హంద్రీ నీవా ఏది తోవ….?

చంద్రబాబుపై రైతు వ్యతిరేకి అనే ముద్ర ఎప్పటినుంచో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో నేను మారాను, రైతులకోసం ఏమేమో చేస్తాను, బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాను అని ఊరూరా దరువుల, దండోరాలు వేయించి చెప్పాడు బాబు. నమ్మారు జనం. ఇప్పుడానమ్మకాన్ని నిలబెట్టుకోకపోగా తనో రైతు బాంధవుడినని నిరూపించుకోవాలని తెగ తాపత్రయ పడిపోతున్నాడు చంద్రబాబు. రైతులకు ప్రాణాధారంలాంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తానెంతో సాధించేసినట్టు కనిపించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమ నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేసే బృహత్తర ప్రణాళిక. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు 2005లో పుష్కలంగా నిధులు మంజూరు చేసారు. 

హంద్రీ నీవా కథా కమామిషు
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా రాకముందు చంద్రబాబు 9సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అలవాటంతా పునాదిరాళ్లు వేయడం వాటికి సమాధికట్టడమే. 1996లో లోక్ సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేసారు. ఎన్నికలయ్యాక దాన్ని పూర్తిగా మర్చిపోయారు. 1999లో సాధారణ ఎన్నికల ముందు మళ్లీ హంద్రీ నీవా జపం చేసారు. కేవలం 5tmc లసామర్థ్యంతో కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి దగ్గర రెండోసారి పునాదిరాయి వేసారు. ఎన్నికల స్టంట్ లో భాగంగా అటు ఇటూ మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు పూర్తికాగానే యథాప్రకారంగా ఆ ప్రాజెక్టును ఫైళ్లలో పడుకోబెట్టారు. 

వైయస్ ఆర్ చొరవతో హంద్రీ నీవా పనులకు మోక్షం
వైయస్ సిఎమ్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 6,850 కోట్ల వ్యయంతో 4.05లక్షల ఎకరాలకు సాగునీరు, 33లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ నీవా ప్రాజెక్టును రూపొందించారు. తొలి దశ పనులను శరవేగంగా పూర్తి చేసారు కూడా. రెండో దశలోని పనులను కూడా 50శాతం మేర పూర్తి చేసారు. ఎకరానికి 16000 ఖర్చు చేసారంటూ ఆనాడు వైయస్ ను విమర్శించిన చంద్రబాబు నేటికీ అంచనాలను పెంచుతూ పోతున్నారే తప్ప ప్రాజెక్టును ఇంత వరకూ పూర్తి చేయలేకపోయారు. 

డెడ్ లైన్లు విధించడమే తప్ప లక్ష్యాలు అందుకున్నది లేదు
2007లో 2,774 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో మెదటి దశ, 4,076 కోట్ల అంచనాతో రెండో దశ పనులు ప్రారంభించారు. చంద్రబాబు సర్కార్ పాలనా వైఫల్యం, ప్రాజెక్టులంటే మొదటినుంచీ పట్టనితనంతో నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం అంతకంతకూ పెరిగి 11,274కోట్లకు పైగా చేరింది. ప్రాజెక్టు ప్రతి దశలోనూ తెలుగు తమ్ముళ్లకు కల్పతరువులా మారింది. ఏళ్ల తరబడి నాన్చుతూ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడానికే ఆపసోపాలు పడుతోంది టిడిపి ప్రభుత్వం. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ఆరు నెలలకో ఆర్భాటం చేస్తున్న చంద్రబాబు కాల వెడల్పు పనులకు శంకుస్థాపన, పంపు ఒకటి కడితే ప్రారంభోత్సవం అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎప్పుడో ప్రారంభం అయి పూర్తి కావాల్సిన కాలవ వెడల్పు పనులు ఇప్పుడు ఆరంభం అయ్యాయంటే ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయో అని ప్రజలు నిరాశతో నిట్టూరుస్తున్నారు. ప్రాజెక్టులు అప్పటికి పూర్తవుతాయి, ఇప్పటికి పూర్తవుతాయి అంటూ డెడ్ లైన్లు పెట్టి తర్వాత ఆ ఊసే ఎత్తని చంద్రబాబు ఒక్కనాడు కూడా అనుకున్న సమయానికి ఒక్క ప్రాజెక్టునీ పూర్తి చేసిన పాపాన పోలేదు. జల వనరులకు హారతులిస్తూ రాయలసీమ రైతుల కళ్లలో మంటలు రేపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు, తాగు నీరు లేక కటకట లాడుతున్న రాయలసీమ వాసులకోసం హంద్రీ నీవాను పూర్తి చేసినప్పుడే అసలైన జల హారతి, సుభిక్ష భారతి అని రాయలసీమ వాసులు భావిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top