కేసుల పబ్లిసిటీ షురూ..

– సిల్లీ కేసుతో బాబు గల్లీ రాజకీయం
– తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందే వ్యూహం
– కాంగ్రెస్, టీడీపీ మైత్రిని డైవర్ట్‌ చేసేందుకే.. 

పబ్లిసిటీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. తనకు నచ్చింది.. తోచింది చెప్పడమే తప్ప.. ప్రశ్నిస్తే బెదిరించడమే తప్ప ఏనాడూ సమాధానం చెప్పిన అలవాటు చంద్రబాబుకు లేనే లేదు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడు. ఒక పనికిమాలిన చిన్న కేసును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే వ్యూహంతో కొత్త నాటకానికి తెరదీశాడు.. 
ఇంతకీ ఏంటా కేసు..
2010లో తెలంగాణలో వచ్చిన ఉపఎన్నికలలో లబ్ధిపొందటానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం నాయకులు మహారాష్ట్ర కి వెళ్లి బాబ్లీ ప్రాజెక్ట్‌ అడ్డుకోవాలని హడావుడి చేసింది. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేకపోవడంతోపాటు అక్కడ పోలీసుల మీద చేయి చేసుకున్నందుకు వాళ్ళు టీడీపీ బృందం మీద న్యూసెన్స్‌ కేసు పెట్టారు. అదే రోజు పోలీసు స్టేషన్‌ కి వెళ్లి రూ.500 కడితే కేసు కొట్టేసేవాళ్ళు . కానీ బాబు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నట్లు నమ్మించటానికి నాటకం రక్తికట్టాలని అక్కడే కాసేపు బైఠాయించి హడావుడి చేసాడు . కొద్దిసేపటికి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేక విమానం పంపితే దానిలో తిరిగి వచ్చాడు.
కేసు తీవ్రత ఎంత..
నిజానికి ఇది ఒక సిల్లీ కేసు . జిల్లాల స్థాయిలో.. మండలాల స్థాయిలో పోలీసులు పెట్టే సిల్లీ కేసు ఇది. ఎప్పుడైనా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు చేసినా, అనుమతి లేకుండా మైకులు పెట్టినా, టైం దాటాక మీటింగ్‌లు నిర్వహించినా ఇంలాంటి కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులన్నీ పోలీసు స్టేషన్‌ స్థాయిలోనే కొట్టేస్తారు. సాధారణంగా రూ.500 పోలీసు స్టేషన్‌లో ఫైన్‌ కట్టి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదీ ఈ కేసుకున్న తీవ్రత.
ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చింది..
కేసు ఫైల్‌ చేసింది 2010లో. అప్పటి నుంచి  అక్కడ కోర్టు కూడా పట్టించుకోలేదు . అప్పుడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయబోతున్నాయి . మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తతో ఆరోజు కేసుని మళ్ళీ వెలికితీశారు . అప్పటి నుండీ ఈకేసు మీద ఎందుకు చర్య తీసుకోలేదని చంద్రబాబే స్వయంగా అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తతో పిటిషన్‌ వేయించినట్టు ప్రచారం సాగుతోంది. ఆ పిటిషన్‌ మీద స్పందించిన కోర్టు టీడీపీ బృందం కోర్టులో హాజరు కావాలని జులై 5న నోటీసు ఇచ్చింది . ఆగష్టు 16న హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆరోజు బాబుగారు బిజీగా ఉన్నారని దానిని సెప్టెంబర్‌ 21 వరకు మార్చారు.  జూలైలో వచ్చిన నోటీసుకి చంద్రబాబు బృందం తరుపున ఒక చిన్న లాయర్‌ వెళ్లినా కేసు కొట్టేస్తారు . కానీ అలా చేయకుండా దీనిని మోడీమీదకి నెట్టి సానుభూతి పొందటానికి స్కెచ్‌ వేసాడు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడటంతో ఇన్నిరోజులుకి ఆ పాత కేసుకి మెరుగులు దిద్ది నాటకానికి తెరలేపాడు. ఇలాంటి కేసులు జిల్లాలు, మండల స్థాయిలో ప్రతిరోజూ పోలీసులు పెడుతూనే ఉంటారు. కోర్టు ఇచ్చిన నోటీసులకు సకాలంలో స్పదించకపోతే ఎవరికైనా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయటం సర్వసాధారణం.
బాబ్లీ కట్టింది బాబు హయాంలోనే..
ఇందులో కామెడీ ఏమిటంటే మహారాష్ట్రలో బాబ్లీ కట్టింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే , అందులో అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు . ఆరోజు కళ్ళుమూసుకొని ఎన్నికలలో సానుభూతి కోసం ఇప్పుడు న్యూసెన్స్‌ కేసుని అడ్డంపెట్టుకొని హడావుడి చేయాలని చూస్తున్నాడు .

అక్కడ పోలీసులు , కోర్టులు మర్చిపోయిన ఒక సిల్లీ కేసుని తన మనిషి ద్వారానే కేసుని మళ్ళీ తెరిపించి ఆపరేషన్‌ గరుడ బెరుడా అని సినిమా వేషగాళ్లతో ప్రచారం కల్పిస్తూ సానుభూతికోసం పడరాని పాట్లు పడుతున్నాడు .


 
Back to Top