ప్రతి దారీ జన ఝరీ తరంగమే!

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కొనసాగుతున్నంత మేరా అందరి కళ్లూ ఆనందంతో తళుక్కుమంటున్నాయి? అడుగు వేయడానికైనా జవసత్వాలన్నింటినీ కూడగట్టుకోవాల్సి వృద్ధులు కూడా చకచకా ముందుకు కదులుతున్నారు. హారతి పళ్ళాలు పట్టుకుని, దోసిళ్లలో పూలు నింపుకొని మహిళలు నిరీక్షిస్తున్నారు. యువత అయితే ఉత్తుంగ తరంగమే అవుతోంది. మగ్గాలు వదిలి నేతన్నలు పరుగులు తీస్తున్నారు. వీరందరిలో ఈ ఆరాటం ఎందుకు? ఎందుకంటే - అందరి బతుకుల్లో ఆనందం నింపడానికే అహరహం శ్రమించిన తమ రాజన్న బిడ్డ వస్తోందని! ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకుమన్న ధీమాను ఇచ్చే శ్రీ జగనన్న సోదరి శ్రీమతి షర్మిల వస్తోందని! మరి - ఆమె పాదయాత్ర సాగే ప్రతి దారీ ‘జనఝరీ’ తరంగం అవుతోందంటే అవదా మరి!

పెదపూడి (తూ.గో.జిల్లా) :

మహానేత డాక్టర్ రాజన్న బిడ్డ రాకతో‌ తూర్పు పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. మెట్టినింటి నుంచి ఆడపడుచు పుట్టింటికి వచ్చినంత సంభ్రమం ప్రతి ఒక్కరి ముఖంలోనూ తొణికిసలాడుతోంది. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తూ తమ దగ్గరకి వచ్చిన శ్రీమతి షర్మిలను ప్రజలు చీరలపై, పూలపై నడిపిస్తున్నారు. హారతులు పడుతున్నారు. బాణాసంచా కాలుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతున్నారు. ‘ఏమ్మా బాగున్నారా?’ అన్న ఆప్యాయత నిండిన శ్రీమతి షర్మిల పలకరింపు విని పులకించిపోతున్నారు. ‘త్వరలోనే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు.. రాజన్న రాజ్యం తెచ్చి మీ కష్టాలన్నీ తీరుస్తాడు’ అంటూ ఆమె ఇస్తున్న భరోసాతో ఉపశమనం పొందుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటక పాలన, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిలను చూడాలని, ఆమెతో కరచాలనం చేయాలని, తమ కష్టాలు చెప్పాలని దారిపొడవునా ప్రజలు ఎదురుచూశారు.

సూర్యదేవుడిని దర్శించుకున్న షర్మిల :
గొల్లలమామిడాడ ఫ్యామిలీ హెల్తు క్లబ్ నుంచి‌ ఉదయం ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్రకు మేళతాళాలు, మంగళవాయిద్యాలు, గారడీ నృత్యాలు, భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో ఘన స్వాగతం లభించింది. అనపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో జి.మామిడాడ ప్రధాన రహదారి కిలోమీటర్ల మేర ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసింది. అందరినీ పలకరిస్తూ, కష్టాలు తెలుసుకుంటూ, త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసానిస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. జి.మామిడాడలో శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రత్యేకతను తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వివరించారు. మహానేత డాక్టర్ వై‌యస్ రెండు సార్లు, జగనన్న ఒకసారి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు.

భాస్కర రామారావు కుటుంబం‌ చీర, సారె :
శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రధాన రహదారి మీదుగా పెద్దాడ వైపు సాగింది. గ్రామంలోని 12 అంతస్తుల కోదండ రామాలయాన్ని ఆమె ఆసక్తిగా తిలకించారు. లక్ష్మీనరసింహపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి‌ డాక్టర్ వైయస్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్ అంబేద్క‌ర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళు‌లు అర్పించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు స్వగ్రామమైన పెద్దాడలో ఆయన, ఆయన సతీమణి జగన్మోహిని దంపతులు, వారి కుమారుడు అనంత వెంకటరమణ చౌదరి, సురేఖ దంపతులు శ్రీమతి షర్మిలకు చీర, సారె పెట్టి ఆత్మీయ సత్కారం చేశారు. యార్లగడ్డ సోమరాజు రోడ్డుపై పూలు చల్లి స్వాగతం పలికారు. బొడ్డు భాస్కరరామారావు కాలనీ వద్ద మహిళలు రోడ్డుపై చీరలు పరిచి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. కైకవోలు క్రాస్‌రోడ్డు వద్ద వేలాదిమంది స్వాగతం పలికారు.

అక్క నా బుగ్గలు నిమిరింది! :
పెదపూడి శివార్లలో భోజన విరామం అనంతరం ప్రారంభమైన పాదయాత్ర పెదపూడి, పెద్దాడ, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురత్రయం వరకు కొనసాగింది. పెదపూడి వాసులు పూలబాట పరిచి, బాణాసంచా కాల్చి, పూలవర్షంతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కర్నీ ‘బాగున్నావయ్యా...బాగున్నావమ్మా’ అంటూ పలకరిస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల బుగ్గలు నిమురుతూ ఆప్యాయత కనబరిచారు. ‘అక్క నా బుగ్గలు నిమిరింది’ అంటూ చిన్నారులు, ‘షర్మిలమ్మ నాకు షేక్‌హాండ్ ఇచ్చారు’ అ‌ని యువతులు మురిసిపోయారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా చేనేత విభాగం కన్వీన‌ర్ పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో పెదపూడి గౌరమ్మపేటలో శ్రీమతి షర్మిలపై యువత పూలవర్షం కురిపించారు. సెంటర్‌లో ఉన్న మహానేత వైయస్ విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రామకృష్ణ శ్రీమతి షర్మిలకు వినతిపత్రం అందజేసి చరఖాను బహూకరించారు.

పాదయాత్ర సాగిన దారుల పొడవునా జనమే జనం. పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురత్రయం గ్రామాల్లో రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. రాత్రి ఏడుగంటల సమయంలో అచ్యుతాపురత్రయం శివారులో ఏర్పాటు చేసిన బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. ఈ సందర్భంగా బొడ్డు భాస్కరరామారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాల్చిన బాణాసంచా ఆకట్టుకుంది.

తాజా వీడియోలు

Back to Top