పేక మేడలు – గాలి మాటలు

ఎపి సిఎమ్ చంద్రబాబు ఆర్భాటంగా తలపెట్టిన పేదల ఇళ్లు పథకం అంతా అవినీతి మయం అని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి మొదలుకుని, పేదల గృహ సముదాయాలకు అయ్యే ఖర్చు గురించి ప్రభుత్వం చెబుతున్న కాకి లెక్కల వరకూ అన్నింటిలోని మతలబులనూ వైయస్సార్ సిపి అధ్యక్షుడు ప్రజల ముందు ఎండగడుతూనే ఉన్నారు. నవ్వి పోదురుగాక నేకేటి సిగ్గు అన్న చందంగా చంద్రబాబు మాత్రం తానెంచుకున్న అవినీతి రహదారిలో రయ్ మని దూసుకుపోతున్నారు. 
గత మూడేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లు 40వేలు. అందులో ఇంత వరకూ పూర్తి చేసినవి 10వేలు కూడా లేవు. అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలంలో 1.5లక్షలతో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తాం, గుడెసెలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం అని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలన్నీ కలబొల్లి కబుర్లే అని ఆన్ లైన్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. 2016 ఏప్రిల్ 14న ప్రారంభం అయిన పక్కా ఇళ్ల నిర్మాణం మొత్తం మూడేళ్లకు నత్తనడక సాగుతూ 40వేలకు పైగా మంజూరు అయిన ఇండ్లలో పావు శాతం కూడా పూర్తి కాలేదు. స్మార్ట్ పల్స్ సర్వే పేరిట చేసిన సర్వే ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేసామని చెబుతన్న ప్రభుత్వం రానున్న రోజల్లో 4లక్షల ఇళ్లు కట్టిస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. ఇంత వరకూ మంజూరైన ఇళ్లకే అతీ గతి లేకుండా ఉంది. 

ఈ కథ ఇలా ఉంటే నూతన సాంకేతిక గృహాల పేరుతో సర్కార్ మరో కొత్త డ్రామాకు తెరలేపింది. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు కంపెనీలు నిర్మించే ఈ ఇళ్లకు షియర్ వాల్ టెక్నాలజీ వాడుతామని చంద్రబాబు ప్రకటించారు. వివిధ దేశాలకు చెందిన రీతుల్ని పరిశీలించి ఈ పద్ధతిని ఎంపిక చేసామని చెబుతున్నారు. షియర్ వాల్ టెక్నాలజీ లో ఇళ్లకు అల్యూమినియం  సెంట్రింగ్ ఏర్పాటు చేస్తారు. దీనికి ఇరువైపులా కాంక్రీట్ తో వేసి గోడలు తయారు చేస్తారు. శ్లాబ్ లో కూడా ఇదే విధానం అవలంభిస్తారు. అయితే విధానం పదికి పైగా అంతస్తులు నిర్మించే పెద్ద పెద్ద భవన సముదాయాలకే కాని, రెండు, మూడు అంతస్తుల భవనాలకు కాదని తెలుస్తోంది. ఒక వేళ ఇదే విధానం అనుసరించినా చదరపు అడుగుకు 900రూ. ఖర్చు అవుతాయని, ప్రభుత్వం మాత్రం ఇందుకు 2200రూ. ఖర్చు అవుతుందని చెబుతోందని ప్రతిపక్షం అంటోంది. ఇది పేదల ఇళ్ల పేరు చెప్పి ప్రభుత్వ పెద్దలు దోచుకోవడం కాదా అని మునుపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ తెలియదని అనుకోవడం చంద్రబాబు వెర్రితనం అవుతుందని, నిజాలు చెప్పేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని వైయస్సార్ సిపి అధ్యక్షుడు వైయస్ జగన్ నిరూపించారు. 

అసలు ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారు ఎందరున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఎంత మందికి ఇళ్లు కట్టించి ఇస్తారు అనే దానిమీద చంద్రబాబుకే స్పష్టత లేదు. ఏ ఊరికి వెళ్లినా, పట్టణానికి వెళ్లినా ఆ సభలో లక్షల ఇళ్లు  మంజూరు చేస్తున్నామంటూ ఒక ప్రకటన ఇచ్చేసి వస్తారు. రెండేళ్లలో 10లక్షల ఎన్టీఆర్ ఇళ్లు కట్టిస్తాం అని తిరుపతిలో చెప్పారు బాబు. అలాగే రెండు విడతల్లో 4.50 లక్షల ఇళ్లు కడతామని మరో చోట ప్రకటించారు. రూరల్ హౌసింగ్ పథకం కింద నియోజక వర్గానికి 1,250ఇళ్లు కట్టిస్తామని ఒక చోట చెప్పారు. ఇలా పొంతన లేని లెక్కలతో గాల్లో ఇళ్లు కట్టే చంద్రబాబు, ప్రస్తుతం అర్బన్ హౌసింగ్ కోసం అయ్యే ఖర్చులను ఆకాశానికెత్తి చెబుతున్నారు. ఇప్పుడూ డెడ్ లైన్లు విధించి తర్వాత వాటి సంగతి మరచిపోవడం బాబు అలవాటు. కొన్నాళ్లు గడిచాక ఖర్చులు పెరిగాయని చెప్పడం రివాజు. మరి ఈ పట్టణ పేదల హౌసింగ్ నిర్మాణాలు ఎన్నాళ్లకి పూర్తి కానున్నాయో…ఈ లోపు ఎన్ని కోట్లు అవినీతి ఖాతాల్లో జమ కానున్నాయో….లెక్కలు తేలాల్సి ఉంది. 


Back to Top