భవితకు భరోసా.. నవశకానికి నగారా

కృష్ణా జిల్లా మహానేత తనయకు హారతులు పట్టింది. కష్టాలు ఆలకిస్తూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భవితకు భరోసానిస్తూ.. నవశకానికి నగారా మోగిస్తూ సాగిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  తనయ శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర లో ఆవిష్కృతమైన దృశ్యమిది.
విజయవాడ, 22 ఏప్రిల్ 2013:

చరిత్రను సృష్టించే అరుదైన నేత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రజాప్రస్థానం పాదయాత్రతో జనం మనిషయ్యారు. తన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల దేవుడయ్యారు. ఈ శతాబ్దం ఆయనదే. ఆయన చెప్పిన మాట, చూపిన బాటే ఏ పార్టీకైనా, ఏ నేతకైనా దిక్సూచిగా నిలుస్తుంది. నాడు తెలుగుదేశం పాలనలో మాదిరిగానే నేడు కిరణ్ సర్కార్‌లో జనం కష్టాలు అనుభవిస్తున్నారు. వారి కన్నీళ్లు తుడిచి.. మనోధైర్యం కల్పించేందుకు జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి సూచనతో శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టారు. తండ్రి డాక్టర్ వైయస్‌ను జ్ఞప్తికి తెస్తూ.. ప్రజల వేదన, ఆవేదన అర్థం చేసుకుంటూ.. వారికి భరోసానిస్తూ.. అలుపెరుగని బాటసారిగా ఆమె ముందుకు సాగుతున్నారు.

వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ఆమె పాదయాత్ర గత నెల 26న గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణమ్మ చల్లని చూపులు, దుర్గమ్మ ఆశీస్సుల నడుమ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలు, 23 మండలాల్లోని వందల గ్రామాల్లో 27 రోజులపాటు 340.8 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గండ్రాయి గ్రామం నుంచి ఖమ్మం జిల్లా వల్లభి గ్రామంలోకి ప్రవేశించనుంది. జిల్లాలోని యాత్రలో ఒకరోజు మాత్రమే విరామం ఇచ్చారు.
డాక్టర్ వైయస్ఆర్‌ను గుర్తుకుతెస్తూ..
పాదయాత్రలో శ్రీమతి షర్మిల అచ్చం నాన్నలా ప్రజలతో మమేకమవుతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒకింత ధైర్యం చెబుతూ.. మేమున్నామన్న భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మండుటెండల్లో ఆమె చెరగని చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తూ వారు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకిస్తూ.. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వస్తుంది.. కష్టాలన్నీ తీరాయంటూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఆమె యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

జిల్లాలో అరుదైన రికార్డులు..

ఒక మహిళ ఏకంగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ చరి త్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోనున్న ‘మరో ప్రజాప్రస్థానం’లో అరుదైన రికార్డులకు జిల్లా వేదిక కావడం విశేషం. పెడన నియోజకవర్గం వచ్చేసరికి శ్రీమతి షర్మిల పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తిచేసి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డుకు తీపిగుర్తుగా పెడన బైపాస్‌రోడ్డులో 18అడుగుల డాక్టర్ వైయస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. పాదయాత్ర చేపట్టి 50వ అసెంబ్లీ నియోజకవర్గంగా పెడన మరో రికార్డు నెలకొల్పింది. మహానేత ప్రజాప్రస్థానానికి పదేళ్లు పూర్తై రోజున శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గుడివాడ నియోజకవర్గంలోని నందివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని చేపల చెరువు గట్టుపై రైతు నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో  మొక్కలు నాటారు.

11 రచ్చబండలు.. 14 సభలు..

పాదయాత్రలో శ్రీమతి షర్మిల వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసి వారి కష్టాలు తెలుసుకునేందుకు రచ్చబండలు నిర్వహిస్తున్నారు. వాటిలో జనానికి కొండంత ధైర్యం అందిస్తున్నారు. బహిరంగ సభల ద్వారా వేలాది జనానికి భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో 11 రచ్చబండ కార్యక్రమాలు, 14 బహిరంగ సభలు నిర్వహించారు. కిరణ్ సర్కార్‌లో తాము అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లను మహిళలు రచ్చబండ కార్యక్రమాల్లో శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నారు. సాగునీరులేక నష్టపోతున్నామని, గిట్టుబాటు ధర దక్కడంలేదని, తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలతో నష్టపోతున్నామని రైతులు వేదన చెందారు. రైతులు, కూలీలు, పేదలు, మహిళలు, వికలాంగులు, నిరుద్యోగులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల వారి బాధలను దగ్గరగా చూసిన షర్మిల చలించిపోయారు. జగనన్న దృష్టికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకుని ముందుకు కదిలారు. రాజన్న రాజ్యంలో తమ కడగండ్లు తీరేందుకు జగనన్న అధికారానికి వస్తారని షర్మిల జనం మదిలో ఒక భరోసా నింపారు.

కలిసి కదిలిన జనప్రవాహం..

శ్రీమతి షర్మిల రాకతో జిల్లాలో ఉత్సాహం వెల్లువెత్తింది. పాదయాత్రలో ఆమెను అనుసరిస్తూ వేల అడుగులు కది లాయి. పాదయాత్ర సాగిన ప్రాంతాలు జనప్రవాహమయ్యాయి. ఎక్కడికి వెళితే అక్కడ ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్త్తూనే.. చేలకు కనీసం సాగునీరివ్వని పాలకుల తీరును ఎండగడుతూ బీడువారిన పొలాల్లోనే బస చేశారు. వరి, మామిడి, మొక్కజొన్న, ప్రత్తి, మిర్చి రైతుల కష్టాలు అర్థంచేసుకున్నారు. ఆమె నిర్వహించిన బహిరంగసభలు గతమెన్నడు జరగని రీతిలో జనం కిక్కిరిసిపోయాయి.

Back to Top