మూడేళ్ల పాలనలో అబద్ధాలు..అవినీతి..వంచన

– ఆత్మస్తుతి పరనిందలతోనే కాలక్షేపం
– అవినీతిలో దూసుకుపోతున్న నవ్యాంధ్ర 
– పడికట్టు పదాలతో బోరింగ్‌ ప్రసంగాలు 
– మూడేళ్లయినా అడుగు కూడా పడని అభివృద్ధి 
– పాత ప్రాజెక్టులకే బాబు  రిబ్బన్‌ కటింగ్‌లు 
-దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలతో అరాచక పాలన
   
ప్రసంగం మొదలెడుతూనే ఇది ఒక చరిత్ర అని మొదలు పెట్టే చంద్రబాబు మూడేళ్ల పాలన కూడా ఒక చరిత్రే. ఈ మూడేళ్లను ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే పెద్ద పెద్ద వాగ్ధానాలే కనిపిస్తాయి తప్ప.. జనాలకు జరిగిన మేలు చూద్దామన్నా కనపడదు. ఏ జిల్లాకు వెళ్లినా భూదందాలు, ఇసుక మాఫియా, అవినీతిలో కూరుకుపోయిన తెలుగు తమ్ముళ్లు తప్ప అభివృద్ధి జాడ చూద్దామన్నా కనపడదు. కోటలు దాటించే వాగ్ధానాలు చేయడం.. చేతల్లో వచ్చేటప్పటికి తుస్సుమనిపించేయడం బాబుకు  అలవాటైంది. అవినీతిలో ఏపీని నెంబర్‌ వన్‌ చేయడం.. గోదావరి పుష్కరాల్లో 30 మంది విగతజీవులుగా మారిపోవడం.. అంతర్జాతీయ అసెంబ్లీ అని ఊదరగొట్టిన సచివాలయంలో ఏడాది కూడా గడవ కుండానే ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో బక్కెట్లతో ఎత్తి పోసినట్టు జోరున వాన కురవడం..  రికార్డు కాలంలో పూర్తిచేశామని చెప్పుకుంటున్న పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 199 కోట్ల భారీ అవినీతి జరిగిందని కాగ్‌ తేల్చేయడం లాంటివన్నీ నవ్యాంధ్రకు మైలు రాళ్లే. అన్యాయంగా విడగొట్టి కట్టుబట్టలతో పంపారని దీన కథలు వినిపించిన చంద్రబాబు మూడేళ్లలో మూడు ఇళ్లు కట్టుకుంటే.. పక్కా ఇంటి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడు ఇప్పటికీ ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. పేద రాష్ట్రంలో ఉన్నాం.. ఖర్చులు తగ్గించుకోవాలని జనాలకు సుద్దులు చెప్పే బాబు మాత్రం నాలుగైదు కిలోమీటర్లకు కూడా హెలికాఫ్టర్లో తిరగొచ్చు.. రూ. 5కోట్లతో ఇంటిని తలపించే బస్సును ఏర్పాటు చేసుకోవచ్చు... అదే సామాన్యుడు ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి కూడా ఛార్జీలు అందుబాటులో ఉండవు. 

ఎన్నికల వాగ్ధానాలే అమలు కాలేదు..
చంద్రబాబు ఎన్నికల్లో ఏవైతే హామీలిచ్చి గెలిచాడో మూడేళ్లయినా ఒక్కటీ అమలు కాలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేస్తానని చెప్పిన బాబు ఏ మేరకు చేశారో గ్రామాలకెళ్లి ఎవర్నడిగినా తమకు జరిగిన అన్యాయం ఏకరువు పెడతారు. ఆ మాత్రం హామీలు అమలయ్యాయంటే అది కూడా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌సీపీ చేసిన పోరాటాలు, ధర్నాలేనని ఒప్పుకోకతప్పదు. వైయస్‌ జగన్‌ నిర్వహిస్తున్న యువభేరిల జోరుకు బ్రేకులు వేయాలని చూసి నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రూ. 500 కోట్లకు ఇప్పటికీ విధివిధానాలు రూపొందించనేలేదు. అధ్యయనం చేస్తున్నాం.. దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అమలు చేస్తామని టైం పాస్‌ చేయడమే కానీ ఎప్పట్నుంచి నిరుద్యోగభృతి ఇవ్వబోతున్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారంలోకి వస్తే బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బాబు లబ్ధిదారుల పేరుతో ఎంతోమంది  రైతులను అనర్హులుగా ప్రకటించారు. నామమాత్ర రుణమాఫీ పొందిన రైతులకు కూడా ఇచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోవడం లేదు. కౌలు రైతుల పరిస్థితి సరేసరి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇన్వెస్టమెంట్‌ ఫండ్‌ పేరుతో పదివేలు మూడు విడతలుగా ఇస్తున్నాడు. ఎన్నికల్లో చెప్పిందీ.. మూడేళ్లుగా చేస్తున్నదీ పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు పేదోడికి సంజీవనిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆరోగ్య శ్రీ పథకం ఎందుకూ కొరకాకుండా పోయింది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వారు ఉచిత వైద్యానికి ముందుకు రావడం లేదు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చాక ఎంతోమంది ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల్లోంచి తీసేశారు. హాజరు పేరుతో 9 వేల పాఠశాలలకు మూత పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించమని పోరాడుతూనే ఉన్నారు. లేక లేక ఇచ్చిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ప్రణాళిక లేకపోవడంతో అభ్యర్థులు ధర్నాలు వాయిదా వేయించుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో రూ. 2లకు 20 లీటర్ల మంచినీరు ఇస్తామన్న బాబు హామీ ఎన్నిచోట్ల అమలు చేస్తున్నారో ప్రకటించే సాహసం బాబుకు లేదు. 

