తాను ఉంటున్న కార్యాలయాలు, భవనాల్లో వాస్తు సరిగా లేదని, వాటి కోసం వందల కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. 

ఈ రెండేళ్లలో బాబు ఖర్చు రూ.93 కోట్లు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను జూబ్లీ హిల్స్‌లో ఉంటున్న ఇంటి కోసం దాదాపు రూ.2 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. ఆ తర్వాత మదీన గూడలోని ఫాంహౌస్‌కు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. అలాగే లేక్‌ వ్యూ అతిథి గృహానికి  రూ.50 లక్షలు, తాడేపల్లిలోని లింగమనేని ఎస్టేట్‌లో నివాసం ఉంటున్న ఇంటికి రూ.10 కోట్లు, ప్రత్యేక బ్సు కోసం రూ.5.50 కోట్లు, సెక్రటేరియట్‌లోని హెచ్‌ బ్లాక్‌ కోసం 6.29 కోట్లు, విజయవాడ క్యాంప్‌ ఆఫీస్‌ కోసం రూ.42 కోట్లు, వివిధ కార్యాలయాల్లో ఫర్నీచర్‌ కోసం రూ.10 కోట్లు, ఎల్‌ బ్లాక్‌లో 7, 8 అంతస్తుల కోసం 14.63 కోట్లు ఖర్చు చేశారు. బాబు మొత్తం ఇప్పటి వరకు దాదాపు రూ.93 కోట్లు ప్రభుత్వ సొమ్మును దుబారా చేశారు. 

ఇది మూడో ఇల్లు
బాబు సీఎం అయిన తర్వాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడవది. ముందు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లో ఉన్నారు. తర్వాత మదీనగూడలోని ఫాం హౌస్‌కు మారారు. ఇప్పుడు పార్క్‌ హయత్‌ హోటల్‌కు షిఫ్ట్‌ అయ్యారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా ఆ ఇంటి అద్దె మొత్తం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ బాబు ఇప్పుడు ఉన్న ఇల్లు ఆషామాషి ఇల్లు కాదు ఐదు నక్షత్రాల హోటల్‌. దాని రోజుకు అద్దె  కనీసం రూ.1.5లక్షలు ఉంటుంది. మరి ఇంత ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందా? లేకపోతే చంద్రబాబు కట్టుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ తాను నిరుపేదనని, తన చేతికి వాచ్‌ కానీ... ఉంగరం కానీ లేదని చెప్పే చంద్రబాబు ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉండడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇప్పుటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలా ఉన్న దాఖలాలు లేవు. అలా ప్రజా సొమ్మును దుబారా చేసిన సందర్భాలు లేవు. 

Back to Top