బాబు దీక్షకు స్పందన కరువు

మొగుడు మొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అందట వెనకొటికొకావిడంచంద్రబాబు కొంగ జపం దొంగ దీక్ష కూడా అలాగే ఉంది. దీక్ష వల్ల 30 కోట్ల ప్రజాధనం ఖర్చు అయ్యిందని బాధలేదు, ఆ ఒంటి రోజు ఎసి దీక్ష వల్ల ఒక్కరికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఒరిగింది కూడా ఏమీ లేదు. కానీ దాని గురించి బాబుకు దిగులు లేదు. ఆయన బాధంతా తన దీక్షకు మైలేజీ దొరకలేదని..ఆస్థాన మీడియా ఎంత ఎగ్జాగిరేట్ చేసినా, పట్టు పరుపుల మీద కూర్చుని చిద్విలాసంగా చిరునవ్వులు చిందించడమే దీక్ష అంటే ప్రజలు ఛీ కొట్టారు. మండుటెండల్లో వందలాది బస్సుల్లో విద్యార్థులను బలవంతంగా తరలించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం, ప్రభుత్వాధినేత తమ గొప్పలు తామే చెప్పుకుంటూ పాటలు రాయించుకుని, పాఠశాల విద్యార్థులతో డాన్సులు చేయించుకుని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన విద్యార్థులను, టిడిపి పథకాల ప్రచారానికి, చంద్రబాబు పొగడటానికి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గు చేటు. బాలల హక్కుల సంఘాలకు ఇది తప్పనిపించకపోవడం మరీ విడ్డూరం. టివిల్లో రియాలిటీషోల్లో చిన్నారులతో రికార్డింగ్ డాన్సులు చేయించడం ఎంత తప్పో, ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం చిన్నారులను ఉపయోగించుకోవడం కూడా అంతే తప్పు.  ఈ విషయంపై మీడియాగానీ, సామాజికవేత్తలు గానీ, బాలల హక్కుల సంఘాలు కానీ కల్పించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. 
బాబు బాధ
కుల సంఘాలు వచ్చాయి కానీ పార్టీలెవ్వరూ నా దీక్షకు రాలేదని ముఖం ముడుచుకున్నాడు చంద్రబాబు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఉద్యమాలకు అడ్డంకులు సృష్టించాడు బాబు. పార్లమెంట్లో అవిశ్వాసానికి కలిసొస్తానని చెప్పి తిరిగి మాట మార్చాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఎమ్.పిలురాజీనామాలు సమర్పిస్తూ, ప్రభుత్వాన్ని కూడా తమ ఎమ్.పిల ను రాజీనామా చేయించమన్నప్పుడు స్పందించలేదు. ఆమరణ నిరాహారదీక్షలో టిడిపి ఎమ్.పిలు కూడా భాగస్వామ్యం కమ్మంటే కిమ్మనలేదు. హోదా కోసం ఎపి బంద్ కు పిలుపునిస్తే బాబు తన పోలీసు బలగంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ రాస్తారోకోలు చేస్తే అడ్డుపడ్డాడు. అలాంటి బాబు ఇప్పుడు తాను చేసే ఒంటిరోజు దీక్షకు ప్రతిపక్షాలు మద్దతివ్వలేదని ఉడుక్కోవడం విడ్డూరం. అసలు హోదాపై బాబుకు చిత్త శుద్ధి లేదన్న కారణంతోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సిపి చంద్రబాబును దూరం పెట్టింది. నిన్నటిదాకా పూసుకు తిరిగిన జన సేన అధినేత కూడా బాబు వక్రబుద్ధిని బైటపెడుతున్నాడు. ఇక అఖిల పక్షానికి వచ్చి ముఖమ్మీదే చంద్రబాబును నమ్మే ప్రసక్తిలేదని, హోదా కోసం మా ఉద్యమం మేం చేసుకుంటామని ప్రకటించేసాయి వామపక్షాలు, ఇతర విపక్షాలూ. హోదాపై హోనిజాయితీగా లేకుండా, కేవలం మభ్యపెట్టే స్టంట్లతో కాలం వెళ్లదీస్తున్న బాబును ఏ రాజకీయ పార్టీ మాత్రం సమర్థిస్తుంది? సంఘీభావం తెలుపుతుందీ?? 
బాబు మేకపోతు గాంభీర్యం