దీనాతిదీనంగా రైతుల పరిస్థితి..
చంద్రబాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కాదని నిరూపించుకునేందుకు ఏనాడూ ప్రయత్నించిన పాపాన పోలేదు. బాబు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో కానీ అప్పట్నుంచి రాష్ట్రాన్ని కరువు పీడిస్తోంది. రాయలసీమలో పది పదిహేను ఎకరాలున్నా రైతులు కూడా ఉపాధి కోసం కేరళ, బెంగళూర్‌కు వలస పోతున్న దుస్థితి. రెయిన్‌ గన్‌లతో నాలుగు రోజుల్లో కరువును పారదోలామని చంద్రబాబు అనంతపురంలో ప్రకటించి వస్తే.. అదే అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ నిర్వహించిన రైతు ధర్నాకు రైతులు పోటెత్తారు. కరువును తరిమేయడానికి రెయిన్‌గన్‌లు వాడామన్నారు.. ఆ రెయిన్‌ గన్‌లతో పొలంలో సాగుకు అవసరమయ్యే పదును తెచ్చారా.. పదును రప్పించడానికి అవసరమైన నీటిని ఎన్ని లక్షల ట్యాంకర్లతో తెప్పించగలిగారు. మూడు రాష్ట్రాలు తిరిగినా మీకు దొరికే అవకాశమే లేదని లెక్కలతో నిరూపించడంతో ప్రభుత్వానికి దేవుడు కనపడ్డాడు. అనంతపురంలోనే మంత్రులు ప్రెస్‌ మీట్‌ పెట్టి కరువు పారదోలడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించాల్సి వచ్చింది. రైతుల వలసలు అరికట్టేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సింది పోయి ఈ ఏడాది మిగిలిపోయిందని జోకులు పేలుస్తారు. అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి నష్టపరిహారం చెల్లించకుండా పరిహారం ఎగ్గొట్టేందుకు విచారణ పేరుతో ఆ కుటుంబాలను ఆఫీసులకు పిలిచి మరింత క్షోభకు గురిచేస్తున్నారు. 2013 చట్టం ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లిచాల్సి వున్నా అమలు అంతంత మాత్రంగానే ఉంది. పోలవరం, వంశధార నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా వారికి ఇప్పటికీ అందక దానికోసం పోరాడుతూనే ఉన్నారు. అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించేసి తెలుగు తమ్ముళ్లు ప్రజలపై పెత్తనం చేసేలా చట్టాలు మార్చారు. గత ప్రభుత్వం చేపట్టి ఐదూ పది శాతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయ తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. ముచ్చుమ్రరి, పైడిపాలెం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పూర్తయినవై. పట్టిసీమ కాలువ పనులు కూడా ఏడెనిమిది కిమీలు మినహా అప్పుడు పూర్తి చేసిందే. 

మహిళలకు రక్షణ కరువు
ఎన్నికలకు ముందు ప్రతి ఆడపడుచుకు అన్నగా ఉండి కాపాడతానని ప్రమాణం చేసిన వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూనే ఉండిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ నాయకులు చేసిన దాడులే కనిపిస్తున్నాయి. భర్తతో కలిసి బైకుపై వెళ్తున్న లావణ్య అనే మహిళను టీడీపీ నాయకుడు కుమారుడి కారుతో గుద్ది చంపితే విచారణలేదు.. శిక్షా లేదూ. ఇలాంటి ఘటనే పాలకొల్లులో వెలుగు చూసింది. ఓ టీడీపీ నాయకుడి భార్యే.. స్కూటీపై చెల్లితో కలిసి వెళ్తున్న గౌతమి అనే యువతిని కారుతో గుద్దంచి చంపించింది. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకార్‌ జుట్టు పట్టుకుని ఈడిస్తే విచారణ లేదు. విచిత్రంగా ఈ మూడు సంఘటనల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి బాధితులతో మాట్లాడి రాజీ చేశారనే విమర్శలు వినింపించాయి. ఇవేకాక కదిరిలో ఓ మహిళను ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు వివస్త్రను చేసి కొడితే శిక్షలేదు.. పయ్యావుల అనుచరులు మహిళను ఎగిరి కాలితో తన్నితే విచారణ లేదు. నంద్యాల ఆర్జీఎం కాలేజీలో తేజశ్విని అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని ర్యాంగింగ్‌ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులన్నింటిలోనూ ఉన్న ఒకేఒక కామన్‌ పాయింట్‌ నిందితులంతా టీడీపీ నాయకులే. బయటి మహిళ పరిస్థితే కాదు. టీడీపీ మహిళా నాయకురాళ్ల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పార్టీల ఉండీ వారు వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. టీడీపీ నాయకులు ఆగడాలకు మాచర్ల జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాపట్ల విజేతమ్మ, గుంటూరు జడ్పీచైర్‌పర్సన్‌ జానీమూన్‌ వంటి వారు లోకే ష్‌కు చెప్పినా న్యాయం జరగడం లేదని మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ కొడుకు తప్పతాగి ఓ మహిళను వేధించినా అతనిపై చర్యలు లేవు.  ఇదంతా ఒక ఎత్తయితే సాక్ష్యాత్తు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురు డాక్టర్‌ మాధవీలత తనను మాజీ మంత్రి బొజ్జల అనుచరులు బెదిరించారని.. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించినా దిక్కులేదు. కానీ ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రం ఇళ్లు మోతెక్కి పోయేలా టీవీల నిండా మహిళలకు రక్షణ కల్పిస్తానని యాడ్‌లు దంచేశారు. 

