ఆర్భాటపు నిరసనలు.. కుతంత్రపు ఆలోచనలు

– ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబులో లేని చిత్తశుద్ధి
– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా ప్రకటన నుంచీ బాబు యూటర్న్‌లు
– నల్ల రిబ్బన్లతో హోదా కోసం ఉడుత ప్రయత్నాలు 

ఉడుత ఊపులకు చింతకాయలు రాలవనేది ఎంత నిజమో.. నల్ల రిబ్బన్లతో ప్రత్యేక హోదా సాధించడం సాధ్యం కాదనేది అంతే నిజం. ఈ విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా అనుమానం లేకుండా చెబుతాడు. కానీ నలభయ్యేళ్ల అనుభవమని చెప్పుకునే మేధావి చంద్రబాబుకు మాత్రం ఈ చిన్న సూక్ష్మం అర్థం కావడం లేదు. మూడేళ్లు బీజేపీతో అంటకాగి కేంద్రంలో పదవులు వెలగబెట్టిన టీడీపీ.. ఒక్కసారిగా మాటమార్చింది. హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు.. ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయమని యూటర్న్‌ తీసుకున్నాడు. ఒక్కసారిగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయాడు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడుకు ఉక్కిరిబిక్కిరైన చంద్రబాబు.. కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాడు. అదే సమయంలో ఎన్‌డీఏ కూటమిలో కొనసాగుతానన్నాడు.. అంతలోనే ఎన్‌డీఏ నుంచి కూడా బయటకొస్తానన్నాడు. అవిశ్వాసంతో ఏం సాధిస్తాం.. ప్రభుత్వం కూలిపోతుందా అన్న చంద్రబాబు.. వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించాడు. అంతలోనే మళ్లీ యూటర్న్‌ తీసుకుని తామే సొంతంగా అవిశ్వాసం పెడతానన్నాడు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఆందోళనలు నిర్వహించి అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అక్కడ్నుంచి పబ్లిసిటీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.. 
రోజుకో డ్రామా.. 
ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. ఏ రోజునైతే వైయస్‌ జగన్‌ చెప్పారో.. ఆ రోజు నుంచే టీడీపీ రోజుకో డ్రామాతో కాలక్షేపం మొదలు పెట్టింది. ప్రత్యేకహోదాపై పోరును వైయస్‌ జగన్‌  క్లైమాక్సు తీసుకుస్తే.. సహకరించాల్సిందిపోయి హడావుడి నిరసనలు మొదలు పెట్టాడు. నాలుగేళ్లు ప్యాకేజీ పట్టుకుని వేలాడిన మనిషి ప్రత్యేక హోదాకు సై అన్నాడని సంతోషించేలోపే తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రదర్శించాడు. ఏం చేసినా గొప్పగా చూపించే అనుకూల మీడి ఉందనే ధీమాతో తెలుగు ప్రజలకు నమ్మకద్రోహం చేయడానికి వెనుకాడటం లేదు. హోదా కోసం నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేస్తామని ప్రకటించాడు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతుంటే వీళ్లు మాత్రం సైకిల్‌ యాత్రలు మొదలు పెట్టారు. చివరి రోజునైనా అవిశ్వాసంపై చర్చ జరగాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిస్తే టీడీపీ ఎంపీలు మాత్రం స్పీకర్‌ ఉన్నంతసేపూ మిన్నకుండిపోయి.. సీటు ఖాళీ అయ్యాక మాత్రం ప్లకార్డుల ప్రదర్శన చేసి నవ్వు తెప్పించారు. నలభయ్యేళ్ల మేధావి బీజేపీకి వ్యతిరేకంగా మద్ధతు కూడగడుతానని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌తో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు డీల్‌ మాట్లాడుకొచ్చారని ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్‌ నాయకులు చేపట్టని నిరసన కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొంటే..టీడీపీ నాయుకులంతా వెళ్లి ఆమెకు నమస్కరించి.. జైరాం రమేశ్‌ వంటి కాంగ్రెస్‌ నాయకులతో సుజనా, సీఎం రమేశ్‌ వంటి వారు కాంగ్రెస్‌ నాయకులతో హడావుడిగా కనిపించారు. కాంగ్రెస్‌–టీడీపీల మధ్య డీల్‌ కుదిరిందని వార్తలొచ్చిన తెల్లారే టీడీపీ ఎంపీల వేషధారణలో తీవ్రమైన మార్పులు జరిగాయి. తెలుపు కంటే పసుపునే ఎక్కువగా ఇష్టపడే టీడీపీ నాయకులు.. ఖద్దర్‌ వస్త్రాలు ధరించి.. నెత్తిన టోపీలు ధరించి రోటీన్‌కు భిన్నంగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే సోనియాను కలిసారో టీడీపీ నాయకుల మధ్య ఈ తేడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా విశాఖలో బీచ్‌ రోడ్డులో గంట ధర్నా జరుగుతుందని సెలవిచ్చారు మంత్రి గంటా. ఉదయం వేళ ఎండ లేనిసమయంలో కాసేపు వాకింగ్‌ చేసి ధర్నా చేస్తారని చెప్పినట్టు సమాచారం. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు యూటర్న్‌లు తీసుకోవడం.. మీడియాలో కనపడేందుకు తాపత్రయే తప్ప చిత్తశుద్ధిగా చివర్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నం చేయడం లేదనేది లోకమెరిగిన సత్యం. 
 
Back to Top