కాగ్ కడిగేసింది


చంద్రబాబు బండారాన్నంతా కాగ్ కడిగి ఆరేసింది. అప్పులు విపరీతంగా చేయడమే కాదు, వాటిని దాచాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. 20162017 సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. అందులోని ప్రతి అంశమూ చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతకు, అలక్ష్యానికీ సాక్ష్యంగా నిలిచాయి. 

ఆర్థిక భారం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తప్పు పట్టింది కాగ్ నివేదిక. 17,231 కోట్లు అప్పులు చేసి రెవెన్యూ వ్యయానికి వెచ్చించారని, ఇలా చేఐస్తే ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోతుందని హెచ్చరించింది. ఒకపక్కప్రభుత్వ పిడి ఖాతాల్లో భారీ మొత్తాల్లో సొమ్మును వినియోగించకుండా ఉంచడం, మరో పక్క అధిక వడ్డీకి అప్పులు తేవడం...రెండూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంత అల్లకల్లోలంగా నడుపుతున్నారో తెలియజేస్తున్న అంశాలు. 

సామాజిక రంగానికి మొండి చేయి

ఏ ప్రభుత్వమైనా ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, సామాజిక రంగాలపై ఎక్కువ శాతం నిధులను వెచ్చిస్తుంది. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వాల్లో కనిపించే ముఖ్య లక్షణం. కానీ బాబు గత ఏడాది సామాజిక రంగానికి పెట్టిన ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మొత్తం కేపిటల్ వ్యంలో కేవలం 4.62 శాతం మాత్రమే ఈ రంగానికి వినియోగించారు. విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, కుటుంబసంక్షేమం, పారిశుధ్య రంగాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసారని చెప్పింది కాగ్. 5,443 ప్రభుత్వ పాఠశాలలను మూసేసారని, బడిమానే పిల్లల శాతం పెరిగిపోయిందని, విద్యా శాఖకు ఇచ్చిన అడ్వాన్సులకు  లెక్కలు లేవని, పుస్తకాలు, యూనీఫామ్ ల పంపిణీ అంతా గందర గోళంగా ఉందని కాగ్ తీవ్రంగా విమర్శించింది. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన సర్వశిక్షా అభియాన్ లక్ష్యానికి కూడా బాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని పేర్కొంది కాగ్ నివేదిక. సకాలంలో యూసిలు సమర్పించకపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఎస్. ఎలకు విడుదల చేయకుండా అట్టేపెట్టుకోవడం వల్ల, తిరిగి కేంద్రం నుంచి పూర్తి నిధులు విడుదల కాలేదు. ఇచ్చిన నిధులు సంపూర్ణంగా వినయోగించకపోవటం, వాటి వినియోగ పత్రాలు ఎప్పటికప్పుడు అందజేకపోవడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఆలస్యంగా, అసంపూర్ణంగా వస్తున్నాయని కాగ్ నిర్థారించింది. 

కేంద్రనిధులను వాడుకోవడంలో నిర్లక్ష్యం

కేంద్రం విడుదల చేసిన నిధులను నిర్ణీత గడువులోపల సంబంధిత శాఖలకు బదిలీ చేయడంలోనూ బాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని దుయ్యబట్టింది కాగ్. 15 రోజుల లోపు చేయాల్సిన నిధుల బదిలీని 249 రోజులకు కూడా చేయని సందర్భాలున్నాయని, నిధుల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి ఇది అద్దం పడుతోందని అక్షింతలేసింది. దీనివల్ల రాష్ట్రానికి ఇస్తామన్న నిధుల్లో 48.96 కోట్లకు పైగా కోత పడ్డట్టు కాగ్ తెలియజేసింది. పనులు పూర్తియిన పథకాలను కూడా రాష్ట్రం ప్రారంభించలేదంది. కొన్ని పథకాలను మధ్యలోనే నిలిపేయడం వల్ల  491 కోట్లు ఉపయోగం లేకుండా అయ్యాయని కూడా వివరించింది. రక్షిత మంచినీటిని అందించడంలోనూ ప్రభుత్వం అలసత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది కాగ్. రాయలసీమ జిల్లాల్లో సరఫరా చేసే నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు తనిఖీల్లో వెల్లడైందని చెప్పింది. నీటిపరీక్షలకు ఉపయోగించే క్షేత్ర పరీక్షా కిట్లను 1.38 కోట్ల తో కొని   వాడకుండా మూల పడేసారని...ఇలాంటి వృధా వ్యయాలు మరెన్నో ఉన్నాయని పేర్కొంది. 

