అమరావతి కలే..

– నిర్మాణం పూర్తవడం అసంభవం
– తేల్చిన ఆర్థిక నిపుణులు, పర్యావరణ వేత్తలు 
–  డిజైన్లు బాగోలేవని కాలక్షేపం

అమరావతి.. ఒక కలల నగరం. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల కల. ప్రపంచ  స్థాయి నగర నిర్మాణానికి నా చివరి రక్తపు బొట్టు వరకు కష్టపడతా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత  చంద్రబాబు గుక్కతిప్పుకోకుండా.. కళ్లార్పకుండా చెప్పిన మాటలు మూడేళ్లలో కల్లలయ్యాయి. చారిత్రక ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి నగరం కోసమంటూ 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి భూమి పూజ చేసిన ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచి కంప చెట్లతో నిర్మానుష్యంగా మారింది. శంకుస్థాపన రాళ్లు సమాధులను తలపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మి భూములిచ్చిన రైతులు ఆ ప్రాంతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బ్రహ్మంగారి పేరు చెప్పి... బ్రహ్మాండం బద్దలు కొడతామని నమ్మబలికి ఆఖరుకి అమరావతిని భ్రమరావతిని చేసేశాడు బాబు. 

రైతుల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
అమరావతిని నిర్మాణంలో చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. న్యాయస్థానాలు, ఇతర రాష్ట్రాలు వద్దని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా సింగపూర్‌ కంపెనీలకు 34వేల ఎకరాల రాజధాని భూములను అప్పజెప్పాడు. ప్రశ్నించిడానికి వీల్లేని నిబంధనలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మన ప్రభుత్వం ఇచ్చే డబ్బు, భూములు, సౌకర్యాలు ఇచ్చి వారికి 58శాతం వాటా అప్పజెప్పాడు. ప్రభుత్వానికి కేవలం 42శాతం ఉండేలా నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాస్త్రం తెలిసిన మేధావి చంద్రబాబు. అమరావతికి అన్నివేల ఎకరాలు దేనికని దేశమంతా ప్రశ్నిస్తున్నా పట్టించుకోడు. జనాల మంచీచెడుల గురించి పట్టదు. స్విస్‌ ఛాలెంజ్‌ ఒప్పందాన్ని బయటపెట్టడు. సొంతంగా సింగపూర్‌ వెళ్లి మాట్లాడుకొస్తాడు. 

మేధావులు, కమిటీలు వద్దన్నా..
ఏపీకి అమరావతిని రాజధానిగా వద్దని ఇప్పటికే శివరామకృష్ణన్‌లాంటి కమిటీలు విభేదించాయి. కేంద్రం కూడా అన్ని అనుకూలతులన్న మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించింది. అమరావతిలో రాజధానిని నిర్మిస్తే బంగారం లాంటి పంటలు పండే ప్రాంతాలను నాశనం చేసినట్టవుతుందని నచ్చజెప్పారు. కొండవీడు వాగు పొంగితే రాజధాని మొత్తం జలసమాధి అవుతుందని చెప్పారు. మోటార్లు పెట్టి నీళ్లు తోడతానని చంద్రబాబు వంకర సమాధానాలు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఆయన వెన్నంటే ఉండి సీఎస్‌గా పనిచేస్తూ వచ్చిన ఐవైఆర్‌ కృష్ణారావు లాంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూడా అమరావతి కలల రాజధాని మాత్రమేనని.. దానిని పూర్తి చేయడం చంద్రబాబు తరం కాదని తేల్చేశారు. ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఐవైఆర్‌ మాటలను కొట్టిపారేయలేం. భూములివ్వమని ఎదురు తిరిగిన రైతుల పొలాలు రాత్రికి రాత్రే దౌర్జన్యంగా తగలబెట్టించారు. 

శంకుస్థాపన నుంచి అవినీతి..
అమరావతి రాజధాని నిర్మాణం జరగకముందే దాని చుట్టూ అవినీతి శక్తులు చేరాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. అమరావతిని రాజధాని చేస్తారని ముందుగానే తెలుసుకుని తమకు అనుకూలమైన వారిచేత చంద్రబాబు భూములు కొనిపించారని పత్రికల్లో భారీగా వార్తలొచ్చాయి. మంత్రులు చాలామంది భూములు కొన్నట్టు పత్రికల్లో కథనాలు రావడంతో ప్రభుత్వ రెవెన్యూ వెబ్‌సైట్‌ను కూడా నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు కొన్నిరోజుల పాటు నిలిపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబే సూత్రధారిగా వెనకుండి కథ నడిపించారని జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది. 

