సింగపూర్ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు వంగి వంగి సలామ్ లు చేస్తున్న చంద్రబాబు నాయుడు సామాన్యుల్ని గాలివి వదిలేస్తున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ.. ప్రభుత్వ వైద్య రంగం నుంచి పక్కకు తప్పుకొంటున్నారు. ఇందుకు మొదటగా చిత్తూరు ప్రభుత్వాసుపత్రితో ప్రయోగం చేశారు. చిత్తూరు లోని జిల్లాకేంద్ర ఆసుపత్రిని అపోలో సంస్థలకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రి కి ఎన్నెన్నో సదుపాయాలు కలుగుతాయని నమ్మబలికారు. తీరా చూస్తే, అపోలో సంస్థలు మెడికల్ కాలేజీల కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిని తెచ్చుకోవాలంటే 300 పడకలు ఉండే ఆసుపత్రితో అనుసంధానించి ఉండాలి. అక్కడకు పేషంట్లు క్రమం తప్పకుండా వస్తుండాలి. అప్పుడే మెడికల్ కాలేజీని అనుమతిస్తారు. ఇందుకోసం ప్రభుత్వాసుపత్రితో ఒప్పందం చేసేసుకొని కొనేసుకొంటే ఈ ఆసుపత్రినే కేంద్ర ప్రభుత్వానికి చూపించుకోవచ్చు. అప్పుడు చేతికి మట్టి అంటకుండా మెడికల్ కాలేజీ సీట్లను అమ్మేసుకోవచ్చు. ఇటు, గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలోని ఏరియా ప్రభుత్వాసుపత్రి మీద ఒక తెలుగుదేశం నాయకుడి కన్ను పడింది. దీన్ని స్వంతం చేసుకొంటే మెడికల్ కాలేజీ తెచ్చుకోవచ్చని ప్లాన్ వేసుకొన్నారు. కానీ ప్రస్తుతం నరసరావు పేటలోని ప్రభుత్వాసుపత్రికి 100 పడకలు మాత్రమే ఉన్నాయి. దీన్ని 300 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు అనుమతులు తెప్పించుకొన్నారు. ఇందుకోసం రూ. 53 కోట్లు విడుదల చేయించారు. దీన్ని హడావుడిగా మౌళిక వసతులు మెరుగుపరిచేందుకు పావులు కదుపుతున్నారు. ఈ తతంగంపూర్తి కాగానే దీన్ని స్వంతం చేసుకొని మెడికల్ కాలేజీకు అనుమతి తెచ్చుకొంటారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఉపయోగ పడాల్సిన ప్రభుత్వాసుపత్రుల్ని నేరుగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తోంది. అంతిమంగా నష్టపోయేది ప్రజలు అయితే ప్రయోజనం పొందుతున్నది మాత్రం కార్పొరేట్ సంస్థలు, వాటిని నడుపుతున్న తెలుగుదేశం నాయకులు మాత్రమే.