చంద్రబాబు నియం’తత్వం’

చంద్రబాబు నాయుడికి రాష్ట్రం మీద కన్నా, ప్రజల మీద కన్నా, అభివృద్ధి మీద కన్నా భారీ సైజు నిర్మాణాలపైనే మోజెక్కువ. నియంతృత్వ మనస్తత్వానికి ఇదో ప్రతీక. తమ గొప్పతనానికి చిహ్నాలుగా ఉండాలని కొన్ని భారీ కట్టడాలను నిర్మించేవారు నాటి పాలకులు. ప్రజలను పీడించి, పన్నులు వసూలు చేసి, వారి శ్రమను దోచుకుని కట్టిన అనేక భవంతులు, కోటలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ప్రజలకోసం ఒక చెట్టును పెంచినందుకు అశోకుడు వంటి పాలకులు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. 

ఆధునిక రాజకీయాల్లోనూ భవనాలతో, భారీ నిర్మాణాలతో గొప్పపేరు తెచ్చుకోవాలనే ఉబలాటపరులు చాలామంది కనిపిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు వరసలో ఉంటారు. హైదరాబాద్ లో కట్టిన హైటెక్ సిటీని, పార్కులను చూపిస్తూ అదే తన ప్రతిభ అంటూ మురిసి పోతుంటారు చంద్రబాబు. కాని ఆయన నిర్మాణ ప్రియత్వంలో పడి పేదలను, రైతులను, సమస్యల్లో కొట్టు మిట్టాడే ప్రజలను పూర్తిగా మరిచిపోయారు. విదేశీ అతిథులతో సైబర్ ప్రపంచ విహారం చేస్తూ మైమరిచిపోయారు. నేటికీ చంద్రబాబు అదే తీరులో ఉన్నారు. 

గ్రాఫిక్స్ లాంటి డిజైన్లతో రాజధాని కావాలని, శిఖరాల్లాంటి నిర్మాణాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోని అందుకోసం నిర్మాణ రంగ నిపుణులను సంప్రదిస్తారా అంటే అదీ లేదు. మూడు గంటల సినిమాకోసం టెంపరరీ సెట్టింగులను ఏర్పాటు చేసుకునే సినీ దర్శకులను, ఆర్టిఫిషియల్ డిజైన్లు తయారు చేసే ఆర్ట్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారు. మెన్నటికి మొన్న రాజమౌళి వెంటపడి రాజధాని డిజైన్లను చేయమని అడిగిన చంద్రబాబు, నేడు కృష్ణా గోదావరి సంగమం వద్ద డైరెక్టర్ బోయపాటితో ఆలయం డిజైన్ ను తయారు చేయిస్తున్నారు. ప్రజాధనాన్ని దేనికి వినియోగించాలో, ఎలా వినియోగించాలో తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించానని, గొప్ప అడ్మినిస్ర్టేటర్ ని అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా…? తెలియక కాదు. ముఖ్యమంత్రి కనుక తానేం చేసినా చెల్లుతుందనే అదికార పూరిత అహంకార వైఖరే అందుకు కారణం. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులుగా బతుకీడుస్తున్నారు. వ్యవసాయం కలిసిరాక, ప్రభుత్వం మెండి చేయి చూపిస్తుంటే ఎందరో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. తాగు, సాగు నీరు సమస్యలు రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. విద్యా, వైద్య రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. సౌకర్యాల లేమి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అనారోగ్య సమస్యలు ప్రజలను వణికిస్తున్నాయి. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఆదాయం తక్కువ ఖర్చులు భారంగా మారుతున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్రం ఉన్నా రాజధాని లేకుండానే మూడేళ్లుగా పాలన సాగుతోంది. 

రాష్ట్రానికి అవసరమైన ఎన్నో అంశాలను పక్కన పెట్టి చంద్రబాబు మహానిర్మాణాలు, ప్రాకారాలు, భవనాలు, ఆలయ శిఖరాలు అంటూ సమీక్షలు చేస్తుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పని చేయాల్సిన నాయకుడు ఒక మతాన్నో, కులాన్నో, వర్గాన్నో అభిమానిస్తూ దానికోసం ప్రజాధనాన్ని తనకు నచ్చిన విధంగా ఖర్చు చేయడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు.  బాబు తన సొంత పేరు ప్రతిష్టలకోసం రాష్ట్ర సంపదను దోచిపెట్టే విధానం మానుకోవాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 
Back to Top