మొత్తంగా వన్ మ్యాన్ షో

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2,3 నెలలుగా అమరావతి, శంకుస్థాపన అంటూ కలవరిస్తూ వచ్చారు. బాబు మనస్సు తెలుసుకొన్న మంత్రులు, ఉన్నతాధికారులు అన్ని పనులు వదిలేసి అదే పనిగా పెట్టుకొన్నారు. చివరకు మామూలు ఉద్యోగులు, సిబ్బంది అదే బాటలో నడిచారు. 400 కోట్లు ఖర్చు పెట్టిన శంకుస్థాపన తో జనానికి ఒరిగిందేమీ లేదు కానీ, చంద్రబాబు కి వన్ మ్యాన్ షో చేశామన్న త్రప్తిని మిగులుస్తోంది.

చంద్రబాబు తపన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 2015 ద్వితీయార్థం పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఓటుకి కోట్లు కుంభకోణం లో పట్ట పగలు నిస్సిగ్గుగా దొరికిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే దొరికిపోయిన దొంగగా ప్రచారం పొందారు. అప్పటి దాకా నేను నిప్పు అంటూ ఆయన చేసుకొన్న సొంత ప్రచారం గాలికి కొట్టుకొని పోయింది. ఓటుకి కోట్లు కుంభకోణం లో జవాబులు చెప్పలేక ఎదురు దాడికి దిగి నెట్టుకొని వచ్చారు. దేశ వ్యాప్తంగా కోల్పోయిన ప్రతిష్టకు కలరింగ్ ఇచ్చుకొనేందుకు పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించాలని ప్రయత్నించారు. కానీ, చంద్రబాబు షూటింగ్ తాపత్రయం కోసం 29 మంది ప్రాణాలు కోల్పోవటం మరో అప్రతిష్టను తీసుకొని వచ్చింది. దీంతో జాతీయ స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేసి ఇమేజ్ సంపాదించుకోవాలని ఫిక్సు అయ్యారు. అందుకే శంకుస్థాపన కోసం ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేసి, సినిమా సెట్టింగ్ లను తలదన్నేలా ఏర్పాట్లు చేసుకొంటూ వచ్చారు. జాతీయ, ప్రాంతీయ ఛానెళ్లకు డబ్బు వెదజల్లి ప్రచారం చేసుకొనేలా ప్లాన్ వేసుకొన్నారు.

మనసంతా శంకుస్థాపన మీదే
పబ్లిసిటీ కోసం ఏదైనా చేసే చంద్రబాబు.. శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టే ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మార్చుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అటువైపు మోహరించారు. మంత్రులందరిని పిలిచి తలో పని అప్పగించేశారు. దీంతో ఆయా ప్రభుత్వ విభాగాలు పనులన్నీ వదిలేసి శంకుస్థాపన మీద ద్రష్టి పెట్టాయి. 2,3 నెలలుగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా దీని మీదనే ద్రష్టి పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వ్యవస్థలూ పూర్తిగా స్తంభించిపోయాయి.

ప్రచారమే ప్రచారం
పుష్కరాల ఎపిసోడ్ లో తొక్కిసలాట జరగిన వెంటనే చంద్రబాబు మెదడు పాదరసంలా పనిచేసింది. వెంటనే న్యూస్ చానెళ్లకు, దినపత్రికలకు విరివిగా యాడ్స్ రిలీజ్ చేశారు. దీంతో తొక్కిసలాట వార్తను తగ్గించేసి, తర్వాత తీసుకొన్న సహాయ చర్యల మీద విపరీతంగా ప్రచారం చేయించుకొన్నారు. అక్కడే మకాం చేసిన చంద్రబాబు, అనుక్షణం పర్యవేక్షించిన చంద్రబాబు పేరుతో కథనాలు వేయించుకొన్నారు. ఇప్పుడు అదే మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. దాదాపుగా అన్ని ఛానెల్స్ కు, దినపత్రికలకు భారీగా ప్రకటనలు జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రతిగా అమరావతి గురించి ప్రత్యేక కథనాలు వండి వార్చాలని పరోక్షంగా తేల్చి చెప్పారు. దీంతో రెండు నెలలుగా చానెల్స్ నిండా రంగు రంగుల గ్రాఫిక్ ప్రజంటేషన్ లతో అమరావతి ప్రచారం మోతెక్కుతోంది. 400 కోట్ల మేర ఖర్చు కీ వెనక్కి తగ్గకుండా ఇమేజ్ కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. 
Back to Top