ఏం సాధించారని విజయోత్సవాలు?

కేబినెట్ సమావేశంలో ప్రజల గురించి చర్చించరా..
శంఖుస్థాపన సింగపూర్ కంపెనీ కోసమేకదా..?
పూలింగ్ నిజమైతే రైతులు చెక్కులెందుకు తీసుకోవడం లేదు?
డ్వాక్రా మహిళల జీవితాలతో చెలగాటం నిజంకాదా...
రుణమాఫీ మోసాలపై పార్టీలు కాదు.. రైతులే మాట్లాడుతున్నారు
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుగారు హడావిడిగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హడావిడి చర్చలు మొక్కుబడి ప్రకటనలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సొంత ఇంటికి హైదరాబాద్‌లో శంఖుస్థాపన చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి కూడా శంఖుస్థాపన చేస్తామని ప్రకటించారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక ఇక్కడే ఉండేందుకు కోట్లు ఖర్చుపెట్టి పేషీలు అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఉన్న ఇల్లు పడగొట్టి భారీగా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.. మరి రాజధాని శంఖుస్థాపన హంగా ఎవరి కోసం బాబూ..? సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టడానికేగదా? 30 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌పూలింగ్ ద్వారా సమీకరించేశామని బాబుగారు చెబుతూన్నా వేలమంది రైతులు ప్రభుత్వమిచ్చే చెక్కులు తీసుకోవడం లేదంటే అర్ధం ఏమిటి?  రాజధాని పేరుతో సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలు, వ్యవసాయ కార్మికుల మాటేమిటి? రుణమాఫీ అందక నానా ఇక్కట్లు పడుతున్న రైతుల గోడు వినేదెవరు? మాఫీ పేరుతో మాయలు చేస్తూ డ్వాక్రా మహిళల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? రైతు రుణమాఫీపై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు మంత్రులతో చెబుతున్నారు. రుణమాఫీపై మీ కాలర్ పట్టుకుంటున్నది రైతులే బాబూ... రైతులే మిమ్మల్ని నిలదీయబోతున్నారు. వారికి సమాధానం చెప్పండి. ప్రజలను వేధిస్తున్న సమస్యలపై చర్చించని మంత్రిమండలి సమావేశాలు ఎందుకు.... చెప్పండి... ఎవర్ని మోసం చేయడానికి..? 
 
రాజధానికి సంబంధించి ఇంతవరకు మాస్టర్ ప్లానే లేదు. ఒక ఇల్లు కట్టుకుంటున్నా... ఇంటికి సంబంధించిన ప్లాన్ ఉంటుంది. బడ్జెట్ ఉంటుంది. కానీ ప్లానే లేకుండా, బడ్జెటే లేకుండా మన ముఖ్యమంత్రిగారు రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేయబోతున్నారంటే.. ఇది మన కోసం చేస్తున్న శంఖుస్థాపన కాదు.. ఇది సింగపూర్ కంపెనీ కోసం చేస్తున్న శంఖుస్థాపన అని అర్థమౌతుంది. 
 
రాజధాని నిర్మాణానికి ఇంత హడావుడిగా శంఖుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది. పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టం చెప్పింది. దాని ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఇంటికి మొన్నే శంఖుస్థాపన చేశాడు. ఫోటోలు కూడా అన్ని పేపర్లలో వచ్చాయి. మరి సొంత ఇంటికి హైదరాబాద్‌లో శంఖుస్థాపన చేసుకున్న వారం రోజులు గడవకముందే రాజధానికి గుంటూరు-విజయవాడ మధ్య కోర్ కేపిటల్ అని వారు అంటున్న ప్రాంతంలో, ఇంతవరకు నిర్ణయించని ప్రదేశంలో శంఖుస్థాపన చేస్తున్నాడంటే... దీని భావం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు.
 
ఇంతవరకు అక్కడ దాదాపు 34 వేల ఎకరాలు సమీకరించాం అని మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ప్రకటించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కించాల్సిన అంశం అని కూడా చెప్పారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంత భూమి సమీకరించలేదని కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ నిజమైతే దాదాపు 20 నుంచి 23 వేల ఎకరాల మేరకు భూమికి గత రెండు నెలల కాలం నుంచి ఏ ఒక్క రైతు వచ్చి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చెక్కులను ఎందుకు తీసుకోవటం లేదో కూడా వారే సమాధానం చెప్పాలి. అలాగే ల్యాండ్ పూలింగ్‌కు తెలిసో తెలియకో లేక అధికార పార్టీ బెదిరింపులకో లొంగి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి తమ భూములు పూలింగ్‌కు ఇవ్వం అని పిటీషన్లు వేయటాన్ని చూసి భయపడి హడావిడిగా రాజధానికి శంఖుస్థాపన చేస్తున్నారా అనేది కూడా స్పష్టం చేయాలి. 
 
ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించని రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగిస్తామని ఏనాడో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ప్రకటించారు. అస్త్రం అనే పదం ఉపయోగించటమే అప్రజాస్వామికం. దారుణం. ఇప్పుడు మంత్రి మండలి కూడా అదే చెబుతోంది. కోర్టులో ఒకవంక ఈ అంశంమీద పిటీషన్లు ఉన్నాయి. వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే కోర్టులో గెలిచి, రైతుల మనసులు గెలిచి ఈ పని చేయాలిగానీ అధికారం అడ్డుపెట్టుకుని బల ప్రయోగం ద్వారా భూసేకరణ చేస్తాం అంటే అక్కడ నిర్మించే దాన్ని రాజధాని అంటారా? రౌడీ రాజ్యం అంటారా?
 
రైతు కూలీలు, కౌలు రైతులు, వ్యవసాయం మీద ఆధారపడ్డ ఇతర గ్రామీణ వృత్తులవారు  ఎలా బతకాలి అనే అంశం మీద ఇంత పెద్ద రాష్ట్ర కేబినెట్‌లోనే చర్చించాలన్న బుద్ధి, జ్ఞానం మంత్రులకే లేకపోతే వారంతా ఈ భూములన్నీ వదులుకుని ఎక్కడకు పోవాలి? వారు సింగపూర్ వలస పోవాలా? జపాన్ వలస పోవాలా? లేక చైనాకు వలస పోవాలా? 
 
డ్వాక్రా రుణాల మాఫీ గురించి మూల ధన వ్యయం ఇస్తామని మీరు వాగ్దానం చేశారా?
  • మీరేం వాగ్దానం చేశారు? డ్వాక్రా రుణాలను మొత్తంగా రద్దు చేస్తామని చెప్పారు.  ఇప్పుడేం అంటున్నారు? చెక్కులు ఇవ్వటమేమిటి? అసలు డ్వాక్రా ఉద్యమం ఏమైంది?
  • మొత్తంగా డ్వాక్రా మహిళలు చెల్లించాల్సిన రుణాలు దాదాపు 13 వేల కోట్లు ఎన్‌పీఏ(నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్)గా మారిపోయాయని మీరు తాజాగా విడుదల చేసిన ఎకనమిక్ సర్వేనే చెబుతుంది గదా? డ్వాక్రా సంఘాలు సగానికి సగం మూతబడిపోయాయని మీ డేటానే చెబుతుంది గదా? చివరికి మహిళల విషయంలో కూడా మాట తప్పుతారా ముఖ్యమంత్రిగారూ? పైగా మూలధన వ్యయం ఇస్తున్నాం అని ఏకంగా కేబినెట్ తీర్మానం చేస్తారా? ఇది వారి జీవితాలతో చెలగాటం ఆడటం కాదా?
  • రైతులకు మీరు రుణ మాఫీ చేస్తే వేరెవరో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారా? మీరు అధికారంలోకి వచ్చేసరికి రూ. 87 వేల కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు ఈరోజున రూ. 97 వేల కోట్లు అయ్యాయి. దీన్ని రుణ మాఫీ అంటారా? ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ఎదురుగ్గా వేల మంది రైతులు రుణ మాఫీ కాలేదంటూ క్యూలు కడతారా? అంటే రైతులు కూడా దుష్ర్పచారం చేస్తున్నారా? కొంచెం ఆలోచించండి. 
  • గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోండి. పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కొద్దీ ఉద్యోగాలు తీసుకువస్తానని చెప్పారు. మరో అడుగు ముందుకు వేసి... ఏ ఇజమూ లేదు... టూరిజం తప్ప అని ఒక డైలాగు కూడా చెప్పారు. మరి ఇప్పుడు 3.5 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తాం అంటున్నారు. గతంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? టూరిజం పేరు మీద ఇప్పుడు కూడా ప్రభుత్వ భూముల్ని, భూసేకరణ ద్వారా ప్రైవేటు భూములను మీకు కావాల్సిన వ్యక్తులకు సంతర్పణ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారని మీ ట్రాక్ రికార్డ్‌ను బట్టి భావించాల్సి ఉంటుంది. 
  • మీరేం వాగ్దానం చేశారో, ఈరోజున మీరు ఏం చేస్తున్నారో సంబంధం లేకుండా పది మంది భజన పరుల్ని, డూడూ బసవన్నల్ని పెట్టుకుని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు చేస్తే ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. మీ ఏడాది పాలనలో మీరంటూ  గర్వంగా చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క స్కీము లేదు. అయినా విజయోత్సవాలు అంటూ ప్రజల ముందుకు వెళ్ళి పరువు కాపాడుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు. ఏడాదిలోనే ఇంతగా వైఫల్యాలు చవిచూసిన ప్రభుత్వం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే మరొకటి లేదు. అందుకే మమకారంతో కాకుండా అధికారంతో ప్రజలపై అజమాయిషీ చేస్తున్నారు. 
Back to Top