టిడిపిది సంక్షేమం కాదు స్వార్థమే

చంద్రబాబు చేసేదే చెప్పండి అంటున్నాడు. చేసేవి తప్పులైనా, అధికారంలో ఉన్నారు కనుక ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే బరి తెగింపుతో చేసేది చెప్పండి అంటున్నాడు. ‘మనం పనులు చేసేది ఎన్నికల్లో గెలవడం కోసమే’ అని నిస్సిగ్గుగా ప్రజలముందే అనగలుగుతున్నాడు. ‘నాకు ఓటేయకపోతే నే వేసిన రోడ్లమీద నడవకండి, నేనిచ్చే పింఛన్లు తీసుకోకండి’ అని బెదిరించగలిగాడు. నిజంగానే ఆయన చేసే నికృష్టమైన పనులు చెప్పుకోడానికి ఆయనేమీ జంకడు. మేనేజ్ చేసి ఉప ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు గెలిచామని కూడా చేసిన పని పబ్లిక్ గానే చెప్పుకున్నాడు చంద్రబాబు. ఓటర్లను ఎలా ప్రలోభపెట్టాలో, ఎలా భయపెట్టి దారికి తెచ్చుకోవాలో నంద్యాల, కాకినాడలో తాము చేసిన, బూత్ అండ్ పోల్ మేనేజ్ మెంట్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎన్నికకూ ఇదే పద్ధతిని పాటించాలని కూడా శెలవిచ్చాడు. ఎక్కడ బ్యూరోక్రాటిక్ మేనేజ్ మెంట్ ను తన మత్రులు, ఎమ్మెల్యేలు మరచిపోతారో అని దీన్నో పచ్చపుస్తకంగా ప్రింట్ చేసి పంచిపెడతానని కూడా చెప్పుకున్నారు. 

నోరు తెరిస్తే అబద్దాల పుట్ట
చంద్రబాబు నోరు ఎలాపడితే అలా తిరుగుతుందనటానికి నిన్నటి విజయవాడ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే సాక్ష్యం.  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఉందని బోలెడు హామీలు ఇచ్చాను అంటాడాయన. 2014లో భీకరమైన తెలంగాణ ఉద్యమం సాగుతుండగా, ఫిబ్రవరి, మార్చి నెల్లలో తెంలగాణ రాష్ట్రం అంశం లోక్ సభ, రాజ్యసభల ఆమోదం కూడా పొందింది. అంటే తెలంగాణ ఏర్పాటు ఖరారు కూడా అయిపోంది. ఆ సమయంలో చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని లేఖ రాసి అటు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ కి నష్టం అంటూ ఇటు సీమాంధ్రలో గోడమీద పిల్లివాటం ప్రదర్శించారు. ఎన్నికలకు ముందే ప్రత్యేక రాష్ట్రం కేటాయింపు, విభజన జరిగిపోయాక ఉమ్మడి రాష్ట్రంలో నిధులు వస్తాయని ఆయనగారు హామీలు ఇచ్చేసానని ఇప్పుడు శెలవిస్తున్నారు. ప్రజలు పూర్తిగా మతిమరుపు బారిన పడ్డారని చంద్రబాబు భావిస్తున్నట్టుంది. మొత్తానికి టిడిపి చేసే ప్రతి పని రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగమే కాని, ప్రజల కోసం కాదని, ఆ అవసరం కాస్తా తీరాక ఏరు దాటి తెప్ప తెగలేసే చందానే వారి ప్రభుత్వం ఉంటుందని చంద్రబాబు ఓపెన్ గా చెప్పేశాడు. 

వ్యవస్థని భ్రష్టు పట్టించింది ఎవరో గుర్తు చేసుకోవాలి
2004లో టిడిపి ఓడిపోవడం వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టేసాయని కూడా వాపోయారు చంద్రబాబు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గత తొమ్మిదేళ్ల స్వర్ణయుగ పాలన గురించి పూర్తిగా మరిచిపోయినట్టున్నాడు.  ఒకసారి అదంతా గుర్తు చేయడం మన బాధ్యత. 
విద్యుత్ బిల్లుల భారం మోయలేక రైతు కుంగిపోతుంటే, బకాయిలు చెల్లించమని నోటీసులిచ్చిన ఘనత చంద్రబాబు పాలనకే దక్కుతుంది. 
కరువు కోరల్లో అల్లాడే రైతులు సమస్యలపై ధర్నా చేస్తే పోలీసులతో కాల్పులు జరిపించిన చరిత్ర కూడా ఆయనదే అని గుర్తుచేసుకోవాలి. 
మైక్రో ఫైనాన్స్ కోరల్లో చిక్కుకుని మహిళలు అల్లాడిపోయి, ఆత్మహత్యలు చేసుకున్నది తమరి బాబుగారి సుభిక్ష పరిపాలనలోనే అని నేటికీ తెలుగు మహిళలు ఆవేదన చెందుతుంటారు. 
ఐటి రంగం తప్ప మరే రంగాన్ని కన్నెత్తి చూసిన పాపాన పోని చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నాడని ప్రత్యేకంగా చెప్పాలా?
ఎన్నో చిన్నతరహా పరిశ్రమలను, ఉపాధినిచ్చే సంస్థలను దుర్మార్గంగా కాలరాసిన శాడిస్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కాక మరెవరు?
ప్రభుత్వోద్యోగులను పురుగుల కన్నా హీనంగా చూసి, వారు చివరకు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపేలా ప్రవర్తించిన చంద్రబాబు తీరు చెప్పాలంటే ఎన్ని గొంతులూ చాలవు. 
అసలైన పొలిటికల్ ఓనర్ షిప్ ను ప్రదర్శించి అధికారులను, ఐఎఎస్ లను, సాధారణ ప్రజలనూ అందరినీ అణగదొక్కిన చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను చీకటి పాలన అని జాతీయ మీడియా కూడా చెప్పడం బాబు చెవిన పడలేదని ఎవరనుకుంటారు? 
అన్ని రంగాలనూ, అన్ని వ్యవస్థలనూ టిడిపి పట్టించినంతగా మరే సర్కార్ భ్రష్టు పట్టించలేదు.  
ఈ సందర్భంలో ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యక్తిత్వ వికాస పరీక్షలను నిర్వహించారు. అందులో వారికి ఎలాంటి మార్కులు వచ్చినా, ప్రజల కోసం పని చేయని నేతలు, పదవులకోసం ప్రజల ఎన్నికనే అపహాస్యం చేసిన నాయకులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనే చేసే ప్రజాప్రతినిధులకు ప్రజలు మాత్రం సున్నా మార్కులే వేస్తారు. 

Back to Top