వ్యవస్థలు అంటే పట్టదా..!

రాజధాని కోసం తహ తహ లాడుతున్న చంద్రబాబు వ్యవస్థల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. చట్టాల్ని, న్యాయవ్యవస్థల్ని అపహాస్యం చేస్తూ వ్యవహరిస్తున్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు.

రాజధాని లో భూములు లాక్కోవటానికి సంబంధించి హైకోర్టులో 22 కేసులు నడుస్తున్నాయి. వీటి మీద కోర్టులో ఏ విధంగానూ క్లియరెన్స్ రానే రాలేదు. కేసుల్లో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేస్తోంది.

అటు జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకొంది. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా స్టే విధించింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయటం లేదని అఫిడవిట్ దాఖలు చేసింది. అయినా సరే, నిర్మాణాల పని ఆపలేదు. మొన్నటికి మొన్న శంకుస్థాపన కోసం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. వందల ఎకరాల్లో పంటపొలాల్ని నాశనం చేశారు.

ముఖ్యంగా ఇటువంటి నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రానే రాలేదు. 2006 చట్ట ప్రకారం అక్కడి గ్రామాల్లో సర్వే చేయించాలి. అందులో 80 శాతం కు మించి ఆమోదం పొందాల్సి ఉంది. అటువంటి సన్నాహాలు కూడా ఏమాత్రం జరగటం లేదు.

వ్యవస్థలోని కట్టుబాట్లు ఇలా ఉంటే చంద్రబాబు ముందుకు దూసుకొని పోతున్నారు. ప్రజల్ని తప్పు దారి పట్టించినట్లే చట్ట బద్దమైన వ్యవస్థల్ని తప్పు దారి పట్టిస్తూ వినాశనం దిశగా అడుగులు వేస్తున్నారు.
Back to Top