నిప్పుకు విచారణంటే భయం దేనికి..?

– టెన్త్‌ పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ చేయించవచ్చుగా
– లీకైంది కాబట్టే బాబు ‘మాల్‌ ప్రాక్టీస్‌’ డ్రామా 
– మంత్రుల విరుద్ధ ప్రకటనలపై అర్థమేంటి..?

అబద్ధాల్లో ఆరితేరిన ముఖ్యమంత్రి అడ్డదారి పనుల వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. తన సొంత లాభం కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పబ్బం గడుపుకోవడం బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎవరు ఏమైపోతే నాకేం నేను అనుకున్నది జరిగిందా లేదా అనేది బాబుకు ముఖ్యం. అడ్డొస్తే కొనేయడం.. లొంగకపోతే భజన బృందాలను పక్కనపెట్టుకుని అసత్య ప్రచారం చేయించడం చంద్రబాబుకు మొదట్నుంచి అలవాటైన పనే. తన టైం నడిచినప్పుడు దేవాధిదేవుడ్ని అని తనే డప్పు కొట్టుకోవడం.. కాలం కలిసి రాకపోతే ఎవరో ఒకర్ని బాధ్యులను చేసి ప్రచారం చేయించడం.. ఇదీ బాబు మొదట్నుంచీ అనుసరిస్తున్న వ్యూహం. పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చు న్నాక బాబు పిచ్చి ముదిరి పాకాన పడింది. వైయస్‌ జగన్‌ లాంటి ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు క్షణక్షణానికి అసహనానికి గురవుతున్నాడు. ఆయన ముందు బాబు ఎత్తులు పారకపోతుంటే ఏం చేయాలో కూడా అర్థం కాక సాక్షి మీద ప్రతాపం చూపిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల్లో వరుసగా ప్రశ్నాపత్రాలు లీకవుతుంటే దాని సంగతి చూడాల్సింది పోయి విషయం బహిర్గతం చేసిన సాక్షి మీద పడి ఏడవడం నిజంగా సిగ్గుచేటు. 

లీకుల్లో ఆరితేరిన నారాయణ.. 
పేపర్‌ లీకులు చేయించడం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం నారాయణ విద్యాసంస్థలకు అలవాటుగా మారింది. లక్షల్లో ఫీజులు వసూలు చేసి చివరికి అడ్డదారిలో పేపర్‌ను లీక్‌ చేయించి జనాన్ని మోసం చేస్తోంది. అయితే ఇప్పుడు నారాయణ స్వయంగా మంత్రి కావడంతో అరాచకం మరింత ఎక్కువైంది. వియ్యంకుడు విద్యాశాఖామంత్రిగా ఉండటంతో నాకేం భయం అన్నట్టుగా నారాయణ కాలేజీ ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయి. ఈ సంవత్సరం వరుసగా జరుగుతున్న పేపర్‌ లీకేజీలన్నీ మంత్రి నారాయణ అధికార ఆగడాలకు నిదర్శనం. 
– పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా, తొలిరోజే తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలో నుంచి ప్రశ్నపత్రం సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఘటనకు కారకుడైన హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్‌ ఫోన్‌ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది.
–  రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్‌ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
– నెల్లూరులోని నారాయణ హైస్కూల్‌ నుంచి టెన్త్‌ సైన్స్‌ పేపర్‌–1ను శనివారం వాట్సప్‌ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లు కూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు.
– చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజూ  ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నారు.
– కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు. 

వారి మాటలే చెబుతున్నాయ్‌.. పేపర్‌ లీకైందని
టెన్త్‌ ప్రశ్నాపత్నం లీకు విషయంలో మంత్రి వియ్యంకులిద్దరూ పరస్పర విరుద్దమైన ప్రకటనలతో చంద్రబాబును ఇరుకున పెట్టేశారు. మంత్రి నారాయణ ప్రశ్నాపత్రం అసలు లీక్‌ కాలేదని చెబుతుంటే మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం పేపర్‌ లీకైందని.. విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పాడు. వీరిద్దరి విషయం ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మరో అడుగు ముందుకేసి అది లీక్‌ కాదు మాల్‌ ప్రాక్టీస్‌ అని కొత్త భాష్యం చెబుతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా అది సాక్షి విలేకరికి ఒక్కడికే ఎలా తెలిసింది.. ఆయన డీఈఓకు ఎలా ఫిర్యాదు చేశాడు.. అంటే లీకేజీ వెనుక సాక్షి హస్తం ఉందని కొత్త పల్లవి అందుకున్నాడు. సర్కారును ప్రశ్నించిన ప్రతిసారీ.. ఆధారాలతో దొరికిపోయినప్పుడల్లా నిజానిజాలను నిగ్గుతేల్చి నిందితులను శిక్షించాల్సింది పోయి సాక్షి మీద పడి ఏడవడం చంద్రబాబు అలవాటైపోయింది. విషయాన్ని పక్కదారి పట్టించడంలో ఆరితేరిన బాబు నిజాలు నిరూపణ అయినప్పుడల్లా సాక్షి మీదికి దండెత్తి రావడం బాబుకు ఫ్యాషన్‌ అయ్యింది. భయపెట్టో ఆశచూపో అన్ని మీడియా సంస్థలను పచ్చ గొడుగు కిందికి తెచ్చుకున్న చంద్రబాబుకు సాక్షి నిద్ర లేకుండా చేస్తుండటం సహించలేకపోతున్నాడు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తన అక్కసు వెళ్లబోసుకుంటూనే ఉంటున్నాడు. 

ఒక్కదాని మీదా విచారణ జరగదే..
కోర్టు కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడంలో ఆరితేరిన చంద్రబాబుకు తన పాలనలో జరుగుతున్న అవినీతి మీద విచారణ జరిపించుకునే సాహసం చేయలేకపోతున్నాడు. దాదాపు చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎన్నో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. శాంత్రి భద్రత విషయంలోనూ ఎన్నో కీలక సమస్యలు ఎదురయ్యాయి. సాక్షాత్తు స్పీకర్‌ సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్య, తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి, కర్నూల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య, అనకాపల్లిలో లావణ్య అనే యువతిని కారుతో గుద్దించి చంపడం, చిత్తూర్‌ మేయర్‌ అనూరాధ దంపతుల హత్య.. ఇలా చెప్పుకుంటే మహిళల మీద దాడులు అనేకం. ఒక్కదానికీ విచారణ లేదు. నేరస్థులపై విచారణ లేదు.  అమరావతి భూదందాపై ఆరోపణలు చేసిన సమయంలోనూ, కాపుల దీక్షను కవర్‌ చేసినప్పుడు,  ఇప్పుడు పేపర్‌ లీకైన విషయంలోనూ బాబు మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్నాడు తప్పితే..తాను చేస్తున్న తప్పుడు పనులను మాత్రం ఆపడం లేదు. ప్రతిపక్షం ప్రజాసమస్యలు లేవనెత్తిన ప్రతీసారి ఆ విషయాన్ని పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు....తన పాలనలోని కుంభకోణాలపై  విచారణ ఎదుర్కొనే సాహసం మాత్రం చేయలేకపోతున్నాడు. పేపర్‌ లీకైందన్నది వాస్తవం. లేదంటే ప్రతిపక్షాన్ని నోరుమూయించే అవకాశాన్ని చంద్రబాబు అంత ఈజీగా వదులుకునేవాడు కాదు. లీకు జరిగింది కాబట్టే ప్రతిపక్షాలు సీబీఐ ఎక్వైరీ కోరుతున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
Back to Top