శకుని పాచిక మళ్లీ పారింది

నంద్యాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చాలామంది టిడిపి సీనియర్లు అనుకున్నట్టుగానే చంద్రబాబు తన కనికట్టుతో, మాయా పాచికలతో ప్రజలను మభ్యపెట్టగలిగారు. ఓటర్లను ప్రలోభంలో ముంచెత్తగలిగారు. ఎలక్షన్ ముందు రోజు అర్థరాత్రి కూడా విచ్చలవిడిగా వెదజల్లిన డబ్బు, ఏరులై పారించిన మద్యం తన ప్రభావాన్ని చూపింది. అధికార పార్టీలో ఉండి తన శక్తి యుక్తులన్నీ, ఇంకా చెప్పాలంటే కేబినెట్ మొత్తాన్ని ఏకీకృతం చేసి పోరాడితే గాని చంద్రబాబు వైయస్సార్ సిపి ని గెలువలేక పోయాడని విశ్లేషకులంటున్నారు. ఒక్క కాన్ట్సెన్సీ గెలుపు కోసం అనధికారికంగా 500కోట్ల రూపాయలను, ఇంకా తన ఎమ్మెల్యేలు, మంత్రి వర్గం అంతటినీ కేటాయించడంతో బాబుకు ఓటమి భయం ఎంతుందో తెలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. 

వేలాది కోట్ల రూపాయలను నంద్యాల అభివృద్ధికోసం కేటాయిస్తున్నామంటూ ఉప ఎన్నికల ముందు టిడిపి చేసుకున్న ప్రచారం ఈ ఎన్నికల ఫలితాలకు మరోకారణం కావచ్చన్నది నిపుణుల వాదన. గత మూడేళ్లుగా లేనిది ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత చంద్రబాబు కేవలం ఓట్లు రాబట్టుకునేందుకు, ప్రజలను నమ్మించేందుకు మాత్రమే ఈ వేల కోట్ల నిధుల నాటకం ఆడారు అన్నది వారి విశ్లేషణ. బాబు స్టేటజీ ఫలించి, ప్రజలు నంద్యాల అభివృద్ధి అనే బాబు మాటను మరోసారి నమ్మడానికి సిద్ధపడ్డారు. కాని అది మునపటిలాగా ఓటు కోసం కట్టిన నీటి మూటలా కాకుండా, ఆ హామీలను నెరవేర్చి టిడిపి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే ఈ కథ ఉప ఎన్నికల ఫలితంతో ముగిసిపోయేది కాదు. అతి త్వరలో రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ నమ్మకాన్ని నిలబెట్టుకోని వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతారు. 

నంద్యాల ఎన్నికల్లో టిడిపి గెలుపుకు మరో కారణం అడుగడుగునా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు. సాక్షాత్ ముఖ్యమంత్రే నంద్యాల ప్రజలను అభివృద్ధి కావాలంటే ఓటేయండి లేదంటే నే వేసిన రోడ్ల మీద నడవద్దు, నేనిచ్చే ఫించన్లు తీసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత సర్వేల పేరుతో గూండాలు, ప్రచార సమయంలో నాయకులు సైతం ఓటు వేయని వారి వివరాలు మాకు తెలుస్తాయని, వారికి పథకాలను వర్తింప చేయమని హెచ్చరికలు జారీ చేసారు. ఓటు వేయకుంటే ఎలాంటి అభివృద్ధి జరగదనే విషయాన్ని కీలకంగా టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రచారం చేయడంతో ప్రజలు దాన్నినిజమని నమ్మారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించి, వ్యతిరేకంగా ఓటు వేస్తే రేపు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయంతో వారు ఓట్లు వేసినట్టుగా సమాచారం. 
నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు తారుమారు కావడానికి మరో కారణం ప్రలోభాలు. అధికార పార్టీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ఓటర్ల లిస్టును ప్రచారంలో తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాలను వేలు, లక్షల రూపాయిలిచ్చి ఓటు మాకే వేయాలంటూ ఒట్లు వేయించుకుంది. ఈ పద్ధతిలోనే ఎంతో మందిని సెంట్ మెంట్ తో వంచించింది. 

మరణించిన భూమా దంపతుల పేరుతో వారి కుటుంబసభ్యులను గెలిపించాలని ప్రచారం చేసింది టిడిపి. అది తప్పు కాకపోవచ్చు కాని, నిజానికి భూమా నాగిరెడ్డి వైయస్సార్ సిపిలో ఉండి నంద్యాల సీటును గెలుచుకున్నారు. ఆ తరువాత పార్టీకి అన్యాయం చేసి, టిడిపిలో కి ఫిరాయింపు జరిపారు. ఆ సమయంలోనే పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనను పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి టిడిపి కండువాతో ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. కాని అలాంటిదేం జరగకుండానే హఠాత్తుగా ఆయన మరణించారు. లెక్కప్రకారం నంద్యాలలోని ఆ సీటు వైయస్సార్ సిపి పార్టీకి ఏకగ్రీవంగా ఇవ్వాల్సి ఉంది. కాని టిడిపి ఆ పని చేయలేదు.  ఏదేమైనా టిడిపి ఎప్పుడూ ఉపయోగించే మోసపూరిత హామీల అస్త్రంతో నంద్యాలలో గట్టెక్కిందనే చెప్పాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, అధికార పార్టీ అన్యాయాలను ఎలుగెత్తి చాటుతూ హుందాగా ప్రవర్తించారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్. అధికారంలో ఉన్న పార్టీకి మరో అవకాశం ఇచ్చి చూడాలన్న ప్రజల నమ్మకాన్ని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తారు. అయితే ఇదే అలుసుగా భావించి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Back to Top