కాగ్ మళ్లీ కడిగేసింది


ఎపి ప్రభుత్వానకి కాగ్ పదే పదే అక్షింతలు వేస్తూనే ఉంది... ప్రతిసారీ అవినీతిపైనే ఈ మొట్టికాయలు పడుతుండటం గమనించాల్సిన విషయం. 
201718 సవత్సరాలకు జరిగిన ఆడిట్ లో కాగ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడాన్ని తప్పు పట్టింది.
అసలు నిబంధనలే పాటించకుండా అధిక ధరలకు కాంట్రాక్టులు ఎలా ఒప్పుకున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విజిలెన్స్ మార్గదర్శకాలుగూడా పట్టించుకోరా అంటూ సీరియస్ అయ్యింది.  అంచనా వ్యయాన్ని పెంచేయడం, 62 నుండి 82 శాతం వరకూ అధిక ధరలు కోట్ చేసినా, ఆ సంస్థల టెండర్లు రద్దు చేయకపోగా వారితోనే సంప్రదింపులు చేసి, 14  నుంచి 24 శాతానికి పైగా చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారని కాగ్ ఆడిట్ లో నిరూపణ అయ్యింది. 
చివరకు కాంట్రాక్టు సంస్థలకు బిల్లుల చెల్లింపుల్లోనూ అక్రమాలు జరిగాయని, నిబంధనల మేర జరగలేదని కాగ్ తప్పు పట్టింది.  కొద్ది నెలల క్రితం వచ్చిన 2017 నాటి కాగ్ నివేదిక కూడా ఎపి ప్రభుత్వం పనితీరును తీవ్రంగా విమర్శించింది.  ఎపిలో వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ లేదని నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారని ఆరోపించింది అప్పటి కాగ్ నివేదిక.  రెవెన్యూ, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వివిధ పథకాల తీరుతెన్నులు, రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక, సాంకేతిక విద్య వీటన్నిటిలోనూ చాలా లోపాలున్నాయని కాగ్ తన నివేదికలో బైటపెట్టింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిధుల దుర్వినియోగాన్ని బట్టబయలు చేసింది.  తాగునీటి పథకం మొదలు భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకూ అంచనాలు పెరగడమే తప్ప క్షేత్ర స్థాయి పనులు సాగడం లేదని కుండ బద్దలు కొట్టింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలకు గండి, మరోపక్క పెరిగిపోతున్న అప్పులు, వృధా ఖర్చులు, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం చూస్తే రాష్ట్రంలో పాలన పడకేసినట్టుందని చెప్పింది నిరుటి కాగ్ నివేదిక. ఇది కేవలం 2017 సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలోని కొద్ది అంశాలు మాత్రమే.
ప్రతి ఏటా ఈ నివేదిక రావడం, చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి, అక్రమాల పుట్టను తవ్వి బయటపోయడం, మరు ఏడాదికి మళ్లీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా పెరగడం... నాలుగేళ్లుగా ఎపిలో సాగుతున్న పాలన తీరుతెన్నులు ఇవే... మరి ఇంత జరుగుతున్నా కేంద్రం ఏం చేస్తోంది అని అడగకూడదు... ఎందుకంటే ఎన్డీయేతో చంద్రబాబు విడిపోయినా ఆయన మాకు మిత్రుడే అంటూ పార్లమెంటులోనే ప్రకటించారు బిజెపి నాయకులు. చంద్రబాబు అవినీతి, ఓటుకు నోటు కేసులకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలను తాకట్టు పెట్టేశారు కనుక అటు టిడిపి, ఇటు బిజెపి తూకం సరిపోయిందని సరిపెట్టేసుకున్నాయి. అందుకే కాగ్ నివేదికలు చెప్పినా, కోర్టులు తిట్టినా, సర్వేలు బయటపెట్టినా, అంతర్జాతీయ సంస్థలే నోరెళ్లబెట్టినా బాబు అవినీతి భాగోతం అంతులేకుండా సాగుతోంది...ఆ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలిస్తే గానీ రాష్ట్రానికి మంచి రోజులు రావు... 
Back to Top