హోదా ఉద్య‌మంపై దౌర్జన్యం..

– హోదా పోరుపై చంద్రబాబు ఉక్కుపాదం
– పోలీసులను మోహరించి ఉద్యమకారులకు బెదిరింపులు
– అరెస్టును ప్రతిఘటించి ఉద్యమకారుడు కాకి దుర్గారావు మృతి 

పోరాటాలపై దౌర్జన్యం, నినదించే గొంతులు నొక్కేయడం, కేసులతో బెదిరించడం, పోలీసులను పంపించి అణచివేయడం.... నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రభుత్వం చేస్తున్న ఎదురుదాడిది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు హోదా పేరెత్తితో చాలు చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తుంది. నాలుగేళ్లు ఉక్కుపాదం మోపుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. హోదా ఉద్యమం హోరెత్తుతున్న విషయాన్ని గ్రహించి వెనక్కి తగ్గింది. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది.. ప్యాకేజీ కంటే హోదాతో ఏం లాభం ఏముంది.. హోదా ఉన్న రాష్ట్రాలు ఏమాత్రం అభివృద్ధి చెందాయి.. నాకు చెప్పండని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు..,  ప్రజల ఆకాంక్ష, వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ ఫలితంగా యూటర్న్‌ తీసుకున్నారు. ప్యాకేజీ బాగుందన్న నోటితోనే... ఏపీకి ప్రత్యేకహోదా కావాలని మళ్లీ మొదటికొచ్చాడు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ నాలుగేళ్లుగా ఏ ప్రత్యేక హోదా కోసమైతే వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందో.. అదే హోదా కావాలని టీడీపీ కూడా దిగొచ్చింది. పేరుకి హోదా కోసమే అని చెప్పినా అందులో చిత్తశుద్ధి ఎంత ఉందనేది ఇక్కడ ప్రశ్న. 

చిత్తశుద్ధి లేని పోరాటం...

ముఖ్యమంత్రి అయిన మొదట్లో కొన్నాళ్లు అదిగో హోదా వచ్చేస్తుందని కొన్నాళ్లు టైంపాస్‌ చేశాడు. పోలవరం, రాజధాని నిర్మాణం కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదా  కాదని ప్యాకేజీ బాగుందని అంగీకరించాడు. సభ నిర్ణయం తీసుకోకుండా మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మాణం చేశాడు. కనీసం ప్యాకేజీకి చట్టబద్దత అడిగితే దానినీ సాధించలేకపోయాడు చంద్రబాబు. చివరికి వైయస్‌ఆర్‌సీపీ దూకుడును తట్టుకోలేక.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చారు. అవిశ్వాసం పెడతామని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చినా.. అవిశ్వాసంతో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురు ప్రశ్నించిన బాబు.. చివరికి ఆయన కూడా వైయస్‌ఆర్‌సీపీ దారిలోకే వచ్చాడు. అనుభవం ఉంది.. గెలిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని నమ్మబలికిన బాబు... నాలుగేళ్లుగా  చేసిన ప్రతి పనీ పబ్లిసిటీ కోసమో.. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయమో తప్ప చిత్తశుద్ధితో ఏపీ కోసం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. 

బలిదానాలకూ చలనం లేదు..

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని ట్విట్టర్‌లో, ప్రెస్‌మీట్‌లో చెప్పే చంద్రబాబు.. హోదాపై కేంద్రం చేసిన మోసానికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తే.. అధికార టీడీపీ మాత్రం ఇళ్లకే పరిమితమైంది. హోదా కోరుకునే వారైతే ధర్నాలో పాల్గొనేవారే. రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబుకు  రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టే వైయస్‌ఆర్‌సీపీ ధర్నాకు మద్దతు ప్రకటించలేదు. చివరికి హోదా సాధన పోరులో ప్రాణాలు పోతున్నా చంద్రబాబులో చలనం రాకపోవడం దారుణం. మంగళవారం జరిగిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలో పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన కాకి దుర్గారావు అనే వ్యక్తి పోలీసుల అరెస్టును ప్రతిఘటిస్తూ గుండెపోటుతో అసువులు బాసాడు. ఇంకెందరి ప్రాణాలు పోతే చంద్రబాబులో మార్పొస్తుందో చూడాలి.. 
Back to Top