ఛీఈవో.. ఛీపు చేష్టలు

చంద్రబాబును ఏపీ సీఈఓ అని ఎవరన్నారో.. ఏ ముహూర్తాన అన్నారో గానీ ఆ పేరును కాపాడుకోడానికి ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. పేరు కోసం తహతహలాడే ముఖ్యమంత్రి జనం చూస్తున్నారన్న విచక్షణ కూడా మరిచి కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ టీవీలు, పేపర్లలో కనబడాలనే తపన తప్ప మరో ఏం చేయబోతున్నామో అనే సోయ ఉండదు.


తాను చెప్పాలనుకున్న రామాయణం చెప్పుకుపోతాడు.. ఆయన్నెవరూ ఎదురు ప్రశ్నించకూడదు. ఎవరైనా ప్రశ్నలడిగితే నీదే పేపర్‌ అని విరుచుకుపడిపోతాడు. మొన్నటికి మొన్న దావోస్‌ వెళ్లొచ్చాడు. ఏం సాధించాడో ఎవరికీ తెలియదు. ఎంట్రీపాస్‌లు పెట్టి మరీ వెళ్లి మీడియాకు నాలుగు ఫొటోలు రిలీజ్‌ చేశాడు. తీరా అక్కడి వ్యవహారం చూస్తే కొత్తిమీర పచ్చడి, బెండకాయ వేపుడు, చేపల పులుసు.. ఇందుకా ఏడు కోట్లు ఖర్చు చేసింది. దీనిపై ప్రశ్నించిన ప్రజాశక్తి విలేకరిపై తిట్ల దండకం అందుకున్నాడు. తాను మాట్లాడిన మాటలు దేశం మొత్తం చూస్తుందన్న ఇంగితం కూడా లేదు. ఆయన వాలకం చూస్తుంటే మొగుడు తిట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకని.. వైయస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వారికి సమాధానం చెప్పుకోలేక పత్రికా విలేకరులపై విరుచుకుపడిపోవడం నిజంగా బాబు అసహనానికి నిదర్వనం.

పని కంటే ప్రచారం మీదనే ఫోకస్‌ 
చంద్రబాబు నాయుడు పనిని కాదు ప్రచారాన్ని నమ్ముతారు. అందుకే మీడియా మీద ఆయన ఫోకస్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆయన మీద మీడియా ఫోకస్‌ పెడితే.. ఏమాత్రం సహించలేరు. ఆయన ప్రెస్‌మీట్‌లు ప్రవచనాల్లా సాగిపోతాయే తప్ప.. అనుబంధ ప్రశ్నలు గట్రా ఏమీ ఉండవు. పొరబాటున ఎవరైనా మధ్యలో ఏదైనా ప్రశ్నలడిగితే.. చంద్రబాబు జవాబు చెప్పడానికి బదులుగా.. ‘నీది ఏ పేపరు’ అంటూ విరుచుకుపడిపోతారు! మీడియాను బెదిరించడమే తన తాజా స్టయిల్‌గా చంద్రబాబు రోజులు నెట్టుకొస్తున్నారనే చర్చ అమరావతి పాత్రికేయ ప్రపంచంలో జోరుగా సాగుతోంది.

ప్రత్యేక హోదా మాటంటేనే ఆయనకు గిట్టదు
చంద్రబాబు ప్రెస్‌మీట్‌ సాగుతూ ఉండగా.. ప్యాకేజీ అనే పదానికి ఆయన భజన చేస్తున్న సమయంలో ఎవరైనా ప్రత్యేక హోదా అనే పదం ఉచ్ఛరిస్తే చాలు.. చంద్రబాబులో అసహనం నషాళానికి అంటుతుంది. అంతే విరుచుకుపడిపోతారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఆయన అసహనం కేవలం ఒక్క సాక్షి మీద మాత్రమే ఉండేది. సాక్షి విలేకర్లను శత్రువుల్లాగా చూస్తుండేవాళ్లు. ఇప్పుడు పత్రికలు టీవీ ఛానళ్లు రిపోర్టర్లలో ఎవరు ప్రశ్నించినా సరే.. వారితో గొడవ పెట్టుకుంటున్నట్లుగా మాట్లాడడం, బెదిరిస్తున్నట్లుగా గుడ్లురుముతూ వేలు చూపించి హెచ్చరించడం చంద్రబాబుకు అలవాటుగా అయిపోయింది. ఒకానొక టైమ్‌లో ఆయన సాక్షి టీవీని, పేపర్‌ను చూడొద్దని అసహనం ప్రదర్శించాడంటేనే తెలుస్తుంది సాక్షికి బాబు ఎంత భయపడిపోతున్నాడోనని. మొన్నటికి మొన్న విశాఖలో సీఐఐ సదస్సు ముగిసిన తర్వాత లక్షల కోట్ల ఒప్పందాల గురించి వెల్లడిస్తున్న సమయంలో.. ‘గత ఏడాది ఒప్పందాల్లో ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి సార్‌’ అంటూ ఓ రిపోర్టర్‌ అడగడమూ... చంద్రబాబు వెంటనే రెచ్చిపోయి.. నీది ఏ పత్రిక అంటూ.. వామపక్షాలు నడిపే మీడియా సంస్థ ప్రతినిధి అని తెలియగానే.. మీకు పార్టీ ఆఫీసుల్లో ప్రశ్నలిచ్చి పంపిస్తారు. మీరు అసలు ప్రెస్‌ మీట్‌కు వచ్చే అర్హతే లేదు. మీకు అసలు ఏమైనా తెలుసా... ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా రాస్తున్నాయో చూసి తెలుసుకోండి... ఆ రెండు పత్రికలకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లుగా సెలవిచ్చేశారు. ఇంతకంటె చేదు అనుభవం అమరావతిలో ఓ ఛానెల్‌ రిపోర్టర్‌ కూ ఎదురైంది. మధ్యలో ప్రశ్నించినందుకు ‘నిన్ను గుర్తు పెట్టుకుంటా’ అంటూ సీఎం వేలు చూపించి బెదిరించడంతో.. పాపం ఆ రిపోర్టరు ఠారెత్తిపోయాట్ట. ఏతావతా చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ లు ఎలా తయారయ్యాయంటే.. అటెండ్‌ అయ్యేవాళ్లలో రెండు గ్రూపులు ఉంటున్నారు. చంద్రబాబు గుడ్లురిమేలా కోపం తెప్పించడం ఎందుకు చెప్పిందేదో విని వచ్చేద్దాం అని మొక్కుబడిగా వెళ్లే బ్యాచ్‌ ఒకటి... మీ నిర్ణయాలు సూపర్‌ సార్, మీరు ఫారిన్‌ టూర్‌ వెళ్లి రాగానే రాష్ట్రానికి  ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి సార్‌ అంటూ చిడతలు వాయించే బ్యాచ్‌ ఒకటి. ఇదీ అమరావతి తాజా మీడియా పోకడ అన్నమాట!
Back to Top