బీజేపీ.. టీడీపీ దొంగ నాటకం!

  • హోదా ఇచ్చేది లేదని ముందే బాబుకు చెప్పిన మోడీ
  • అందుకే ప్యాకేజీ పల్లవిని అందుకున్న బాబు
  • ఓటుకు నోటు వ్యవహారంతో కేంద్రం వద్ద సాగిలపడిన ఏపీ సీఎం
  • అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడులను రంగంలోకి దింపిన కేంద్రం
  • హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామంటూ ప్రచారం
  • నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • హోదా కోసం రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తున్నవైయస్‌ఆర్‌సీపీ
 ‘‘వెంకన్న సాక్షిగా చెబుతున్నాం. మేం అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం’’ అని అప్పటి ప్రధాని అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ముందు తిరుపతి బహిరంగ సభలో చెప్పారు. ‘‘ఏపీకి 10 ఏళ్లు కాదు.. 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తాం’’  అని అదే వేదికపైనుంచి చంద్రబాబు నాయుడు చెప్పారు. అంతేకాదు రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను  ప్రధాన అంశంగా కూడా పెట్టుకున్నాయి. కట్‌ చేస్తే  హోదా ఇవ్వలేం.. అంతకు మించిన ప్యాకేజీ ఇస్తామని అరుణ్‌జైట్లీ చెప్పడం... దాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు అనడం నిమిషాల్లో అయిపోయాయి. 

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని భారతీయ జనతా పార్టీకి రెండున్నరేళ్ల తర్వాత అర్థమైందా? అసలు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పేందుకు ఎందుకు సిద్ధమైంది? చంద్రబాబు నాయుడు.. మోడీ ప్యాకేజీ గురించి ముందే మాట్లాడుకున్నారా? అంటే మాత్రం ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. 

ముందు తెలియదా?
ప్రత్యేక హోదా ఇవ్వడానికి  కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ సిఫార్సులను అడ్డం పెడుతోంది. అసలు నీతి అయోగ్‌ను సృష్టించిందే కేంద్రం.  రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఆయోగ్‌ను తీసుకొచ్చారు.  అలాంటి దాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదాను  ఇవ్వలేమనడం దుర్మార్గం. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ప్రకటిస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10 ఏళ్లు ఇస్తామని చెప్పడం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టుకుని హోదాను ఇస్తామని సభల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడమం ప్రజలను మోసం చేయడం కాదా? లేదంటే ఓట్ల కోసమే నాడు హామీ ఇచ్చారా? అనేది ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌ అడ్డంకిగా ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసగించడమే. 14వ ఆర్థిక సంఘం... మార్గదర్శక సూత్రాల అమలుకు, నీతిఆయోగ్‌... విధి విధానాలు అమలు చేస్తాయి. కానీ అవి స్వయంప్రతిపత్తి వ్యవస్థలు కావు. పార్లమెంటుకు లోబడి పని చేయాల్సి ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు కేంద్ర పెద్ద ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పడం దుర్మార్గం. 

చావు కబురు చల్లగా...
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి భాగస్వాములైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి ప్రత్యేక హోదా చావు కబురును చల్లగా వెల్లడించాయి. రాష్ట్ర ప్రజల్లో సజీవంగా నిలిచిన ప్రత్యేక హోదాను బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా వెంటిలేటరుపై ఉంచాయి. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా రెండున్నరేళ్లుగా దాచిపెట్టాయి. ఉమ్మడిగా దాచిపెట్టి ప్రజలను మోసగించాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, అందుకు తగ్గ సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అర్ధరాత్రి ప్రకటించడం కూడా వ్యూహాత్మకంగా ఉందని భావించాల్సి ఉంది. అదే రోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించిన తీరు చూస్తే, రెండు పార్టీల పెద్దల  అంగీకారంతోనే అరుణ్‌ జైట్లీ ప్రకటన వచ్చినట్లు స్పష్టమవుతోంది. 

ఇద్దరూ కలిసే ఏపీకి ద్రోహం
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే ఏపీకి అన్యాయం చేశారని, మేధావులు, ప్రజలు అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఏపీకి హోదా వద్దు ప్యాకేజీ కావాలని బాబు మోడీని అడిగినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే వెంటనే హోదా ఇవ్వలేమని చెబితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, చాలా రోజులు అలా వెంటిలేటర్‌పై పెట్టి ఆలస్యంగా చెబితే దాని తీవ్ర తగ్గుతుందని భావించే మోడీ, చంద్రబాబు ఆలస్యంగా ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారని వారంటున్నారు. అయితే హోదా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వలేమని చెప్పిన ఈ ప్రభుత్వాలు భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని మేధావులుఅంటున్నారు. 

హోదాకోసం వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ గత రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. యువభేరి కార్యక్రమాలతో విద్యార్థులను, ప్రజలను చైతన్య పరుస్తూనే ఉంది. కాగా ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సాధ్యమైనప్పుడు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా సాధించడం పెద్ద కష్టమేమి కాదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
Back to Top