హోదాకు చంద్రబాబు తిలోదకాలు

  • రాష్ట్ర శ్రేయస్సును కేంద్రానికి తాకట్టు పెట్టిన బాబు
  • హోదా సహా విభజన హామీలకు తూట్లు
  • కేసుల భయంతో ఏపీకి తీరని అన్యాయం
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా హామీ అమలుకు నోచుకోకపోవడం. సమైఖ్య రాష్ట్రంలో అభివృద్ధి అంతా అప్పటి రాజధాని హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అవడంతో ఆంధ్రప్రదేశ్ నేడు అన్ని విధాలా కుదేలై ఉంది. విభజన వల్ల కలిగిన నష్టం ఒక ఎత్తైతే, ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కలిగే నష్టం అపారం.

ఆర్థికంగా సరైన అనుకూలతలు లేని రాష్ట్రాల అభివృద్ధికి నిధుల కేటాయింపు, వివిధ రకాల పన్నుల్లో మినహాయింపు ద్వారా ఆ రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఐదొవ ఆర్థిక సంఘం 1969లో సిఫార్సు చేసింది. అది జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొంది ప్రత్యేక హోదా అమలులోకి వచ్చింది. అప్పట్లో 17 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను పొందగా, ప్రస్తుతానికి 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కినందువల్ల  10,000 పరిశ్రమలు వచ్చాయి. ఉపాధి పెరిగి అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఎంతో విస్తీర్ణం ఉండి, మానవ వనరులకు లోటు లేని ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధికి నోచుకోక అలో లక్షణా అంటోంది. ఇందుకు  కారణం ముమ్మాటికి టిడిపి ప్రభుత్వ వైఫల్యమే. ఉత్తరమిచ్చి రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చేందుకు కారణమైన చంద్రబాబు తన పబ్బం గడుపుకోడానికి రాష్ట్ర శ్రేయస్సునే కేంద్రానికి తనఖా పెట్టేసారు.

తెలంగాణ విభజన చేసి లాభం పొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు చంద్రబాబు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాల్సిందే నని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదా తెస్తామని ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ అన్నట్టు ఐదేళ్లు, బిజెపి చెప్పినట్టు పదేళ్లు కాదని పూర్తిగా 15 ఏళ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని సభల్లో చెప్పడమే కాదు, ఎన్నికల మేనిఫేస్టోలోనూ పొందుపరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రంనుంచి ప్రత్యేక హోదాను సాధించడంలో దారుణంగా విఫలమయ్యారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చమని కోరడంలో చంద్రబాబు నిర్లక్ష్యం చూస్తే తెలుగు ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి. హోదా ఇవ్వకుంటే కేంద్ర కేబినెట్ నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటామని చెప్పే ధైర్యం చేయలేకపోయారు ఎపి సియమ్ చంద్రబాబు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో పట్టుబడి, రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన బాబు కేంద్రాన్ని హోదాను గురించి, విభజన హామీల గురించి ప్రశ్నించ లేకపోతున్నారు. సాహసికంగా పోరాడ లేకపోతున్నారు. అవినీతి మయమైన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని నిలువునా ముంచారు చంద్రబాబు. ఈరోజు వరకూ హోదా గురించి చంద్రబాబు స్పష్టంగా కేంద్రంతో మాట్లాడిన దాఖలాలే లేవు. హోదా ఏమైనా సంజీవనా, హోదాతోనే అన్నీ అయిపోతాయా? హోదావల్ల లాభం ఉండదు, అంతకన్నా ప్రత్యేక పాకేజీ అడుగుదామంటూ మాట మార్చారు రెండు నాల్కల బాబు.

ప్రత్యేక హోదా హామీతో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు చివరకు హోదా విషయాన్ని అటకెక్కించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ  వైయస్ ఆర్ సిపి పోరుకు సిద్ధమైంది. ఎపికి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అనే నినాదంతో రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపించింది. సభలు, ప్రజా చైతన్యయాత్రలు, ధర్నాలు, దీక్షలు, నిరసనలు, ర్యాలీలతో ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు సర్కార్ ని ఘెరావ్ చేసింది. యువనేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు, గుంటూరు వేదికగా ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షను చేసారు. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రానికి జరిగే నష్టాన్నియువతకు, నిరుద్యోగులకు తెలియజేస్తూ యువభేరి సదస్సులు నిర్వహించారు. వైయస్ఆర్సిపి mpలు పార్లమెంట్ సమావేశాల్లో హోదా కోసం తమ పోరును కొనసాగిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడూ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అధికార టిడిపి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, చంద్రబాబు అవినీతిని ప్రజలకు తెలియజెబుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు యువనేత. రాష్ట్రానికి టిడిపి చేసిన మోసాన్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. హోదా విషయాన్ని అటకెక్కించిన బాబు ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెబుతారు. 

తాజా వీడియోలు

Back to Top