అంచనాల పెంపు మాయా జాలం

అచ్చంగా అంచనాల పెంపు పేరుతో జరిగే దోపిడీని కాగ్ నివేదిక కళ్లకు కట్టినట్టు వివరించింది. గత నాలుగేళ్లుగా బాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది ఈ అంచనాల పెంపు ప్రక్రియలే. పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ప్రచారాలకు అంచనాల వ్యయం ఇంతింతై వటుడింతైలా పెరిగిపోతూనే ఉంది. కేవలం ప్రాజెక్టుల కే 27,403 కోట్లు అంచనాల పెంపు చేసారు. 2017కల్లా పూర్తి చేస్తామని చెప్పి చివరకు చేతులెత్తేసారు. పథకాల పేరుతో చేసిన వ్యయం చాలా అన్యాయంగా ఉంది. ఒక్క నీరు చెట్టు పథకానికి 135 కోట్లు కేటాయించి, 1,242 కోట్లు ఖర్చు చేసారు. పుష్కరాలు, హారతులు, విదేశీయానాల కోసం చేసిన ఖర్చుల్లో ఎన్ని కోట్లు అంచనా వ్యయాలు పెరిగాయో మనకు అంచనాక్కూడా రాదు. దాదాపుగా 28 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని కాగ్ బైటపెట్టింది. కోర్ కాపిటల్ కోసం 48వేలకోట్లు కావాలని చంద్రబాబు గతంలో కేంద్రాన్ని అడిగారు. రాష్ట్రప్రభుత్వం గీసుకున్న డిజైన్లకు కనీసం డీపీఆర్ లు కూడా చూపించకుండా అన్ని కోట్లు ఇమ్మంటే వీలు కాదని కేంద్రం ఖరాఖండీగా చెప్పేసింది. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి ఇప్పటికే 1500 కోట్లు ఇచ్చామని, మరో 1000 కోట్లు మాత్రం ఇస్తామని కేంద్రం చెప్పింది. ముందిచ్చిన సొమ్మునంతా తాత్కాలికానికి తగలేసిన బాబు ఇంకా నిధులు కావాలనడం చూసి కేంద్రానికి కూడా చిర్రెత్తుకొస్తోంది. కాగ్ చెప్పిన ప్రకారం అంచనాల వ్యయం పేరుతో జరిగిన వేల కోట్లను వినియోగిస్తే ఈపాటికే కోర్ కాపిటల్ పూర్తి అయిపోయి ఉండేదిగా అనుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు సర్కార్ చేతగాని తనం వల్ల 64 ప్రభుత్వ రంగ సంస్థలకు 25వేల కోట్ల మేరకు నష్టం కలిగిందని కూడా కాగ్ తన నివేదికలో చెప్పుకొచ్చింది. 
ఏటా కాగ్ తో ఆక్షింతలేయించుకుంటున్న చంద్రబాబు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకున్నది లేదు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలు అడ్డగోలుగా ఉన్నా సరే బాబు మాత్రం వృద్ధి రేటు పెరిగిందని చెబుతాడు. అదే నోటితో లోటు బడ్జెట్ అని ఏడుపు ముఖం పెడతాడు. అవినీతిలో నా వేలు లేదు..నేను ఉప్పు మింగిన నిప్పు అని స్టేమెంట్లు ఇస్తాడు. చంద్రబాబు మాటలకు చేతలకు మధ్య పొంతనుండదని, చంద్రబాబు అంటేనే అవినీతికి పెద్ద కొడుకని కాగ్ మరోసారి తేల్చి చెప్పేసింది. 







 
Back to Top