భ్రమరావతి

*నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు ఏడాది 
*వరదలకు కొట్టుకుపోయిన పుట్టమన్ను, పవిత్ర జలాలు
*కొండెక్కిన ఆఖండ దీపం..పూర్తి కాని ప్లాట్ల పంపిణీ
*ఆన్‌లైన్‌లో ఇటుకలు అమ్మిన డబ్బులు మాయం
*తాత్కాలిక సచివాలయం పేరుతో పచ్చ నేతల దోపిడీ
*మూన్నాళ్లకే కుంగిన భవనాలు
*మూడోసారి అరుణ్‌జైట్లీతో శంకుస్థాపనకు ఏపీ సర్కార్‌ ప్రయత్నం

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తోంది. అంతర్జాతీయ రాజధాని పేరుతో అమరావతికి భూమి పూజ చేసి ఏడాది పూర్తయింది. ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంతవరకు అక్కడ తట్ట మట్టి తవ్విపోయలేదు. నాలుగు ఇటుకలు పేర్చి ఓ గోడ కట్టలేదు. చివరకు కంకర రోడ్డు కూడా కానరావడం లేదు. భవనాలకు శాశ్వత డిజైన్లు లేకపోవడం విడ్డూరం. సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కనీవిని ఎరుగని రీతిలో విద్యుద్దీపాలు, టపాసుల మధ్య వేడుకలు నిర్వహించింది. ఈ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ, సింగపూర్‌ నుంచి ఆ దేశ మంత్రులు, మన దేశానికి చెందిన కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయ పాలెంలో శంకుస్థాపన చేశారు. అక్కడ వెలిగించిన అఖండ దీపం కొద్ది రోజులకే కొండెక్కింది. అమరావతి శంకుస్థాపనకు మన మట్టి–మన నీరు కార్యక్రమానికి తన వంతుగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లోని పుట్టమట్టి, యమునా నది నీటిని తీసుకొనివచ్చి సీఎం చంద్రబాబుకు అందజేశారు.

పవిత్ర మట్టి ఏమైంది?
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది పూర్తయినా.. ఒక్కడుగు ముందుకు పడలేదు. సీఎం మన నీరు మన మట్టి పేరుతో తిరుమల ఏడు కొండల నుంచి, మహాత్ములు పుట్టిన ప్రాంతాల నుంచి పుట్టమన్ను, 33 నదుల నుంచి పుణ్య జలాలు సేకరించారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఢిల్లీ పార్లమెంట్‌ నుంచి పుట్ట మన్ను , యమునా నది నుంచి నీరు తెచ్చారు. అయితే సర్కార్‌ ఆ పవిత్రమట్టిని, నీళ్లను నిర్లక్ష్యం చేయడంతో అవి వరదల్లో కొట్టుకు పోయాయి. రాజధానికి ‘అన్నీ చేస్తాం.. మాదీ పూచీ.. మమ్మల్ని నమ్మండి అని రాజధాని ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలయ్యాయి. 

కేంద్రం ఇచ్చింది రూ.1500 కోట్లే
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోవడంతో నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. విభజన సమయంలో ఏపీకి కేంద్రం నుంచి అనేక హామీలు వచ్చాయి. రాజధానిలో నిర్మించే రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, ఉభయసభలు, మంత్రులు, అధికారులు తదితరుల నివాస సముదాయాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ఆర్థికసాయం కేంద్రం చేయాలి. మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2500 కోట్లు( విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి ఇచ్చిన రూ.1000 కోట్లు మినహాయించాలి). అంటే రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లే. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు అవుతుంది.

ఇదేనా మీ అనుభవం బాబూ..!
తాను తొమ్మిదేళ్ల పాటు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన అనుభవం ఉందని,  ఒంటి చేత్తో ప్రపంచ స్థాయి రాజధాని కడతానని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికారు. సింగపూర్‌ నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు తీసుకువస్తా అన్నారు. నరేంద్రమోదీతో కలిసి దేశంలోనే అత్యున్నతమైన  రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ముందు చూపు, నిధులు సేకరించగలిగే సత్తా, బాధ్యతాయుతంగా పనిచేయగలిగిన నాయకత్వం, అంతర్జాతీయ పలుకుబడి, పరిచయాలు ఉన్నాయని చెప్పిన పెద్దమనిషి మిత్రపక్షమైన కేంద్రం నుంచి కొత్త రాజధానికి అవసరమైన నిధులు తీసుకురావడంతో బాబు విఫలమయ్యారు. ఇప్పుడేమో జనం అంతా ఇటుకలు ఇస్తే రాజధాని కడుతానని, తిరుపతి, ఇతర నగరాలు, సెక్రటేరియోట్‌లో హుండి పెట్టారు. ప్రజలంతా త్యాగాలు చేయాలన్నారు. విద్యార్థులు విరాళాలు ఇవ్వాలని జీవోలు జారీ చేశారు. సేకరించిన ఇటుకలు ఆన్‌లైన్‌ అమ్మేసి..ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.

