'రైతులపై చంద్రబాబు ఉక్కుపాదం'

అక్రమ విద్యుత్తు కనెక్షన్ల పేరుతో కేసులు
అక్రమ కనెక్షన్లలో ఎక్కువగా రైతులవే
చౌర్యం చేస్తూ పట్టుబడితే జైలుకే..!
విజిలెన్సు విభాగాన్ని ఆదేశించిన చంద్రబాబు సర్కారు

హైదరాబాద్: చంద్రబాబు రైతుల పట్ల తనకున్న వ్యతిరేకతనుమరోసారి బయటపెట్టుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలరుణాల రద్దు, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన తదితర హామీలు నెరవేర్చనే లేదు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూ సేకరణ అంటూ వారి నెత్తిన పిడుగేశారు.. ఇటీవల విద్యుత్తు బిల్లుల పెంపుదలకు నిర్ణయం తీసుకుని సామాన్యులపై భారం మోపేందుకు రంగం సిద్ధంచేశారు. తాజాగా అక్రమ విద్యుత్తు వాడుకుంటున్నారన్న కారణంతో కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలని విజిలెన్సు విభాగానికి ఆదేశాలు జారీచేసి తాను ఏమాత్రం మారలేదని చెప్పకనే చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్రమ విద్యుత్తు కనెక్షన్లు కలిగిఉన్న వారిలో రైతులు కూడా ఉండటం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. విజిలెన్స్ విభాగం దాడులు చేయడానికి ఏర్పాటు చేసుకుంటోంది. విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న వారందరిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించిన క్రమంలో రైతులను కూడా అరెస్టు చేయాలా? అని విజిలెన్సు విభాగం సందిగ్ధంలో పడింది. అన్నదాతలపై కేసులు పెడితే పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత వస్తుందని ఆందోళన చెందుతోంది. గతంలోనూ రైతులు అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్నారని కేసులు పెట్టించిన ఘనచరిత్ర చంద్రబాబుకు ఉండటమూ వారి ఆందోళనకు కారణమే.

ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉన్నాయా?
రైతులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం సమస్యకు శాశ్వత పరిష్కారాలు వదలడం మాని, దాడులకే మొగ్గు చూపడం ఇప్పుడు సమస్యగా మారింది. రైతాంగానికి ఉచితంగా 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు.
వారి అభ్యున్నతికి పాల్పడుతానని, వారికి రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పుడు నానా మెలికలు పెట్టడంతో పథకం అర్హులకు అందుకుండా పోతోంది.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఇక్కడ 65 శాతానికి జనాభా పైగా వ్యవసాయమే ఆధారంగా జీవన సాగిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నదేశంలో అన్నదాతలపై చట్టపరమైన చర్యలకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని చంద్రబాబు అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.
అక్రమ విద్యుత్తు వాడుకుంటున్న రైతులను ముందు గుర్తించి, వారికి అవగాహన కల్పించే ప్రయత్నాలేవీ చేయలేదు. ఆ కనెక్షన్ల క్రమబద్ధీకరణ వారికి అవకాశం కల్పించలేదు. ఒక్కసారిగా కేసులు నమోదు చేయమనడం తగదని పలువురు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.
విద్యుత్తు చౌర్యంపై ప్రభుత్వానికి ట్రాన్స్‌కో ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దాన్ని పరిశీలించాకే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులను కూడా అక్రమార్కులతోపాటు ఒకేగాడిన కట్టాలని చూడటం అత్యంత దారుణమైన విషయం. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నదాతలను అరెస్టు చేస్తారా?
ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు చౌర్యం జరుగుతున్నమాట వాస్తవమే. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. వీరిపై కేసులు నమోదు చేసినా ఎవరికీ ఇబ్బంది కలగదు. కానీ అదే రైతుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ప్రాంతం మొదటి నుంచి వెనకబడింది కావడంతో ఇక్కడి రైతుల్లో చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, పేదరికం, కరవు, అప్పులు, పాత బకాయిలు కట్టటేకపోవడం వల్ల వీరు అధికారిక కనెక్షన్లకు దూరంగా ఉన్నారు. దీంతో తప్పని తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నారు.