ఆంధ్రా ఆస్తులను కేసీఆర్‌కు వదిలి...
రాజధాని నిర్మాణానికి ఇంతవరకు మొదటి అడుగు పడలేదు. తాత్కాలిక అసెంబ్లీ పేరుతో 900 కోట్లు ఖర్చుపెట్టినా చిన్న చినుకులకే జల్లెడలా కారిపోతోంది. వర్షం కురిస్తే మోకాళ్లలోతు బురదతో కార్యాలయాలకు రావడానికి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉద్యోగులు మూత్రశాలలు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు.  ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ముందూ వెనుకా ఆలోచించకుండా ఎకాఎకిన అమరావతికి పరుగు పెట్టాడు. అంతకుముందు వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంటూ నిప్పులు చెరిగిన బాబు ఉన్నట్టుండి రాజధాని కరకట్టకు పలాయనం చిత్తగించాడు. ఆంధ్రాకు దక్కాల్సిన ఆస్తులను తన అవసరాలు, కేసులకు భయపడి కేసీఆర్‌కు తాకట్టు పెట్టాడు. 

డిజైన్ల పేరుతో కాలక్షేపం..
తనేదో గొప్పవాడిగా నిరూపించడానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును విలువైన సమయాన్ని భారీగా వెచ్చిస్తున్నాడు. ఇప్పటికే మాకీ అసోసియేట్స్‌ అనే జపాన్‌ కంపెనీని పిలిపించి వారితో డిజైన్లు చేయించిన బాబు రకరకాల కారణాలతో వారిని తిప్పిపంపాడు. ఇప్పుడు తాజాగా నార్మన్‌పోస్టర్స్‌ అనే యూకే కంపెనీకి బాధ్యతలు అప్పగించాడు. సచివాలయ నిర్మాణానికి దసరాకు శంకుస్థాపన చేయాలని చెప్పి డిజైన్ల కోసం పిలిపించాడు. వాటిని కూడా రకరకాల కారణాలతో తిరస్కరించాడు. అయితే కేవలం డిజైన్లు చూపించినందుకే ఆరెండు కంపెనీలకే ఇప్పటికే దాదాపు వందల కోట్లకు పైగానే ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం. ఆ మధ్యలో చంద్రబాబు పబ్లిసిటీ కోసం సినిమా దర్శకులను ఆశ్రయించాడు. బాహుబలి హిట్‌ అయ్యిందని రాజమౌలి.. గౌతమీ పుత్ర శాతకర్ణిలో గ్రాఫిక్స్‌ బాగున్నాయని క్రిష్‌ను.., పుష్కర ఏర్పాట్లకు పనిచేశాడని బోయపాటి శ్రీనుని.. ఇలా ఒక్కొక్కరితో కూర్చుని టైపాంస్‌ చేశాడు. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న నాతో చరిత్రలో నిలిచిపోయే డిజైన్లు ఎలా వేయిస్తారని రాజమౌలి మొత్తుకున్నారు. సినిమా కోసం తాత్కాలికంగా అట్టముక్కలతో డిజైన్లు చేయించుకుని గ్రాఫిక్స్‌లో అద్భుతాలు సృష్టిస్తాం తప్ప నిజమైన రాజధానిని నేనెలా నిర్మించలగలనని వెనక్కి తగ్గారు. 

డబ్బుల్లేకనే ఏడుపంతా..
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు వద్ద నిధులు లేకపోవడంతోనే డిజైన్లు బాగా లేవని.. అద్భుతంగా నిర్మించాలంటే సమయం పడుతుందని రోజులు దొర్లిస్తూ వస్తున్నాడు. కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చివరికి నిధుల కోసం ప్రపంచ బ్యాంకును సంప్రదించాడు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అమరావతి ప్రాంత పరిశీలనకు వస్తుంటే పెయిడ్‌ రైతులను పెట్టించి రాజధానికి అనుకూలంగా వారితో స్టేట్‌మెంట్‌లు ఇప్పించాడు. ఇప్పుడు తాజాగా మరిన్ని అద్భుత నిర్మాణాలు చేస్తామంటూ ఈనెలలోనే యూకే పర్యటనకు వెళ్లనున్నారు. 
Back to Top