కోట్లాది రూపాయలతో తాత్కాలిక సచివాలయం
వెలగపూడిలో ఆంధ్ర ప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీ సర్కార్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపింది. సీఎం చంద్రబాబుకు న^è ్చకపోవడం, వాస్తు సరిగా లేదంటూ నిర్మించిన భవనాలను కూల్చివేశారు. మళ్లీ వాటి నిర్మాణాలకు అంచనాలు పెంచి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. సచివాలయంలోని 4,5వ బ్లాక్‌ల్లోనూ ఇలాగే కొన్ని నిర్మాణాలు కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించారు. నాసిరక నిర్మాణాలతో పనులు జరిగే సమయంలోనే భవనాలు కుంగిపోయాయి. 
 
వెలగపూడిలో వెతలు
తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి కాకముందే ప్రభుత్వం ఉద్యోగులను అక్కడికి తరలించారు. దీంతో మౌలిక సదుపాయాలు లేక ఉద్యోగులంతా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ నిర్మాణం పొలాలకు ఆనుకొని ఉండటంతో.. కార్యాయాల్లోకి వస్తున్న పురుగులతో తంటాలు పడుతున్నారు. కార్యాలయంలో ల్యాండ్‌ ఫోన్లు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. టాయ్‌లెట్లు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

పొలాలు తీసుకున్నారు..ప్లాట్లేవీ?
అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంది. అప్పట్లో భూములిచ్చిన రైతులందరికీ రాజధాని ప్రాంతంలో 2016 మార్చి నాటికి రైతులకు ప్లాట్లను ఇచ్చేస్తామన్నారు. రాజధాని గ్రామాల్లో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. దీనికి అవసరమైన స్థలాన్ని రాజధాని ప్లానులో ఎక్కడా చూపించలేదు. రాజధాని ప్రకటన వచ్చిన సమయంలో అన్ని గ్రామాల్లోనూ ఇళ్లులేని కుటుంబాలు 6,426 ఉండగా ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదు. వీటితోపాటు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అన్ని గ్రామాల్లోనూ భూ కేటాయింపులు జరుపుతామని హామీనిచ్చారు. ప్లాట్ల పంపిణీ నేటికీ అరకొరగానే సాగుతోంది. 

హామీలు తూచ్‌
రాజధాని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, అన్ని గ్రామాలనూ స్మార్ట్‌ విలేజ్‌లుగా మార్చి కనీస సదుపాయాలు కల్పిస్తామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శంకుస్థాపన సభలో హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయినా ఇంత వరకు ఒక్క హామీ నెరవేరలేదు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామన్నారు.   

ఉపాధి హూష్‌కాకి
రాజధాని ప్రాంతంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. రాజధాని గ్రామాల పరిధిలోని 6,575 మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగానే ఉన్నారు. జీఓ 125 ప్రకారం రాజధాని గ్రామాల్లో ప్రజలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంది. ఉపాధి పేరుతో శిక్షణ సంస్థకు ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున రాయితీలు కల్పించారు. కానీ ఉపాధి లేకపోగా ఉన్న పనులూ పోయి యువత నిరుద్యోగులుగా మిగిలారు. మహిళలకు అల్లికలు, కుట్టు పనుల్లో శిక్షణ ఇస్తామని, అందరికీ ఉపాధి హామీ పనులిస్తామని చెప్పారు. పనిదినాలూ లేవు. కుట్టుపనులూ లేవు. 

కూలీలకు కష్టకాలం
రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా మారింది.  ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని చెప్పిన్పటికీ 15,471 మందికి మాత్రమే ఉపాధి కార్డులు ఇచ్చారు.  వాటిల్లోనూ మూడు నాలుగు నెలల వరకూ కూలీలు ఇవ్వకపోవడంతో కూలీలు పనులకు వెళ్లడం మానేశారు. రాజధానిలో 53,373 మంది వ్యవసాయ కార్మికులుండగా 19,055 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేశారు. శాఖమూరు గ్రామంలో మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వార్డుల్లో పెన్షన్లు ఇవ్వడం లేదు. మహిళలకు ఉపాధి లేకపోవడంతో డ్వాక్రా రుణాలు చెల్లించలేక పోతున్నారు. 

అధ్వాన్నంగా రహదారులు
రాజధాని ప్రాంతంలో రహదారులు అధ్వాన్నంగా మారాయి. వేలాది వాహనాలు గ్రామాల్లో తిరుగుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం రోడ్డు నడవడానికి వీల్లేని విధంగా తయారైంది. విజయవాడ–వెలగపూడికి రోడ్డు మినహా మిగిలిన రోడ్లన్నీ దెబ్బతిన్నాయి.  

ఇంకెన్నాళ్లో..
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లయ్యింది. ఇంతవరకు రాజధాని నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇకపై పడుతుందన్న నమ్మకం లేదు. ఇక మిగిలింది రెండున్నరేళ్లే.  రాజధాని నిర్మాణం పేరుతో సేకరించిన నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సింగపూర్, దుబాయి, జపాన్‌ వంటి దేశాలకు బాబు అండ్‌ కో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. ఇక రాజధాని నిర్మాణం చేపట్టడం అసాధ్యమని తేలిపోయింది. అమరావతి నిర్మిస్తామని ఇన్నాళ్లు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ..భ్రమలు కల్పించారు. మరోసారి రాజధాని పనుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో శంకుస్థాపనలకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. కాగా వేల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్‌ వన్‌ చేసిన చంద్రబాబుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 
 
Back to Top