నంద్యాల విజయం వెనుక చీకటి కోణాలు

– ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు
– జూలైలోనే డ్వాక్రా మహిళలకు ప్రలోభాలు
– ఆధారాలతో సహా బట్టబయలు 
– నంద్యాల మినహా మిగతా ప్రాంత మహిళలకు మొండిచేయి

నంద్యాల విజయం కోసం టీడీపీ తొక్కిన అడ్డదారులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నంద్యాల్లో నిలబడటమే కష్టమనుకునే స్థితి నుంచి టీడీపీ భారీ మెజారిటీ సాధించడం వెనుకున్న అసలు నిజాలు బహిర్గతం అవుతున్నాయి. అధికారాన్ని వందశాతం అడ్డం పెట్టుకుని నిస్సిగ్గుగా చంద్రబాబు చేసిన కుటిల రాజకీయం గురించి తెలుసుకుని ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  నంద్యాల ఓటర్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున జమ చేశాడని తెలుసుకుని మిగతా ప్రాంతాల డ్వాక్రా మహిళలు నోరెళ్లబెడుతున్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు.. ఒక్కో డ్వాక్రా మహిళకు అభివృద్ధి నిధి కింద పదివేలు ఇస్తానని ప్రకటించాడు. ఆ పదివేలు ఇవ్వడానికే మూడు విడతలు అన్నాడు.  అదే నంద్యాల ఎన్నికల రావడంతో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందు నుంచే జూలై నెలలో మొదలుపెట్టి ఈ తతంగాన్ని పూర్తి చేశాడు. 

పాలనంతా ప్రలోభాలే..
చంద్రబాబు పాలన మొత్తం చూస్తే అంతా ప్రలోభాల పర్వమే. గొప్ప గొప్ప మాటలు చెప్పి అద్భుతాలు చేస్తానని నమ్మించి అధికారంలోకి రావడం.. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇచ్చిన హామీలను విస్మరించడానికి కుంటి సాకులు చెప్పడం బాబుకు అలవాటే. 2014 ఎన్నికలకు ముందూ.. గెలిచిన తర్వాత జరుగుతున్నది అదే. నంద్యాల లాంటి ఉప ఎన్నికలొస్తే భారీగా డబ్బులు పంచి.. ఓటర్లను బెదిరించి గెలవడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. అనుకోకుండా వచ్చిన నంద్యాల కోసం చంద్రబాబు చేసిందీ అదే. మూడేళ్లలో మొదలు పెట్టని వేల కోట్ల అభివృద్ధి పనులు ఒక్కసారిగా మొదలయ్యాయి. రోజూ జనం మొత్తుకొంటున్నా తలకెక్కించుకోని రోడ్డు విస్తరణ రాత్రికిరాత్రే గుర్తుకొచ్చింది.. ముస్లింల మీద ప్రేమ పొంగుకొచ్చింది. కోటి రూపాయలు ఖర్చు చేసి ఇఫ్తార్‌ విందులు.., జలీల్‌ఖాన్‌కు వక్ఫ్‌బోర్డు పదవి, ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ లాంటివన్నీ నంద్యాల పుణ్యమే. నంద్యాల ఎన్నికంటూ జరగకపోయుంటే.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవానికి ఒప్పుకుని ఉంటే మాత్రం పరిస్థితులు ఘోరంగా ఉండేవని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 
Back to Top