అవగాహన కల్పించరా?
రాష్ట్రంలో మొత్తం 13.5 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. మరో 2.5 లక్షల మంది కొత్త మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సారవంతమైన భూములన్న కృష్ణాడెల్టా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడ వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు తక్కువ. రాయలసీమలో నిత్యం కరవు తాండవిస్తుంది. ఇక్కడ నీటిపారుదల వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో వీరు బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయాన్ని సాగుచేయాలి. కరవు, పేదరికం ఇక్కడి రైతుల్లో కొందరు విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వం వీరిని గుర్తించి, కౌన్సెలింగ్ అందించాలి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించాలి. అంతే కాని, ఒక్కసారిగా వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెడతాం అంటే ప్రజల నుంచి భారీ వ్యతిరేకత తప్పదు. ఈవిషయంపై విజిలెన్స్ విభాగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యవసాయ అక్రమ విద్యుత్తు కనెక్షన్లపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

గతంలోనూ రైతులపై కేసులు పెట్టించిన చంద్రబాబు..!
రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా దాదాపు 10 ఏళ్లు పాలించాడు. ఆయన హయాంలో ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం భారీగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దొరికిన రైతులను సైతం అధికారులు వదల్లేదు. అన్నదాతలపై కేసులు పెట్టిన తొలి భారతదేశంలోని ముఖ్యమంత్రిగా  చరిత్రలో తన పేరును శిలాక్షరాలతో లిఖించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీలో నానా కొర్రీలు పెడుతున్న బాబు మరోసారి రైతులపై కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం గతాన్ని కళ్ల ముందు నిలుపుతోంది. రాజధాని ప్రాంతంలో అన్యాయంగా రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం మరోసారి రైతులే లక్ష్యంగా కఠిన చర్యలకు ఉపక్రమించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్తు చౌర్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందుకోసం ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం సిద్ధమవుతోంది. ఈ విభాగానికి కొత్తగా బదిలీపై వచ్చిన డీజీఐ ఉమాపతి ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలుత దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ పరిధిలో ఎక్కువగా విద్యుత్తు చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రభుత్వం ముందుగా ఎస్పీడీసీఎల్‌పై దృష్టిపెట్టింది. ఇక్కడ గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అక్రమ విద్యుత్తు కనెక్షన్లు అధికం. రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.7,716 కోట్లకు చేరింది. విద్యుత్తు కొనుగోళ్ల భారంతోపాటు పంపిణీ నష్టాలు కూడా లోటుకు కారణంగా భావిస్తున్నారు. సుమారు 12 శాతంగా ఉన్న నష్టాలను ఏక సంఖ్యకు తేవాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నష్టా నివారణకు చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది.

లెక్కింపులో సమస్యలు: వాస్తవానికి విద్యుత్తు చౌర్యాన్ని ఖాతాలో ప్రత్యేకంగా చూపడం లేదు. దీంతో ఏ మేరకు చౌర్యం జరుగుతుందనేది లెక్కగట్టడం కష్టంగా ఉంది. దీన్ని కూడా పంపిణీ నష్టాల్లో భాగంగానే పేర్కొంటున్నారు. ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారుడికి చేరే క్రమంలో పలు రకాల మార్పులుంటాయి. అనేక ట్రాన్స్‌ఫార్మర్లలో ఉండే సాంకేతిక ఇబ్బందుల కారణంగా విద్యుత్తు నష్టపోవడం జరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత దీనిని గణనీయంగా తగ్గించే వీలు కలిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నందునే పంపిణీ నష్టాలు పెరుగుతున్నాయని ఇటీవల ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక ఇచ్చింది. ఇది రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఇంతకాలం విజిలెన్స్ విభాగం దాడులు చేస్తున్నప్పటికీ కేవలం జరిమానాలతో వదిలేసింది. కానీ, ఇకపై కేసులు నమోదు చేసి శిక్షలను అమలు చేయాలని తాజా వ్యూహమని అధికారులు అంటున్నారు. పారిశ్రామిక, వాణిజ్యరంగంలో చౌర్యం భారీగా ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. వీటన్నింటిని కట్టడి చేసేందుకు మరో వారం రోజుల్లో కార్యచరణ అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
Back to Top