కాంగ్రెస్‌తో దోస్తీకి చంద్రబాబు తహతహ..!

– రెండు రోజుల ఢిల్లీ పర్యటన పొత్తుల ఖరారుకే
– టీడీపీ ఎంపీలతో దీక్షలో కనిపించిన సోనియాగాంధీ 
– రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే యోచనలో రెండు పార్టీలు 
– చంద్రబాబు నేతృత్వంలో ఏనాడూ ఒంటరిగా పోటీ చేయని టీడీపీ 


చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది అవేవో అన్నట్టు.. రాజకీయాల్లో చంద్రబాబులా మాటలు మార్చే ఊసరవెళ్లి నైజం ఉన్న వ్యక్తి దేశంలో ఇంకొకరు కనిపించరు. అవసరం అనిపిస్తే ఎంతకైనా దిగజారడం.. అవసరం తీరాక పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవటం బాబుకు అలవాటే అనేది తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం గురించి డప్పేసుకునే చంద్రబాబు జీవితంలో ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు.. తిట్టిన మనిషినే నిస్సిగ్గుగా వెళ్లి ముఖం నిండా నవ్వు పులుముకుని కావలించుకున్న క్షణాలు కోకొల్లలు. తన గొప్పలు తానే చెప్పుకోవడం.. అనుకూల మీడియాలో రాయించుకోవడం తప్ప ఆయన్ను మూడో వ్యక్తి కీర్తించిన క్షణాలు చాలా అరుదే. 

తిట్టిన నోటితోనే కీర్తించిన నైజం..

అవసరాల కోసం చంద్రబాబు దిగజారుడు నైజాన్ని గురించి చెప్పుకోవాలంటే కళ్ల ముందు కనిపించే చిన్న సంఘటన గురించి చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా గోద్రా అల్లర్ల నేపథ్యంలో.. ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశాడు. దేశమంతా మోడీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో చంద్రబాబు ఇంకో అడుగు ముందుకేసి మరీ మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే అరెస్టు చేయిస్తానని డాంభికాలు పోయాడు. అలాంటి చంద్రబాబు మొన్న 2014 ఎన్నికలకు ముందు దేశమంతా మోడీ మేనియా నడుస్తుండటంతో.. ఏపీలో టీడీపీ గెలవాలంటే బీజేపీతో జట్టుకట్టడమే మార్గమని భావించి మోడీని దేవుడ్ని చేసి కీర్తించాడు. ఆయన పరిపాలనను రామరాజ్యంతో పోల్చాడు. తిట్టిన నోటితోనే మోడీని ఆకాశనికెత్తేశాడు. బీజేపీతో జతకట్టేది లేదని.. దానిని ముస్లిం వ్యతిరేక పార్టీ అని తిట్టిపోసి అదే పార్టీతో 2014కు ముందు జోడీ కట్టాడు. 

నాలుగేళ్లుగా నీతులు చెప్పి..

నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు... కేసులకు భయపడి ఏనాడూ రాష్ట్రప్రయోజనాలపై నోరు మెదపలేదు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన వాళ్లను జైల్లో పెడతామని హూంకరించాడు. హోదా కంటే ప్యాకేజీనే మేలని.. కేంద్రం చాలా ఇచ్చిందన్న చంద్రబాబు ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఓటమి భయంతో యూటర్న్‌ తీసుకున్నాడు. హోదాతో ఏమొస్తుందన్న నోటితోనే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని నల్ల రిబ్బన్‌ దీక్ష మొదలు పెట్టాడు. తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయంలోనూ కల్లబొల్లి మాటలతో మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నాడు. చావోరేవో అన్నట్టు తెగబడాల్సిందిపోయి.. దీక్షలతో ప్రయోజనం శూన్యం అన్నట్టుగా నల్ల రిబ్బన్లు ధరించి ఇక్కడ్నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆంధ్రాలో దీక్షలు చేస్తే హోదా వస్తుందా దమ్ముంటే ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా చేయమని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన చంద్రబాబు.. ఇప్పుడు తాను మాత్రం దాంతో ప్రయోజనం శూన్యమని చెప్పడం బాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనం. 

కాంగ్రెస్‌తో కలిస్తే ఆత్మహత్య సదృశ్యమే

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సందర్భాల్లో ఆ నేరం కాంగ్రెస్‌దే అన్నట్టు ఆ పార్టీపై నిందారోపణలు చేసిన చంద్రబాబు ఇప్పడదే పార్టీతో జోడీ కట్టడానికే  మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి ఢిల్లీ వెళ్తున్నానని మీడియాలో డప్పసిన చంద్రబాబు.. తొలిరోజంతా పార్లమెంట్‌ హాల్లో ఫొటో షూట్‌ చేసి వచ్చాడు. హేమామాలినితో తీసుకున్న ఫొటో ట్విట్టర్‌లో పెట్టి పోరాటానికి శక్తులను కూడగడుతున్నట్టు రాసుకున్నాడు. రెండో రోజు జాతీయ మీడియాను పిలిపించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసుకుని ఇన్నాళ్లు తెలుగులో చెప్పిన ఏడు చేపల కథని నిన్న ఇంగ్లిషులో చదివి వినిపించాడు. రేపటితో పార్లమెంట్‌ సమావేశాలు ముగుస్తాయి కదా.. అవిశ్వాసం చర్చకు రాకపోయితే ఏం చేయబోతున్నారు... వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతుంటే మీరు మద్ధతు ఇవ్వరా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే దానికి ఆయన దగ్గర మాత్రం సమాధానం లేదు. ఏమడిగినా వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌ అంటూ ఇక్కడ బట్టీపట్టిన ఏడు చేపల కథనే మొదట్నుంచీ చెప్పుకొస్తున్నాడు. ఇదంతా తెరమీద కనిపించే సినిమా. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో నేర్పరిగా చెప్పుకునే చంద్రబాబు తెరవెనుక మంత్రాంగ నడిపించాడు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఢిల్లీ వెళ్లినప్పటికీ కారణం మాత్రం వేరే ఉందని నేషనల్‌ మీడియా చెప్పుకొచ్చింది. అదే నిజం చేసినట్టుగా చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడానికే ఢిల్లీ వెళ్లారని ఆ మేరకు మంతనాలు జరిపినట్టుగా గుసగుసలు వినపడ్డాయి. గురువారం ఉదయానికల్లా సోనియా గాంధీ టీడీపీ ఎంపీల నిరసనకు మద్ధతు ప్రకటించడం చూసి అదంతా నిజమేనని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని చంద్రబాబు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కడతారని తలపండిన రాజకీయ నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే టీడీపీకిది ఆత్మహత్యాసదృశ్యమే. ఏ పార్టీ మీదకైతే వ్యతిరేకంగా ఆనాడు ఎన్‌టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పార్టీని స్థాపించారో... ఇప్పుడదే పార్టీ కాంగ్రెస్‌తో జట్టుకడితే ఎన్‌టీఆర్‌ ఆత్మక్షోభించడం ఖాయం. మేధావినని డప్పేసుకునే చంద్రబాబు గొప్పతనం.. మూడు సార్లు గెలవడం వెనుకున్న పాండిత్యం భాగస్వామ్య పార్టీలదే తప్ప ఆయనది ఎంతమాత్రం కాదనేది ఒప్పుకోకతప్పని నిజం. 
Back to Top