కేంద్రంపై సమర శంఖారావం పూరించి, ఢిల్లీ నడిబొడ్డున నిరాహారదీక్ష చేసి సవాల్ చేసింది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది ఆ యువజన నేత సత్తా. ఆ నవయుగ నేత నడిపించే పార్టీకున్న స్టామినా. ఏళ్లకు ఏళ్లు అనుభవం అని చెప్పుకునే పెద్దమనిషి మాత్రం పిల్ల చేష్టలతో ఉద్యమాన్ని వేళాకోళం చేయడమే పనిగా పెట్టుకున్నారు. హోదా గర్జనలో రాష్ట్రం అట్టుడుకుతుంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్.పిలు నిరాహార దీక్షలు చేస్తే, బాబు సైకిల్ బెల్ మోగించి ఇదే మోదీకి సమరభేరి అంటాడు. రాష్ట్రం అంతా ఒక్కటై బంద్ చేసి నిరసన చూపిస్తే ఎసిలో పరుపుల మీద కూర్చుని, పలువురితో పొగిడించుకుని పుట్టిన రోజును 30 కోట్ల ప్రజాధనంతో ఖర్చు పెట్టేసి ఇది దీక్షా అంటున్నాడు. కేంద్రంపై శాంతి యుతంగా పోరాటం చేస్తున్నానంటూ శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. దీని వెనుక భావమేంటో కూడా చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా అర్థం అవుతోంది. కేంద్రం తనను ఇబ్బంది పెట్టాలని చూస్తోందింఅదే జరిగితే తీవ్రపరిణామాలుంటాయి అనడంలో బాబు భయం సామాన్యులకు కూడా తెలిసిపోతోంది. ఇంతకాలం చేసిన అక్రమాల చిట్టా పద్దు కేంద్రం చేతిలో ఉంది గనుకనే నేడు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి బాబు అంతగా దడుస్తున్నట్టు అర్థం అవుతోంది. ఓటుకు నోటు కేసు సమయంలో ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డగోలుగా మాట్టాడినట్టే, నాదో ప్రభుత్వం వారిదో ప్రభుత్వం అంటూ వింత వాదనలు లేవనెత్తాడు బాబు. నాకేం భయం లేదంటూనే, నాపై ఏదో రూపంలో దాడులు చేయొచ్చు అంటూ తమ్ముళ్లకు సంకేతాలు అందించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపి ఎపి లో టిడిపి ప్రభుత్వ అవినీతిపై ఫోకస్ పెడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బాబు ఈ వాఖ్యలు చేసారు.తన దీక్షను పక్కదారి పట్టిస్తున్నారంటూ వాపోతున్న చంద్రబాబు తాను చేసింది అసలు దీక్షేనా అని ఒక్కసారైనా స్వగతంలో ప్రశ్నించుకుని ఉండడు. దీక్షే అంటూ సమర్థించుకున్నా అది నలుగురూ వెళుతున్న ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమదారిలో లేదని, సంబంధం లేని పక్కదారిలోనే ఉందని ఆయనకి అర్థం కావాలి. అందుకే విపక్షాలన్నీ ఒక్కమాట గా బాబును నమ్మలేమని తేల్చి చెప్పేసాయి.
ఒంటిరోజు దీక్షలోనే బాబు మరో అక్షర సత్యాన్ని బైటపెట్టాడు. ప్రత్యేక హోదాను తానసలు అడగలేదని, కేంద్రం అన్నది కనుక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అన్న విషయంలోనూ చంద్రబాబుకు క్లారిటీ లేదని రూఢీ చేసుకోవచ్చు. 
బలవంతపు దీక్షా తీర్థం
విజయవాడలో చంద్రబాబు దీక్ష జరుగుతుండగా జిల్లాల్లో టిడిపి నేతలు బలవంతపు దీక్షలను చేయించారు. రవణా వ్యవస్థకు అంతరాయం కలిగిస్తూ, దారినపోయే వాహన దారులను కూడా అడ్డగించి కొద్దిసేపు దీక్షకు మద్దతు తెలపాలంటూ బలవంత పెట్టారు. వెళ్లిపోతమన్నవారిపై బెదిరింపులకు దిగినట్టు కూడా కొన్ని చోట్ల నుంచి సమాచారం అందింది. పార్టీ నేతలు, శ్రేణులు, లేదా కార్యకర్తలు, స్వచ్ఛందంగా వచ్చే ప్రజలతో దీక్షలు జరపాలి కానీ ఇలా వందలాది బస్సులు వేసి విద్యార్థులను తరలించి, అధికారులను బెదిరించి పిలిపించి, డ్వాక్రా, అంగన్ వాడీ మహిళలనురప్పించి, చివరకు వాహనదారులను బలవంత పెట్టి దీక్షలు చేయించడం వల్ల  టిడిపి చౌకబారుతనం ప్రజల ముందు మరోసారి బట్టబయలైంది. 

 

తాజా వీడియోలు

Back to Top