కరుణ లేని పాలకుడు..!

రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతో సహా పెకిలించివేసి, కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యానికి, శోకానికి పాలకుడు కారణం కారాదు.  ఆంధ్రప్రదేశ్‌లో అనారోగ్యం తాండవిస్తోంది. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదాసీనతే దీనికి కారణం. రాష్ట్రంలోని ప్రాథమిక వైద్యశాలలన్నీ నరకకూపాలుగా మారాయి. విష జ్వరాలకు మందుల్లేక పీహెచ్‌సీలు వట్టి పోయాయి. నిరంతర వర్షాల వల్ల ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి జ్వరాల బారిన పడుతున్నారు. లక్ష కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న ప్రభుత్వం పీహెచ్‌సీలను పనిగట్టుకుని నిర్భాగ్యంగా ఉంచటం దారుణం. ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు విలవిలలాడుతుంటే మరోవైపు వెంటిలేటర్స్, బ్లడ్‌టెస్ట్ ల్యాబ్‌లు, మందులు, సరైన గదులు, శుభ్రత, సిబ్బంది లేక పీహెచ్‌సీలు తేలిపోతున్నాయి. ప్రజలు తమ ఇళ్ళ కంటే పీహెచ్ సీలే అధ్వాన్న స్థితిలో ఉన్నా యని వెనక్కి వస్తున్నారు.

‘పరిపాలనాదక్షుణ్ణి, నన్ను మిం చినవారు’ లేరనే చంద్రబాబు పాలనలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? ఆయనకు కరుణ లేదా? ప్రజల మీద ప్రేమ లేదా? ప్రజల అనారోగ్యాన్ని ముఖ్యమంత్రి ఇష్టపడుతున్నారా? సాక్షాత్తు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో ప్రాథమిక వైద్య శాల పిచ్చిమొక్కలు పెరిగి ప్రజలు లోనికి వెళ్ళడా నికి వీల్లేకుండా ఉంది. సభాపతి కోడెల శివప్రసాద్ రావు ప్రాంతమైన నరసరావుపేట, సత్తెనపల్లి పీహెచ్‌సీలన్నీ నరక కూపాలుగా ఉన్నాయి. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గం చిలకలూరిపేటలో పీహెచ్‌సీలు అధ్వానంగా ఉన్నాయి. యడ్లపాడు, నాదెండ్ల, గణపవరం పీహెచ్‌సీలలో వైద్యులే వైద్యశాలలకు రావటం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక వైద్యం ఎందుకు చేయించలేకపోతోంది? వైద్యులు సకా లంలో వైద్యశాలకు వచ్చేటట్లు ఎందుకు చూడలేక పోతుంది? ఎంతోమంది జ్వరాలతో మరణిస్తున్నారు. వృద్ధులైతే కుక్కి మంచం మీద పడుకుని కనీసం కషాయం ఇచ్చేవాళ్ళు లేక అల్లాడుతున్నారు. మరణిస్తే తీసుకెళ్లేవాళ్లు లేక, చనిపోయినవారిని పూడ్చిపెట్టేవారు లేక, పూడ్చిపెట్టడానికి శ్మశానాల్లో స్థలాలు లేక, జీవించే హక్కు లేక, అకాలంగా మరణించినవారిని ఖననం చేసే స్థితి లేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ రెన్స్‌లు జరుపుతూ కాలక్షేపం చేయడం ధర్మమా!

కార్పొరేట్ వైద్య వ్యవస్థకు ఆరోగ్యశ్రీ పేరుతో వేలాది కోట్ల రూపాయలు తగలెట్టడానికి బదులు ప్రభుత్వ వైద్యాన్నే ఎందుకు అభివృద్ధి చేయట్లేదు! చంద్రబాబు రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, తన సామాజిక వర్గం బలంగా ఆశ్ర యించి వున్న కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమం సాగిస్తున్నారు. ఇది తెలుగు జాతికి వెన్నుపోటు పొడవటమే.

Back to Top