అవినీతిలో ఆకాశమే హద్దు...
టీడీపీ మూడేళ్ల పాలనలో జరిగిన అవినీతిని చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే. అమరావతి రాజధాని నిర్మానం పేరు చెప్పి చేసిన భూమి పూజ మొదలుకుని నిన్న విశాకలో వెలుగు చూసిన భూ ఆక్రమణల వరకు అన్నింటా అవినీతి ఆరోపణలే. డబ్బులు సంపాదించుకునేందుకే పనులు మొదలు పెడుతున్నారేమో అన్నంతగా టీడీపీ నాయకులు అవినీతి పెచ్చుమీరిపోయింది. ప్రధానిని ఆహ్వానించి రూ. 400 కోట్లు ఖర్చుతో చేసిన భూమి పూజ, విశాఖలో దసపల్లా భూముల కుంభకోణం, విజయవాడలో సిద్ధార్ధకు భూములు లీజుకివ్వడం, అమరావతిలో వేల కోట్ల విలువైన భూములు ముందుగానే టీడీపీ నాయకులకు కట్టబెట్టడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో, నకిలీ విత్తనాలల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు, పుష్కరాల కోసం చేసిన ఖర్చు.. రికార్డు స్థాయిలో పూర్తి చేశామని చెప్పుకుంటున్న పట్టిసీమలో రూ. 199 కోట్లు అవినీతి జరిగిందని కాగ్‌ నివేదికలో వెల్లడైంది. అసెంబ్లీ నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 10 వేలు ఖర్చు పెట్టడం.. నిన్నటి వర్షానికి గోడ కూలిపోవడం.., ప్రతిపక్ష నాయకుడి క్యాబిన్‌ జలమయం కావడంపై ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే కాదు.. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ తమ సర్వేలో ఏపీని అవినీతిలో నెంబర్‌ వన్‌గా చేస్తూ ఇచ్చిన రిపోర్టు. 

ప్రతిజ్ఞలు.. ప్రసంగాలే...
పడికట్టు పదాలతో ప్రసంగాలే తప్ప ఒక్క హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలం చెందారనే చెప్పాలి. మూడేళ్లలో 18 సార్లు విదేశీ పర్యటనలు చేసి దాదాపు రెండు నెలలు విదేశాల్లోనే గడిపిన బాబు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని చెప్పడం తప్పించి ఒక్క కంపెనీ ఏర్పాటైంది లేదు.. పది మందికైనా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. పెట్టుబడుల పేరుతో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో గతేడాది ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకున్న వివరాలతో అంతా ఉత్తదేనని తేలింది. మళ్లీ ఈసారీ నిర్వహించిన సీఐఐ సదస్సులో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ ఏ ఒక్క కంపెనీ ఇంతవరకు పెట్టి ఉద్యోగాలిచ్చింది లేదు. పడికట్టు పదాలతో ఒక చరిత్ర..  అంతా తానే చేశానని ప్రచారం చేసుకోవడం తప్పించి రాష్ట్రానికి ఒరగబెట్టింది మాత్రం శూన్యం. తెలంగాణలోకి వెళ్లినప్పుడు నేనే లెటర్‌ రాశానని చెప్పడం.. ఆంధ్రాకొస్తే ఇదొక చీకటి రోజని కన్నీరు కార్చేయడం బాబుకే చెల్లింది. నవనిర్మాణ దీక్షల పేరుతో అందరిచేతా ప్రతిజ్ఞలు చేయించే బాబు ఆ ప్రతిజ్ఞలు తానూ ఫాలో కావాలనే ఆలోచనలో ఉన్నట్టు లేడు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఎన్నిసార్లు మాటమార్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోదా సంజీవని అని ఒకరోజు.. ప్యాకేజీ బెస్ట్‌ అని ఇంకోరోజు.. ఏం చేయలేం కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్ప అని మరోరోజు చెప్పుకోవడంపై చంద్రబాబే ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మస్తుతి, ఆడంబరాలను కాస్త తగ్గించుకుని పరిపాలనపై దృష్టిసారిస్తే మంచిదేమో..

Back to Top