అభివృద్ధా – అంతా తూచ్ తూచ్

ఎక్కేముందు ఓడ మల్లయ్య, దిగాక బోడి మల్లయ్య అన్నట్టుంటుంది చంద్రబాబు తీరు. నంద్యాల ఎన్నికల్లో 1500 కోట్ల రూపాయిల అభివృద్ధి పనులు ప్రారంభించామని ఊదరగొట్టింది టిడిపి ప్రభుత్వం. ఈ మెదలెట్టిన పనులు పూర్తి కావాలంటే నంద్యాలలో టిడిపిని గెలిపించడం తప్ప వేరే దారి లేదని ప్రజలను బెదిరించి ఒప్పించింది. ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు ఇవి కావు గనుక, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓట్లేయక పోతే ఈ అభివృద్ధి పనులు ఆగిపోతాయనే భయంతో నంద్యాల ప్రజలు టిడిపిని గెలిపించారు. ఇలా ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో అలా తన అసలు రంగు బయట పెట్టింది టిడిపి ప్రభుత్వం. 

నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ అభివృద్ధి పనుల ఆమోదానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖం చాటేసారు టిడిపి కౌన్సిలర్లు. కొందరైతే సమావేశానికి వచ్చి రిజిస్టర్ లో రాసిన సంతకాన్ని కొట్టేసి మరీ బయటకు వెళ్లిపోయారు. ఈ నాటకం ఎందుకోసం అంటే పై నించి వచ్చిన కొన్ని ఆదేశాలే అందుకు కారణం అని తెలియవచ్చింది. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఎన్నికలు గెలిచాం కనుక, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులకు నిధులు అందించడం కష్టమని, కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి కౌన్సిలర్లకు సూచనలు అందాయి. కౌన్సిల్ లో అభివృద్ధి పనులకు ఆమోదం జరిగితే, నిధుల కోసం వత్తిడి పెరుగుతుంది కనుక వీలైనంత వరకూ ఈ విషయాన్ని వాయిదా వేస్తూ రావాలంటూ కౌన్సిలర్లకు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అందుగురించే టిడిపి కౌన్సిలర్లు సమావేశం నుంచి అర్థంతరంగా బైటకు వెళ్లిపోయారు. సమావేశంలో నిర్ణయాల ఆమోదానికి తగినంత మంది సభ్యులు ఉండకపోతే ఆ సమావేశాన్ని రద్దు చేయాలి. ఆ విధంగా పనులను జాప్యం చేస్తూ వెళ్లొచ్చన్నది పెద్దల ఊహ. 

నంద్యాల రూపు రేఖలే మారుస్తామంటూ రోడ్ల కోసం ఇళ్లు, షాపులను కూల గొట్టించిన ప్రభుత్వం ఇప్పుడు వారికి పరిహారాన్ని అందించకుండా, చేపట్టిన పనులు జరక్కుండా మోకాలడ్డం పెట్టడం చూసి ఇప్పుడు నంద్యాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ‘’ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం…చంద్రబాబు ప్రభుత్వం తీరు ఏరు దాటి తెప్ప తెగలేయడమే కదా’’ అంటూ చంద్రబాబు బుద్ధి తెలిసిన కొందరు రాజకీయ కురువృద్ధులు అభిప్రాయపడ్డారు. అందినకాడికి అధికారాన్ని చెలాయించడం, అవసరానికి అన్ని వర్గాలనీ వాడుకోవడం, ఆనక వారిని కూరలో కరివేపాకులా తీసి అవతల పారేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లని, పదవిని ఇచ్చిన మామను అలాగే ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి, ఆయనకు పార్టీనీ, చివరకు కుటుంబాన్ని కూడా దూరం చేసిన మోసగాడు చంద్రబాబు అని ఈ సందర్భంలో మరికొందరు వాఖ్యానించారు.  

Back to Top