మాటలే తప్ప... పనుల్లేవ్

– మూడేళ్లుగా ప్రకటనలతోనే కాలక్షేపం
– పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంతా గేమ్‌
– నంద్యాల్లో జరిగింది ఎలక్షన్‌ కాదు.. ఆక్షన్‌

పాడిందే పాడరా.. విసుగెత్తే దాకా పాడారా అన్నట్టుంది.. చంద్రబాబు వ్యవహారం. అప్పుడది చేశాను.. మొన్న అలా చేద్దామనుకున్నాను.. వాళ్లు అలా కావడానికి కారణం నేనే.. వీళ్లకు ఐడియా ఇచ్చింది నేనే.. రోజూ పనికిమాలని సొల్లు ప్రసంగాలే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మాత్రం దిక్కులేకుండా పోతోంది. ఎన్నికల హామీల సంగతేంటని జనం అడుగుతుంటే చంద్రబాబు మాత్రం స్వామీజీ అవతారం ఎత్తి ప్రవచనాలు వల్లిస్తున్నాడు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉచిత సలహాలిస్తున్నాడు. స్వామీ చంద్రానంద అవతారంలోకి పరకాయ ప్రవేశం చేసినట్టున్నారు . అన్నింటికీ ధరలు పెరిగిపోయి జనం అవస్థలు పడుతుంటే..వాటి గురించి చంద్రబాబు ఆలోచన చేయడు. ఎక్కువ పిల్లలను కనాలంటూ ఉచిత సలహాలిచ్చి జనం చేత ఛీ కొట్టించుకుంటున్నారు. సలహాలు కట్టిబెట్టి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని ప్రతిపక్షాలు చంద్రనందస్వామిని హెచ్చరిస్తున్నారు. 

స్టేట్‌మెంట్లే తప్ప పనులు జరగవ్‌..
అనుకూల పత్రికలను అడ్డం పెట్టుకుని స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం తప్ప చంద్రబాబు మూడేళ్లుగా ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు. దోమలపై దండయాత్ర, బికినీ ఫెస్టివల్, ఆస్పత్రుల్లో ఎలుకల వేట, పోలవరానికి నాలుగు శంకుస్థాపనలు తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు. రూ. 900 కోట్లతో నిర్మించిన తాత్కాలిక సచివాలయం సెంటీ మీటర్‌ వర్షానికే జలమయం అయ్యింది. సీఐడీ విచారణ పేరుతో దానిమీద చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. విచారణ ముగిసిన తర్వాత ఏం తేల్చారో ఎవరికీ తెలియదు. 

ఫిరాయింపులకు మరో పేరు పోల్‌ మేనేజ్‌మెంట్‌
అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చంద్రబాబు పెట్టుకున్న ముద్దు పేరు పోల్‌ మేనేజ్‌మెంట్‌. వందల కోట్లు డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు మోడల్‌గా చూపించి కొత్తగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఆయనకే ఎదురు దెబ్బలు తగిలేలా కనిపిస్తుంది. నంద్యాల తరహాలో మా నియోజకవర్గాలకు కూడా నిధులు గుమ్మరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు బాబును నిలదీస్తున్నారు. ఏదో పబ్లిసిటీ కోసం చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇస్తుంటే ఎమ్మెల్యేలొచ్చి నిధులు అడగడంతో బాబు ప్లాన్‌ బెడిసికొడుతోంది. 
Back to Top