ప‌చ్చ పండ‌గ ..ప్ర‌జాధ‌నం దండ‌గ


- ఏం సాధించార‌ని పండుగ‌లు
- ప్ర‌తి ఏటా న‌వ నిర్మాణ దీక్ష‌ల‌తో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం
- బాబు పుట్టిన రోజు నాడు ధ‌ర్మ పోరాట దీక్ష‌లు
-  ప్ర‌భుత్వ నిధుల‌తో 1500 రోజుల ప్రగతి వేడుక‌లు
 
అమ‌రావ‌తి:  కట్టుబట్టలతో నెత్తిన అప్పులతో.. కొత్త రాష్ట్రం పయనం ప్రారంభించాం.  రూ.16 వేల కోట్ల పైచిలుకు లోటు బడ్జెట్‌తో .. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టమనుకునే ఆర్థిక పరిస్థితితో నడక ప్రారంభించాం. ఇది చంద్ర‌బాబు గ‌త నాలుగున్న‌రేళ్లుగా ఏ మీటింగ్ వెళ్లినా చెప్పే క‌ట్టు క‌థ‌లు. మ‌రో వైపు దేశం కంటే అధిక జీడీపీ సాధించామ‌ని గొప్ప‌లు చెబుతుంటారు. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి కాపురం చేసిన చంద్ర‌బాబు..విభ‌జ‌న చ‌ట్టంలోని ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేదు. పైగా ఇప్పుడు ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కేంద్రం ఏమీ చేయ‌లేద‌ని ముస‌లి క‌న్నీరు కార్చుతున్నారు. త‌న త‌ప్పేమీ లేద‌ని త‌ప్పించుకునేందుకు క‌ట్టు క‌థ‌లు చెబుతున్నారు. 

నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ గుర్తుకు రాలేదు. మ‌రో ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని హ‌డావుడిగా మేల్కొని తాను విఫ‌రీతంగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే 26 సార్లు విదేశీ యాత్ర‌లు చేసిన పెద్ద మ‌నిషి ఇంత‌వ‌ర‌కు ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌లేదు. అంతే కాకుండా ప్ర‌తి ఏడాది న‌వ నిర్మాణ దీక్ష‌లు, జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాలు అంటూ ప్ర‌జాధ‌నంతో పార్టీ ప్ర‌చారం చేయించుకున్నారు. ఇంత చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని రాష్ట్రం కోసం పోరాడుతున్న‌ట్లు చూపేందుకు త‌న పుట్టిన రోజు నాడు ఏప్రిల్ 20న ధ‌ర్మ పోరాట దీక్ష అంటూ ఓ బాబా మాదిరిగా అవ‌తారం ఎత్తి ఆర్టీసీ బ‌స్సుల్లో డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను కూలికి పిలిపించుకొని ప్ర‌చారం చేయించుకున్నారు. అప్పుడ‌ప్పుడు ఆయా ప‌ట్ట‌ణాల్లో దీక్ష‌ల పేరుతో టీడీపీ నాయ‌కులు హ‌డావుడి చేయ‌డం త‌ప్ప సాధించింది ఏమీ లేదు. 

ఇక్క‌డేమో మోడీని తిడుతారు. ఢిల్లీకి వెళ్లి అదే మోడీ ముందు వంగి వంగి వంగి దండాలు పెడ‌తారు. బీజేపీని తిడుతూనే ఆ పార్టీ మ‌హారాష్ట్ర మంత్రి భార్య‌కు టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యురాలిగా నియ‌మిస్తారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లుగా తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి 1500 రోజులు ముగిసిందంటూ పండుగ‌లు చేస్తున్నారు. 

ఈ ఏడాది జూన్ నెలలోనే  చంద్రబాబునాయుడు పునరంకిత దీక్షలు..సభల పేరుతో కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు. మళ్ళీ దీని కోసం పత్రికలు, టీవీల ప్రకటనలపై పెట్టిన ఖర్చు కూడా కోట్లలోనే. ఎవరైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలి వంద రోజులు…ఏడాది పూర్తయిన తర్వాత వార్షికోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. ఇది ఏ పార్టీ ఉన్నా చేస్తూనే ఉంటుంది. గత నెలలోనే తెలుగుదేశం సర్కారు  నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. అందుకే పునరంకిత సభలు..కార్యక్రమాలు అంటూ ప్రజాధనంతో వారం రోజుల పాటు హంగామా చేసింది. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను విస్మరించి…జూన్ 2 నుంచి 8 వరకూ ఇలా కార్యక్రమాలు చేయటం ఏమిటి అనే విమర్శలు ఉన్నా…చంద్రబాబు వాటినేమి పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ ఇఫ్పుడు కొత్తగా ‘1500 రోజుల ప్రగతి’ పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి పండగ చేసుకుంటున్నారు. జూన్ లోనే వారం రోజుల పాటు ఈ నాలుగేళ్లలో తానేమి చేసింది చంద్రబాబు ప్రజలకు వారం రోజుల పాటు ‘చెవుల్లో తుప్పు వదిలేలా’ విన్పించేశారు. ఇది జరిగిన 40 రోజుల్లోనే కొత్తగా చెప్పటానికి చంద్రబాబు సాధించింది ఏమిటి?. అంటే ఏమీ లేదు.
Back to Top