అధికార పక్షానికి సవాల్

ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూని చేస్తున్న చంద్రబాబు ప్రజల ఎంపికను అపహాస్యం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న ఈ అప్రజాస్వామ్యకమైన విధానాలకు వ్యతిరేకంగా వైయస్సార్ సిపి తన గళాన్ని వినిపిస్తోంది. విలువలే ఊపిరిగా సాగుతున్న పార్టీ అధికారపక్షం చేస్తున్న ఈ అన్యాయాలను సహించబోమని తెలియజేస్తోంది. వైయస్సార్ సిపి పార్టీలో నుండి గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు శాసనసభా నియమాలనే నిలువునా కాల్చేసారని అభిప్రాయ పడ్డారు విపక్ష నేత వైయస్ జగన్. ఇలాంటి అమానుష చర్యలను ఖండించేందుకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఎప్పుడైతే ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటిస్తారో అప్పుడే అసెంబ్లీకి వస్తామని స్పష్టం చేశారు. 

అప్రజాస్వామికంగా 20మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకోవడం ఒక తప్పైతే, ఏళ్లు గడుస్తున్నా వారిపై అనర్హత వేటు వేయకపోవడం రెండో తప్పు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు, తన చర్యలతో  ఫిరాయింపులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇది విలువల వలువలు విడిచిపెట్టడమే. ప్రజలు ఒక పార్టీ తరఫున ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు తన పదవికి రాజీనామా చేయాలి. చేరిన పార్టీ గుర్తుపై పోటీ చేయాలి. కానీ ఇవేం చేయకుండానే టిడిపిలోకి చేరిపోయి, పదువులు అనుభవిస్తూ ప్రజల నమ్మకానికి తూట్లు పొడిచారు కొందరు అవకాశ వాదులు. ఇలాంటి వారిని కొనుగోళ్లు చేసి  చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి విషపూరిత రాజకీయ వాతావరణాన్ని నిరసిస్తోంది వైయస్సార్ సిపి. ప్రజల కోసం పోరాడుతూ, నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వైయస్ జగన్ ఈ ప్రజావ్యతిరేక అధికారపార్టీ అహంకారాన్ని ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐదేళ్లలో 16సెషన్స్ లో 156రోజులు శాశనసభా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు నాలుగేళ్లలో 80రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో ప్రజా సమస్యల గురించి ప్రతిపక్ష నేత ప్రశ్నించిన ప్రతి సారీ ఆయన మైక్ కట్ చేయడం, టిడిపి నాయకులతో రెచ్చగొట్టే వాఖ్యలు చేయించడం లాంటి మర్యాదలేని పనులు చేసింది టిడిపి. స్పీకర్ సైతం విపక్షాల వాదనకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరం. నైతిక విలువలు పాటించకుండా, సభా మర్యాదను బేఖాతరు చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజలను అవహేళన చేస్తున్న అధికార పక్షానికి సవాల్ గా అసెంబ్లీని బహిష్కరిస్తోంది వైయస్సార్ సిపి. ఒకప్పుడు ఎన్టీఆర్, తమిళనాట జయలలిత కూడా అసెంబ్లీని బహిష్కరించారు. అప్రజాస్వామిక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటున్న వైయస్సార్ సిపికి ప్రజల అండదండలెప్పుడూ ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Back to Top