కాగ్‌ కడిగి పారేసింది

– చంద్రబాబు సర్కారు అవినీతిపై కాగ్‌ నివేదిక
– పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ. 199 కోట్ల కుంభకోణం
– చరిత్రగా ప్రచారం చేసుకున్న ప్రాజెక్టుకే అవినీతి మకిలి..
– ప్రతిపక్షం ఆరోపణలు నిజమని తేల్చిన నివేదిక 

పట్టిసీమను 173 రోజుల్లో రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. కృష్ణా–గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత మాదేనని పచ్చ మీడియా నిండా కథనాలు వండి వడ్డించింది. చంద్రబాబు లేకపోతే పట్టిసీమ ఏమైపోయేదో అన్నట్టుగా కలరింగ్‌ ఇచ్చుకున్నారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కిందని ఊదరగొట్టేశారు. అయితే తాజాగా ‘కాగ్‌’ ఇచ్చిన నివేదికతో చంద్రబాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. పట్టిసీమ పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. ముఖ్యంగా దేన్నైతే రికార్డుగా ప్రచారం చేసుకుంటున్నారో అదే ప్రాజెక్టు  విషయంలో ‘కాగ్‌’ చంద్రబాబు సర్కారును కడిగిపారేయడం విశేషం.  

అప్పుడు నిప్పు లాంటి నివేదిక.. ఇప్పడు కాదా..?
చంద్రబాబు సర్కార్‌ని ’కాగ్‌’ కడిగి పారేసింది. అసలు పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా జరిగే లబ్దికీ, చేసిన ఖర్చుకీ పొంతనే లేదని తేల్చేసింది. ఏ స్థాయిలో పట్టిసీమ పేరుతో చంద్రబాబు సర్కార్‌ ’మాయ’ చేసిందో అర్థం చేసుకోవచ్చు. పట్టిసీమ ఒక్కటే కాదు, ఇతరత్రా చాలా విషయాల్లో చంద్రబాబు సర్కార్‌ తీరుని ’కాగ్‌’ ప్రశ్నించింది. ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ’కాగ్‌’ని ’నిప్పులాంటి నివేదిక’గా అభివర్ణించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ‘కాగ్‌’ నివేదికపై బొంకుతున్నాడు. 

అవినీతి చరిత్ర 
ప్రధానంగా పట్టిసీమ ప్రాజెక్ట్‌పై ’కాగ్‌’ నిప్పులు చెరిగింది. రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని.. ఇది ఒక చరిత్ర అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న సర్కారుకు కాగ్‌ నివేదిక మింగుడు పడటం లేదు. పట్టిసీమ ప్రాజెక్టుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దొరికిందని చంకలు గుద్దుకున్న చంద్రబాబు సర్కారుకు కాగ్‌ రిపోర్టుతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి వందల కోట్ల దోపిడీ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఆ ఆరోపణలే నిజమని ఇప్పుడు ’కాగ్‌’ ధృవీకరించింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షం, పట్టిసీమ ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు సర్కార్‌ అవినీతికి తెరలేపిందనీ, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం ద్వారా తెరవెనుక లాలూచీలతో ప్రభుత్వ పెద్దలు లాభపడ్డారనీ ఆరోపించిన విషయం విదితమే. ’కాగ్‌’ నివేదికలో కాంట్రాక్టర్లకు ఏ స్థాయిలో ’లాభాలు’ అప్పనంగా చంద్రబాబు సర్కార్‌ కట్టబెట్టిందో స్పష్టంగా పేర్కొంది. 

అధిక ధరలతో టెండర్లకు ఆహ్వానం 
పట్టిసీమను ఓ ప్రతికూల ప్రాజెక్ట్‌గా కాగ్‌ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌పై ఖర్చు చేసిన దానికి, దాని వల్ల పొందే ప్రయోజనానికి మధ్య పొంతనే లేదని కాగ్‌ వెల్లడించింది.  పోలవరం కుడికాల్వ, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చేపట్టారని కాగ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ పథకం చేపట్టడం మూలంగా ప్రాజెక్ట్‌ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది. పట్టిసీమ టెండర్‌ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడా సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారని.. దీని ద్వారా 199 కోట్ల అధనపు భారం పడిందని కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. అవసరం లేకున్నా నిర్మాణ పద్ధతిని మార్చారని, దీని ద్వారా 106 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. పైపుల మీద రాయితీ ఉన్నా.. సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని కాంట్రాక్టర్‌కు తిరిగి చెల్లించారని రిపోర్ట్‌ వెల్లడించింది. ఈపీసీ ఒప్పందాల్లో లేని నిబంధనల కారణంగా ప్రభుత్వం మరో రూ. 20.62 కోట్లు నష్టపోయిందని వెల్లడించింది.
Back to Top