అంతా మీరే చేసారు

మంచైతే తన ఖాతాలో, విఫలమైతే అధికారుల ఖాతాలో జమ చేస్తున్నారు ఎపి సిఎమ్ చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో అన్ని శాఖాధిపతులనూ ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసారు సిఎమ్ . వారి వల్లనే సంక్షేమ కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయన్నారు. రాష్ట్రంలో పడకేసిన ఆరోగ్యం, అక్కరకురాకుండా పోతున్న ప్రాధమిక విద్య, మాతా శిశు సంక్షేమం అన్నీ అధికారుల అలసత్వం వల్లే జరిగాయని ఆయనగారు తేల్చేశారు. వారినికో సమీక్ష అని, మూణ్ణాళ్లకో సమావేశం అని మీటింగులు పెట్టడం తప్ప సంక్షేమ నిధులు వదల్లేదు చంద్రబాబు. ఇప్పుడేమో అధికారులందరినీ బలి పశువులను చేశారు. 

జిల్లాల వారీగా, మండల లాల వారీగా అన్ని పనులకూ టిడిపి నేతల అనుమతులు తప్పనిసరి. వారిని కాదని ఏ ప్రాజెక్టుకు నిధుల వాడకం జరిగే వీలే లేదు. కమీషన్లు అందని చోట ఫైలు కదలదు. కాంట్రాక్టరును ఒప్పుకోవాలన్నా, ఒక్క పని చేయాలన్నా అన్నీ వారి అనుమతులతోనే జరగాలి. ప్రయోజనం లేని చోట పలుకుబడి గల నేతలు ఒక్క పనినీ జరగనీకుండా చక్రం అడ్డం వేస్తున్నారు. మరి ప్రభుత్వాన్ని నడిపే నాయకులే ఇలాంటి అడ్డదారుల్లో అడ్డుపడుతున్నప్పుడు అధికారులు మాత్రం ఏం చేయగలుగుతారు చోద్యం చూడటం తప్ప. సదావర్తి వ్యవహారంలో లోపాయకారీగా వేలం తగదని, అక్కడ భూమి విలువ కోట్ల రూపాయిలు పలుకుతోందని ప్రభుత్వానికి నివేదించినందుకు ఆ అధికారికి దక్కిన బహుమానం బదిలీ. మరి అలాంటప్పుడు ఏ అధికారి మాత్రం ప్రభుత్వానికి కింది స్థాయి నుంచి జరుగుతున్న అవినీతిని బయటపెట్టడానికి సాహశిస్తాడు. అందులోనూ స్వయంగా ముఖ్యమంత్రే అటువంటి వారిని సమర్థించుకుంటూ, స్వయంగా అవినితీలో మునిగి తేలుతున్నారాయె. 

వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్ల పనుల్లో ఆలస్యం, పథకాలు ప్రజలకు చేరడంలో జాప్యం జరుగుతోందని చంద్రబాబు మండిపడిపోతున్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి లేదా ఆయా శాఖామాత్యులు కలుగజేసుకుని సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత లేదా….అదే పార్టీ వ్యవహారాల్లో అయితే అసంతృప్తులను పిలిచి బుజ్జగించుకునే పనిని మహా తెలివిగా చేయగలరు చంద్రబాబు. వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలను దొంగిలించి, పార్టీలో పదవులు అప్పచెప్పడంతో ముందు నుంచీ ఉన్న పార్టీ నేతలు అలిగి అటకెక్కారు. వారందరినీ పిలిచి ఎన్నికలకోసం కలిసి పనిచేయాలని ఒప్పించగలిగారు చంద్రబాబు. మహిళా తాసిల్దారుపై సొంత పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు కూడా, స్వయంగా చంద్రబాబే ఆమెను పిలిపించుకుని గొడవ సద్దుమణిగేలా ఆమెను పిలిపించలేదా..? మరలాంటప్పుడు అతి ముఖ్యమైన శాఖల మధ్య సమన్వయం లేకుంటే వారిని పిలిచి సామరస్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుకు ఉండాలి కదా…? కేవలం తన స్వప్రయోజనం కోసం, పార్టీ అవసరాల కోసం తప్ప ప్రజా అవసరాలకు, అధికారులను ఆదేశించాడానికీ ఆ పద్ధతులు అవలంభించరన్నమాట. ప్రాజెక్టులు, మిషన్లు, పథకాల అమలులో ఆదినుంచి టిడిపి నేతల జోక్యం చాలా ఎక్కువగా ఉంటోంది. లబ్దిదారుల ఎంపిక నుంచి, నిధుల విడుదల వరకూ, కాంట్రాక్టర్లను నియమించడం నుంచి, పనులు అప్పగించడం వరకూ అడ్మినిస్ట్రేషన్ లో నేతల చొరబాటు, వారి మాటే చెల్లడం గత మూడేళ్లుగా జరుతూనే ఉంది. 

రౌతుకొద్దీ గుర్రం అంటారు. నాయకుడిని బట్టే అధికారులు. నిజాయితీతో నిబద్ధతతో పాలన చేసే ముఖ్యమంత్రి ని చూస్తే అధికారులు కూడా ఉత్తేజితులౌతారు. మంచి చెడులు విమర్శలు విని దానికి తగ్గ ప్రణాళికలు చేసే నాయకులకు అధికారులు అన్ని విషయాలూ నిర్భయంగా చెప్పగలుగుతారు. నియంతృత్వపు పోకడలతో అధికారులను చులకన చేస్తూ, వారిని హీనంగా చూసే చంద్రబాబు దగ్గరకు రావడానికే అధికారులు వందసార్లు ఆలోచిస్తారు. పరిపాలనాశాఖకు, శాసన శాఖకు మధ్య చెప్పలేని అగాధం సృష్టిస్తున్నది చంద్రబాబు వైఖరే. ఇన్నాళ్లుగా ఉదాసీనంగా ఉండి, వారి పనులకు అడ్డు తగిలి, సరైన నిధులను అందించకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఐఎఎస్ లకు అడ్మినిస్ట్రేషన్ తెలియదని అనడం వారి ఇన్నేళ్ల వృత్తి జీవితాన్ని అవమానించినట్టే అవుతుంది. అయినా ఏ శాఖకు ఎవరు కావాలో నిర్ణియించి, నియమించుకున్నది చంద్రబాబు కాదా…?? వారి పని తీరు మూడేళ్లుగా ఇలా ఉంటే చంద్రబాబుకు తెలియలేదా అని అనుకోనక్కర్లేదు. చంద్రబాబు నైజమే అది…పరిమళమైతే నాది కంపు అంతా నీది అనే రకం కదా…అందుకే తన వైఫల్యాలను అధికారులకు అంటగట్టి చేతులు దులుపుకున్నాడు. 

తాజా ఫోటోలు

Back to Top